వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్‌.. పోలీసులకు దివ్యాంగుల ఫిర్యాదు! | smita sabharwal reacts on disability quote controversy | Sakshi
Sakshi News home page

వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్‌.. పోలీసులకు దివ్యాంగుల ఫిర్యాదు!

Published Mon, Jul 22 2024 10:23 AM | Last Updated on Mon, Jul 22 2024 12:18 PM

smita sabharwal reacts on disability quote controversy

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.  సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్‌, ఆర్‌అండ్‌డీ, డెస్క్‌ జాబ్‌లు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆమె‘ఎక్స్‌’వేదికగా చేసిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్‌ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 

తాజాగా.. దివ్యాంగులపై అనుచిత వాక్యాలు చేసినా ఐఏఎస్‌ స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, మరికొంతమంది దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. 

ఐఏఎస్‌ స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అకాడమి నిర్వాహకురాలు, మెంటర్, కోచ్ బాలలత తీవ్రంగా ఖండించారు.  స్మితా సబర్వాల్‌ వెంటనే రిజైన్ చేయాలని, తమకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు.

‘‘ స్మితా సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రేపటి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం. అసెంబ్లీ ముట్టడిస్తాం. దివ్యాంగులపై సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది ప్రభుత్వం ఆలోచన లేదా.. ఆమె మాటలా?. ఆమె మెంటల్‌గా అప్‌సెట్ అయ్యారు. తెలంగాణలో దివ్యాంగులు ఉండాలా వద్దా? చెప్పండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారు.

... స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ స్పందించి చర్యలు తీసుకోవాలి. అలాగే.. మాజీ  సీఎం కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలి. మా మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారామె. ఇప్పటికే నాతో చాలా విద్యార్థులు చర్చించారు. ఈ విషయాన్ని కచ్చితంగా ఖండించాలి.  స్మితా సబర్వాల్‌ వెంటనే రిజైన్ చేయాలి. మాకు న్యాయం జరగాలి’’ అని అన్నారు.
 

మరోపైపు.. తనపై వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ మరోసారి ‘ఎక్స్‌’ వేదికగానే స్పందించారు. ఐపీఎస్‌/ ఐఎఫ్‌ఒఎస్‌తో పాటు రక్షణ వంటి కొన్ని రంగాలలో వికలాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడలేదో తనను ప్రశ్నిస్తున్నవారు చెప్పాలన్నారు. ఐపీఎస్‌,  ఐఎఫ్‌ఒఎస్‌ లాగే ఐఏఎస్‌లు అంతే కదా అని అన్నారు. ఇది కూడా పరిశీలించవలసిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. సున్నితత్వానికి నా మనసులో స్థానం లేదని పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement