కలెక్టరేట్, న్యూస్‌లైన్: రబీ పంట కాలానికి నిర్ధేశించిన రూ.280 కోట్ల పంట రుణాలను వచ్చే నెల మాసాంతానికి మంజూరు చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పంటరుణాలు, స్వయం సహాయక సంఘాలకు, ఇతర ప్రభుత్వ పథకాల బ్యాంక్ రుణాలపై బ్యాంకర్ల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2013-14 సంవత్సరంలో రూ.1,134 కోట్ల బ్యాంక్ రుణాలకు గాను రూ.854 కోట్లు మంజూరు కాగా మిగిలిన రూ.280 కోట్ల రుణాన్ని రైతులకు సకాలంలో అందజేయాలని ఆదేశించారు.
కౌలురైతులకు పంట రుణాలను విరివిగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పంట రుణాల పంపిణీలో గతంలో ఉన్న రుణాలకు ముడిపెడుతూ ఎలాంటి కోతలు విధించవద్దని బ్యాంకర్లను కోరారు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించి రూ.486 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.335 కోట్లు రుణాలను అందించారని మిగిలిన లక్ష్యాన్ని సైతం త్వరగా పూర్తి చేయాలన్నారు. రుణాల రికవరీపై కలెక్టర్ స్పందిస్తూ ఐకేపీ తరపున ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి రికవరీ చేస్తామని బ్యాంకర్లకు తెలిపారు.
నెలాఖరులోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలి
ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందజేస్తున్న వ్యక్తిగత, ఇతర పథకాలకు సంబంధించి బ్యాంక్ సమ్మతి, గ్రౌండింగ్ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి 948 యూనిట్‌లకు బ్యాంక్ సమ్మతి ఇవ్వాల్సి ఉందన్నారు. 22 పాడి గేదెల యూనిట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వికలాంగులకు సంబంధించిన వాటన్నింటిని ఈ నెల చివరి నాటికి మంజూరు చేయాలని సూచించారు. సిద్దిపేట పట్టణంలో పందుల బెడదను శాశ్వతంగా నిర్మూలించేందుకు ఆయా కుటుంబాలకు ప్రత్యామ్నయ జీవనోపాధి పథకాలను రూపొందించామని కలెక్టర్ తెలిపారు.
ఆ కుటుంబాల అభిష్టం మేరకు గుర్తించిన వారికి విరివిగా బ్యాంక్ రుణాలు అందజేసి ఆర్థికంగా ఆదుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ సీనియర్ కన్సల్టెంట్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మణివెంకటప్ప మాట్లాడుతూ, చదువుకున్న నిరుద్యోగ యువతకు సొంతం వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. సమావేశంలో ఏజేసీ మూర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటయ్య వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
జనవరిలోగా రబీ రుణాలివ్వాలి
Published Fri, Dec 20 2013 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement