Telangana News: ఉమ్మడి నల్గోండ జిల్లాలో పార్లమెంట్‌ స్థానాల్లో పోటి పై మొదలైన రాజకీయ చర్చ!
Sakshi News home page

ఉమ్మడి నల్గోండ జిల్లాలో పార్లమెంట్‌ స్థానాల్లో పోటి పై మొదలైన రాజకీయ చర్చ!

Published Thu, Dec 14 2023 2:16 AM | Last Updated on Thu, Dec 14 2023 12:06 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్‌ స్థానాల్లో పోటీపై రాజకీయవర్గాల్లో చర్చ జోరందుకుంది. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో మూడు ప్రధాన పార్టీల్లో ఎంపీ టికెట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించడంతో ఆ పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. సీనియర్‌ నేతలతో పాటు ముఖ్య నేతలు కూడా ఎంపీ టికెట్‌పై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోవడంతో ఎంపీ టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యుల నుంచి హామీ పొందిన నేతలు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు.

మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి
నాగార్జునసాగర్‌ ఎన్నికల బరి నుంచి తప్పుకొని, తన కుమారుడికి టికెట్‌ ఇప్పించుకున్న పార్టీ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తన మనసులో మాట బయట పెట్టారు. పార్టీ ఆదేశిస్తే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని పేర్కొన్నారు. రాజకీయాల నుంచే తప్పుకుంటానని చెప్పిన ఆయన ఈ మాట చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

మూడు రోజుల క్రితం.. సీఎం రేవంత్‌రెడ్డి తన ఇంటికి వచ్చి వెళ్లిన తరువాత కూడా జానారెడ్డి ఇదే మాట చెప్పారు. దీంతో ఈసారి ఆయన పోటీలో ఉంటారన్న చర్చ సాగుతోంది. ఆయన పెద్ద కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి కూడా ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు బరిలో ఉంటారన్నది చర్చనీయాంశంగా మారింది.

పటేల్‌ రమేష్‌రెడ్డికి హామీ..
సూర్యాపేట అసెంబ్లీ టికెట్‌ను సీనియర్‌ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ఇచ్చిన సమయంలో అక్కడి నుంచి టికెట్‌ ఆశించిన పటేల్‌ రమేష్‌రెడ్డికి అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది.

నల్లగొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్‌ ఇస్తామని కేసీ వేణుగోపాల్‌ కూడా ఆయనకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రమేష్‌రెడ్డికి ఎంపీ టికెట్‌ కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోనే ఏదైనా పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది.

బీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు ఆశావహులు
నల్లగొండ ఎంపీ స్థానానికి బీఆర్‌ఎస్‌ నుంచి శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మునుగోడు టికెట్‌ ఆశించారు.

అయితే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే టికెట్‌ కేటాయించడంతో అమిత్‌కు లోక్‌సభ టికెట్‌ ఇస్తారన్న చర్చ సాగింది. మరోవైపు వ్యాపారవేత్త నరేందర్‌రెడ్డి కూడా అప్పట్లో నల్లగొండ ఎంపీ టికెట్‌ ఆశించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రచార సభల్లోనూ ఆయన పాల్గొన్నారు.

కమలం దళం నుంచి ప్రసాద్‌
బీజేపీ నుంచి నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు ప్రసాద్‌కు గతంలోనే పార్టీ హామీ ఇచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంకినేని వెంకటేశ్వర్‌రావుతోపాటు ఒకరిద్దరు నేతల పేర్లు కూడా పార్టీ ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

భువనగిరి స్థానంపై యువనేతల దృష్టి
భువనగిరి ఎంపీ టికెట్‌ రేసులో సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై తుంగతుర్తిలో మందుల సామేల్‌ గెలుపు కోసం పనిచేశారు. తాను ఎంపీగా పోటీ చేస్తానన్న విషయాన్ని కూడా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఆయనకు ఎంపీ టికెట్‌ ఇస్తారన్న చర్చ సాగుతోంది. అయితే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీలో దింపుతారనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కుమార్తె కీర్తిరెడ్డి కోసం టికెట్‌ అడుగుతున్నట్లు తెలిసింది.

ఇక బీఆర్‌ఎస్‌ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని బరిలో నిలుపుతారనే చర్చ సాగుతుండగా, బీసీకి ఇవ్వాల్సి వస్తే జనగామకు చెందిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్‌ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement