సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారు (వీఆర్వో)లను రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 5,348 మంది వీఆర్వోలు గత కొన్ని నెలలుగా పనిలేకుండా ఖాళీగా ఉంటున్నారు. అవసరాన్ని బట్టి వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని, అప్పటివరకు వారికి యథావిధిగా జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిలో 40 శాతం మందిని పురపాలక శాఖలోకి తీసుకోనున్నారు.వార్డుకొకరు చొప్పున: జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో దాదాపు 2,200 వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తొలుత ప్రత్యక్ష నియామకాల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కొత్త పోస్టులు సృష్టించడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ పురపాలక శాఖ ఇటీవల ప్రతిపాదనలు సైతం పంపించింది. అయితే వీఆర్వోలను పురపాలక శాఖలో విలీనం చేసుకుని వార్డు ఆఫీసర్లుగా నియమించాలనే ఆలోచన రావడంతో ప్రత్యక్ష నియామకాల ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనబెట్టింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం రూపొందించాల్సి ఉంది. ప్రభుత్వ అవసరాలు, ఖాళీలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలో విలీనం కావడానికి వీఆర్వోల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇతర శాఖల్లో వీఆర్వోలను విలీనం చేస్తే 5,348 మందిలో 40 శాతం మంది ఒక్క పురపాలక శాఖకే వస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కొత్త పుర చట్టం అమలుకే...
పురపాలనలో సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చింది. వార్డు/ డివిజన్ స్థాయిలో ఈ చట్టం అమలు బాధ్యతలను వార్డు ఆఫీసర్లకు అప్పగించబోతోంది. వార్డు కమిటీలతో సమావేశాలు నిర్వహించడం, వార్డు అభివృద్ధి పనుల్లో కౌన్సిలర్లు/ కార్పొరేటర్లతో సమన్వయం చేసుకోవడం, హరితహారం కింద మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం, పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించడం, అక్రమ నిర్మాణాలపై నిఘా వేయడం, ఆస్తి పన్ను వసూళ్లు తదితర బాధ్యతలను వార్డు ఆఫీసర్లకు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, లేక కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం నాటిన వాటిలో 85 శాతం మొక్కలను పరిరక్షించడంలో విఫలమైనా వార్డు ఆఫీసర్లను బాధ్యులుగా చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment