ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం
- 38 లక్షలమంది యువత లక్ష్యంగా కసరత్తు
- మొబైల్ ఫోన్ ద్వారా దరఖాస్తుకు అవకాశం
- ఓటర్ల నమోదుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్, లెట్స్ ఓట్ సంస్థల సహకారం
- ఓటర్‌గా నమోదు కావాలనుకునే వారు మండల కార్యాలయాలకు వెళ్లి ఓటర్ నమోదు పత్రాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. అలాగే ఓటర్ జాబితాల్లో సవరణలు కావాలంటే మరో పత్రాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. వచ్చే నెల 10వ తేదీ వరకు మండల కార్యాలయాల పనిదినాల్లో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డిప్యుటీ మున్సిపల్ కమిషనర్ల కార్యాలయాల్లో ఓటర్‌గా నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
- అలాగే ప్రత్యేకించి పోలింగ్ కేంద్రాల వారీగా ఆదివారాలైన ఈ నెల 24వ తేదీ, వచ్చే నెల 1, 8వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌స్థాయి ఆఫీసర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కలిసి సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశాల్లో కూడా ఓటర్‌గా నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తులను చేసుకోవచ్చు. రాజకీయ పార్టీల ఏజెంట్లనుంచిగానీ, ఇతరుల నుంచి గానీ రోజుకు పది కన్నా ఎక్కువ దరఖాస్తులను తీసుకోరు.
- ఈ నెల 21, 28 తేదీలైన గురువారాల్లో గ్రామసభలను నిర్వహించి ఓటర్ల జాబితాలోని పేర్లను బూత్ స్థాయి ఆఫీసర్లు చదివి వినిపిస్తారు. మార్పులు, చేర్పులు, అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు.
- ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్‌సైట్ ద్వారా ఈ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- విద్యార్థులకు సంబంధించిన ఓటర్ నమోదు దరఖాస్తులను ఆయా విద్యార్థుల కుటుంబ సభ్యులు సంబంధిత బూత్‌స్థాయి ఆఫీసర్లు లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్టోరల్ ఆఫీసర్‌కు సమర్పించవచ్చు.
- ముసాయిదా జాబితా ప్రకటన 18-11-2013
- దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరణ 18-11-2013 నుంచి 10-12-2013 వరకు
- గ్రామసభ, స్థానిక సంస్థల్లో జాబితాలో పేర్లు చదివి వినిపించడం 21-11-2013-28-11-2013
- బూత్‌ల వారీగా బూత్‌స్థాయి ఆఫీసర్ల సమావేశం-రాజకీయ పార్టీ
- 24-11-2013, 01-12-2013, 8-12-2013ల ఏజెంట్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ
- ఓటర్ నమోదు, అభ్యంతరాల దరఖాస్తుల పరిష్కారం 26-12-2013
- వివరాలు అప్‌డేట్, సప్లమెంటరీ జాబితా తయారు 10-01-2014
- ఓటర్ల తుది జాబితా ప్రకటన 16-01-2014
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన 38 లక్షల మంది యువతీ, యువకులకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా సోమవారం నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు అర్హులైన వారి నుంచి ఓటర్‌గా నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అలాగే ఓటర్ల జాబితాల్లో సవరణలు, అభ్యంతరాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆర్హులైన యువతీ, యువకులు 22 లక్షల మంది ఉండగా, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారు 16 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ ఓటు హక్కు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రేషన్ షాపుల్లో కూడా ఓటర్ల జాబితాలను ఉంచుతారు. ప్రతీ ఒక్కరు జాబితాలో తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఒక వేళ ఎవరి పేర్లయినా లేకపోతే వెంటనే నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉంది కదా అని జాబితాలో పేరుంటుందనుకుంటే పొరపాటే. గుర్తింపు కార్డు ఉన్నవారు కూడా జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలి. గుర్తింపు కార్డు ఉన్నా జాబితాలో పేరు లేకపోతే ఓట్లు వేయడం సాధ్యం కాదు. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఓటర్ల నమోదులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన లక్షమంది వలంటీర్లు, అలాగే లెట్స్ ఓట్ సంస్థ సహాయాన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5.94 కోట్ల ఓటర్లు ఉన్నారు.
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్