Rabi loans
-
రబీ రుణ లక్ష్యం రూ.658.10 కోట్లు
సాక్షి, కడప : రబీలో రూ.658.10 కోట్లు రుణాలుగా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్డిఎం) లేవాకు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. ఖరీఫ్‌లో రూ.2077.96 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుని రూ.1402.11 కోట్లు అందజేశామన్నారు. ముద్ర పథకం కింద ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణలిస్తామని, వివిధ పథకాల కింద రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి బ్యాంకుల్లో ఇక్కట్లు ఎదురైతే తమ దృష్టికి తేవచ్చని ఆయన బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు.. సాక్షి : ఖరీఫ్‌లో అనుకున్న రీతిలో రుణ లక్ష్యం చేరుకోలేదు.. రబీలో ఏ విధంగా వ్యూహం రూపొందిం చుకున్నారు? ఎల్డీఎం : ఖరీఫ్‌లో 2077.96 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని 1402.11 కోట్లు ఖర్చు చేశాం. దాదాపు 67.48 శాతం వృద్ధి సాధించాం. ఇది మంచి ప్రగతే. సుమారు 2.40 లక్షల మంది రైతులకు రుణాలందించాం. 2014-15లో 32 బ్యాంకుల ద్వారా సుమారు పది వేల మంది కొత్త రైతులకు రుణాలిచ్చాము. ఇపుడు రబీ సీజన్ ప్రారంబమవుతోంది. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రుణ ప్రణాళిక రూపొందించుకున్నాం. ఇందులో భాగంగా రూ.658.10 కోట్లు రైతులకు రుణంగా ఇవ్వాలని నిర్ణయించాం. సాక్షి : ఉద్యాన (హార్టికల్చర్) రైతులకు రుణ మాఫీ వర్తించలేదు. అందువల్ల చేయూతనిస్తామన్నారు.. ఆ ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? ఎల్డీఎం : ప్రభుత్వం నుంచి ఉద్యాన రైతులకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో నెల రోజులుగా వారి జాబితాను అప్లోడ్ చేస్తున్నాం. దాదాపు 70 - 80 వేల మంది పండ్ల తోటల రైతుల పేర్లను ప్రభుత్వానికి పంపుతున్నాం. త్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. సాక్షి : కౌలు రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు అందడం లేదు.. ఎల్డీఎం : జిల్లాలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో సుమారు 800 మంది కౌలు రైతులకు రుణాలు ఇచ్చాం. అన్నీ అర్హతలతో ముందుకు వస్తే ఇవ్వడానికి బ్యాంకులకు ఎలాంటి ఇబ్బంది లేదు. సాక్షి : చాలా బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి.. కొద్ది రోజులు వేచి చూడవచ్చు కదా? ఎల్డీఎం : బంగారం ధర అధికంగా ఉన్నప్పుడు చాలా మంది రుణాలు తీసుకున్నారు. ఇటీవల ధర తగ్గడంతో విడిపించుకునేందుకు చాలా మంది మొగ్గు చూపడం లేదు. ఇలాంటప్పుడు ఇంకా వేచి చూస్తే బ్యాంకులు నష్టపోతాయి. సాక్షి : చాలా చోట్ల రైతుల రుణాల రెన్యూవల్స్ ఎందుకు అగిపోయాయి? ఎల్డీఎం : పాస్ పుస్తకాలలో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ చేయడంతో చాలా మంది రెన్యూవల్ చేయలేదు. గతంలో కొంత మంది తప్పుడు రికార్డులతో రుణాలు తీసుకునేవారు. ఇపుడు ఆన్లైన్ చేయడం వల్ల 1బి అడంగల్, ఇతర రికార్డులు సక్రమంగా ఉంటేనే బ్యాంకర్లు రుణం ఇస్తారు. ఇందువల్లే చాలా చోట్ల రెన్యూవల్స్ ఆగిపోయాయి. సాక్షి : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలు, విద్యా రుణాల కోసం బ్యాంకర్లు బాగా తిప్పుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.. ఎల్డీఎం : అన్ని వివరాలు సక్రమంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. విద్యా రుణాలకు సంబంధించి సబ్ ప్లాన్‌లో ప్రత్యేకంగా టార్గెట్ ఇచ్చారు. అదే పనిగా బ్యాంకు మేనేజర్లు ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకు వస్తే రుణం అందేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి : ముద్ర రుణాలు ష్యూరిటీ లేకుండా ఇస్తారా..? ఎల్డీఎం : ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టిన ముద్ర పథకం ద్వారా అన్ని వ్యాపార లావాదేవీలకు రుణాలిస్తాము. రూ. 50 వేలు మొదలు రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాలు వచ్చాయి. ష్యూరిటీతో సంబంధం లేకుండా రుణం ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో మూడు వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. -
జనవరిలోగా రబీ రుణాలివ్వాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: రబీ పంట కాలానికి నిర్ధేశించిన రూ.280 కోట్ల పంట రుణాలను వచ్చే నెల మాసాంతానికి మంజూరు చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంటరుణాలు, స్వయం సహాయక సంఘాలకు, ఇతర ప్రభుత్వ పథకాల బ్యాంక్ రుణాలపై బ్యాంకర్ల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2013-14 సంవత్సరంలో రూ.1,134 కోట్ల బ్యాంక్ రుణాలకు గాను రూ.854 కోట్లు మంజూరు కాగా మిగిలిన రూ.280 కోట్ల రుణాన్ని రైతులకు సకాలంలో అందజేయాలని ఆదేశించారు. కౌలురైతులకు పంట రుణాలను విరివిగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పంట రుణాల పంపిణీలో గతంలో ఉన్న రుణాలకు ముడిపెడుతూ ఎలాంటి కోతలు విధించవద్దని బ్యాంకర్లను కోరారు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించి రూ.486 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.335 కోట్లు రుణాలను అందించారని మిగిలిన లక్ష్యాన్ని సైతం త్వరగా పూర్తి చేయాలన్నారు. రుణాల రికవరీపై కలెక్టర్ స్పందిస్తూ ఐకేపీ తరపున ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి రికవరీ చేస్తామని బ్యాంకర్లకు తెలిపారు. నెలాఖరులోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలి ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందజేస్తున్న వ్యక్తిగత, ఇతర పథకాలకు సంబంధించి బ్యాంక్ సమ్మతి, గ్రౌండింగ్ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి 948 యూనిట్లకు బ్యాంక్ సమ్మతి ఇవ్వాల్సి ఉందన్నారు. 22 పాడి గేదెల యూనిట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వికలాంగులకు సంబంధించిన వాటన్నింటిని ఈ నెల చివరి నాటికి మంజూరు చేయాలని సూచించారు. సిద్దిపేట పట్టణంలో పందుల బెడదను శాశ్వతంగా నిర్మూలించేందుకు ఆయా కుటుంబాలకు ప్రత్యామ్నయ జీవనోపాధి పథకాలను రూపొందించామని కలెక్టర్ తెలిపారు. ఆ కుటుంబాల అభిష్టం మేరకు గుర్తించిన వారికి విరివిగా బ్యాంక్ రుణాలు అందజేసి ఆర్థికంగా ఆదుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ సీనియర్ కన్సల్టెంట్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మణివెంకటప్ప మాట్లాడుతూ, చదువుకున్న నిరుద్యోగ యువతకు సొంతం వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. సమావేశంలో ఏజేసీ మూర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటయ్య వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
రైతులకు సహకారమే
తాండూరు, న్యూస్‌లైన్: రబీ రుణాలు ఈసారి కొంతమంది రైతులకే దక్కనున్నాయి. గత ఏడాది రుణాల పంపిణీతో పోల్చితే ఈసారి భారీగా కోత పడింది. సహకార సంఘాలకు డీసీసీబీ చేసిన కొత్త రుణాల అలాట్మెంట్లే ఇందుకు ఉదాహరణ. సహకార సంఘాల పరిధిలోని వేలాది మంది రైతుల్లో కొంతమందికి అందులోనూ అరకొర పంపిణీకే రబీ రుణాలు పరిమితం కానున్నాయి. ఈసారి సహకార సంఘాల్లో ఒక్క రైతుకు రూ.లక్ష రుణ పరిమితి లక్ష్యంగా డీసీసీబీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఖరీఫ్ రుణ బకాయిల వసూలు శాతం ప్రకారం కొత్త అలాట్మెంట్లు అరకొరగా కేటాయించడంతో రబీ రుణాలకు భారీగా కొత పడింది. దీంతో ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో పుట్టెడు నష్టాలను చవిచూసిన రైతులకు రబీ పంట సాగుకు పెట్టుబడుల కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. సహకార సంఘాల్లో రబీ రుణాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ నెల 5వ తేదీన కొత్త రుణాల అలాట్మెంట్ జరిగింది. తాండూరు డివిజన్లో తట్టేపల్లి, ఎల్మకన్నె, యాలాల, నవాంద్గి సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల పరిధిలో సుమారు 5 వేలమందికిపైగా రైతులు ఉన్నారు. 2012-13లో నాలుగు సహకార సంఘాల పరిధిలో మొత్తం రైతుల్లో 2,249మంది రైతులకు రూ.566.83 లక్షల రబీ రుణాలు పంపిణీ అయ్యాయి. గత ఏడాది రబీ రుణాలు పొందిన రైతుల్లో సగం మందికి కూడా ఈసారి రుణాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రతిపాదనలు రూ.కోటి.. ఇచ్చింది గోరంతే... 2013-14 సంవత్సరానికిగాను నాలుగు సహకార సంఘాలకు కలిపి కేవలం రూ.70లక్షల రబీ రుణాల అలాంట్మెంట్లు జరిగాయి. నిజానికి ఒక్కొక్క సంఘానికి సుమారు రూ.కోటి అలాట్మెంట్ చేయాలని సహకార సంఘాల పాలకమండళ్లు డీసీసీబీకి ప్రతిపాదనలు చేశాయి. తక్కువైనా కావాల్సింది 1.12 కోట్లు... కానీ అరకొర రుణాలతో సరిపెట్టారు. తక్కువగా ఒక్క రైతుకు రూ.5వేల చొప్పున రుణం ఇవ్వాలన్న గత ఏడాది ప్రకారం 2,249 మందికి సుమారు రూ. కోటి, 12 ల క్షల, 45వేలు అవసరమవుతాయి. అలాట్మెంట్ చేసిన రూ.70లక్షలు ఎంతమంది రైతులకు సరిపోతాయనేది అధికారులకే తెలియాలి. ఒక్కో రైతుకు రూ.3వేలే... ఈ అలాట్మెంట్ ప్రకారం 2,249మంది రైతులనే ప్రామాణికంగా తీసుకున్నా ఒక్కో రైతుకు రూ.3వేల వరకు రుణం అందే అవకాశం ఉంది. రూ.3వేలు పంటల సాగుకు ఎలా సరిపోతాయని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. కనిష్టంగా రూ.10వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు ఈసారి ఒక రైతుకు రుణ పరిమితి లక్ష్యం కేవలం కాగితాలకే పరిమితం కానున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే అరకొరగా జరిగిన రుణ అలాంట్మెంట్లు అందరికీ ఎంతోకొంత పంపిణీ చేస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ముందుగా కొంతమంది రైతులకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో గత ఏడాది రబీ రుణాలు పొందిన రైతుల్లో ఈసారి కొంతమందికే రుణాలు దక్కే పరిస్థితి ఉంది. కొత్త రైతులకు రుణం నిల్.. ఇటీవల కొత్తగా సహకార సంఘాల్లో సభ్యత్వం పొందిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. తట్టేపల్లి, యాలాల, నవాంద్గి సహకార సంఘాల్లో ఇంకా రబీ రుణాల పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. ఇక తాండూరు మండలంలోని ఎల్మకన్నె సహకార సంఘంలో కేవలం ఐదుగురు రైతులకు రూ.1.5 లక్షల రుణాలు పంపిణీ చేశారు. రబీ కొత్త రుణాల అలాంట్ రూ.70 లక్షలే అయినప్పటికీ.. గత ఏడాది రబీ రుణాలు రూ.566.83లక్షలను కలుపుకొని మొత్తం రూ.636.83 లక్షల అలాట్‌మెంట్‌గా చూపెట్టడం గమనార్హం. ఎంతమందికి ఇస్తారో...ఎంతిస్తారో తెలియని గందరగోళంగా మారింది కొత్త రుణాల పంపిణీ పరిస్థితి.