పంచాయతీకో కార్యదర్శి | Telangana Panchayat Secretary Recruitment | Sakshi
Sakshi News home page

పంచాయతీకో కార్యదర్శి

Published Sat, Apr 13 2019 11:06 AM | Last Updated on Sat, Apr 13 2019 11:06 AM

Telangana Panchayat Secretary Recruitment - Sakshi

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేస్తున్న జిల్లా అధికారులు

నేరడిగొండ(బోథ్‌): గ్రామపంచాయతీల్లో నూతన కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రామ పంచాయతీకో కార్యదర్శిని నియమించింది. దీంతో గ్రా మపంచాయతీలు అభివృద్ధి పథంలో పయనించనున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉండగా కార్యదర్శులు 132 మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 335 మంది పంచాయతీ కార్యదర్శుల కొరత ఉండేది. ఒక్కో కార్యదర్శికి మూడు నుంచి నాలుగు గ్రామాల చొప్పున అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో 2018 అక్టోబర్‌లో ప్రభుత్వం గ్రామపంచాయతీ సెక్రెటరీల నియామకం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎంపిక ప్రక్రియ చేపట్టింది.

రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేపట్టారు. డిసెంబర్‌లో సర్టిఫికెట్ల పరిశీలన సైతం జరిపారు. అనంతరం కొంద రు అభ్యర్థులు ప్రభుత్వం రోల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించడం లేదని, పరీక్షల్లో ప్రశ్నలను తప్పుగా ఇచ్చారని కోర్టుకు వెళ్లిన విషయం విధితమే. దీంతో నియామకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కోర్టు క్లియరెన్స్‌ ఇవ్వడంతో ఇప్పటికే కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుక్రవారం నియామక పత్రాలను అందించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టాలనే ఆదేశాలతో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

290 మంది జూనియర్‌ పంచాయతీల నియామకం
ఆదిలాబాద్‌ జిల్లాలో 335 పంచాయతీ కార్యదర్శులు ఖాళీగా ఉండగా ఇటీవల రాసిన పంచాయతీ పరీక్షలో ఫలితాలు సా«ధించిన 318 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 290 మందికి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా నియామక పత్రాలు అందించారు. మరో 28 మందిని పూర్తి వివరాలు సేకరించి నియామక పత్రాలు అందజేస్తామని జిల్లా అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని స్థానాల్లో నియామకం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

తీరనున్న సమస్యలు..
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర. జనన, మరణ ద్రువీకరణ పత్రాలతోపాటు 18 రకాల సర్టిఫికెట్లు ఇచ్చేది వారే. గ్రామాభివృద్ధి కోసం విడుదలయ్యే నిధులు ఎన్ని, ఖర్చు చేసింది ఎంత, తాగునీరు, పన్నుల వసూళ్లు, అత్యవసరంగా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, తదితర అంశాలన్ని కార్యదర్శులే చేపట్టాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. నూతనంగా జూనియర్‌ కార్యదర్శులు గ్రామానికొకరు రానుండడంతో సమస్యలు పరిష్కారం కానున్నాయి. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు..
నూతనంగా ఎంపికైన కార్యదర్శులకు నియామక పత్రాలను అందజేశాం. వీరికి సంబంధించిన సర్టిఫికెట్లను గతంలోనే పరిశీలించాం. గ్రామానికో కార్యదర్శి నియామకంతో పల్లెల్లో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి నోచుకుంటాయి. దీంతో పాలన సౌలభ్యంగా ఉంటుంది. మరిన్ని ఖాళీలను భర్తీ చేస్తాం. – టి.సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి 

సంతోషంగా ఉంది
కాస్త ఆలస్యమైనా నియామకాలు చేపట్టడం సంతోషంగా ఉంది. 2018 అక్టోబర్‌ 10న రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలను అదే ఏడాది డిసెంబర్‌ 18న వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన సైతం చేశాక న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కావడంతోపాటు శాసన మండలి ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు రావడంతో నియామకంలో ఆలస్యం జరిగింది. శుక్రవారం నియామక పత్రం అందజేయడంతో సంతోషంగా ఉంది. – కొప్పుల రవీందర్, వడూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement