తాండూరు, న్యూస్‌లైన్: రబీ రుణాలు ఈసారి కొంతమంది రైతులకే దక్కనున్నాయి. గత ఏడాది రుణాల పంపిణీతో పోల్చితే ఈసారి భారీగా కోత పడింది. సహకార సంఘాలకు డీసీసీబీ చేసిన కొత్త రుణాల అలాట్‌మెంట్‌లే ఇందుకు ఉదాహరణ. సహకార సంఘాల పరిధిలోని వేలాది మంది రైతుల్లో కొంతమందికి అందులోనూ అరకొర పంపిణీకే రబీ రుణాలు పరిమితం కానున్నాయి. ఈసారి సహకార సంఘాల్లో ఒక్క రైతుకు రూ.లక్ష రుణ పరిమితి లక్ష్యంగా డీసీసీబీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఖరీఫ్ రుణ బకాయిల వసూలు శాతం ప్రకారం కొత్త అలాట్‌మెంట్‌లు అరకొరగా కేటాయించడంతో రబీ రుణాలకు భారీగా కొత పడింది. దీంతో ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో పుట్టెడు నష్టాలను చవిచూసిన రైతులకు రబీ పంట సాగుకు పెట్టుబడుల కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది.
సహకార సంఘాల్లో రబీ రుణాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ నెల 5వ తేదీన కొత్త రుణాల అలాట్‌మెంట్ జరిగింది. తాండూరు డివిజన్‌లో తట్టేపల్లి, ఎల్మకన్నె, యాలాల, నవాంద్గి సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల పరిధిలో సుమారు 5 వేలమందికిపైగా రైతులు ఉన్నారు. 2012-13లో నాలుగు సహకార సంఘాల పరిధిలో మొత్తం రైతుల్లో 2,249మంది రైతులకు రూ.566.83 లక్షల రబీ రుణాలు పంపిణీ అయ్యాయి. గత ఏడాది రబీ రుణాలు పొందిన రైతుల్లో సగం మందికి కూడా ఈసారి రుణాలు అందని పరిస్థితి నెలకొంది.
ప్రతిపాదనలు రూ.కోటి..
ఇచ్చింది గోరంతే...
2013-14 సంవత్సరానికిగాను నాలుగు సహకార సంఘాలకు కలిపి కేవలం రూ.70లక్షల రబీ రుణాల అలాంట్‌మెంట్‌లు జరిగాయి. నిజానికి ఒక్కొక్క సంఘానికి సుమారు రూ.కోటి అలాట్‌మెంట్ చేయాలని సహకార సంఘాల పాలకమండళ్లు డీసీసీబీకి ప్రతిపాదనలు చేశాయి.
తక్కువైనా కావాల్సింది 1.12 కోట్లు...
కానీ అరకొర రుణాలతో సరిపెట్టారు. తక్కువగా ఒక్క రైతుకు రూ.5వేల చొప్పున రుణం ఇవ్వాలన్న గత ఏడాది ప్రకారం 2,249 మందికి సుమారు రూ. కోటి, 12 ల క్షల, 45వేలు అవసరమవుతాయి. అలాట్‌మెంట్ చేసిన రూ.70లక్షలు ఎంతమంది రైతులకు సరిపోతాయనేది అధికారులకే తెలియాలి.
ఒక్కో రైతుకు రూ.3వేలే...
ఈ అలాట్‌మెంట్ ప్రకారం 2,249మంది రైతులనే ప్రామాణికంగా తీసుకున్నా ఒక్కో రైతుకు రూ.3వేల వరకు రుణం అందే అవకాశం ఉంది. రూ.3వేలు పంటల సాగుకు ఎలా సరిపోతాయని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. కనిష్టంగా రూ.10వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు ఈసారి ఒక రైతుకు రుణ పరిమితి లక్ష్యం కేవలం కాగితాలకే పరిమితం కానున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే అరకొరగా జరిగిన రుణ అలాంట్‌మెంట్‌లు అందరికీ ఎంతోకొంత పంపిణీ చేస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ముందుగా కొంతమంది రైతులకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో గత ఏడాది రబీ రుణాలు పొందిన రైతుల్లో ఈసారి కొంతమందికే రుణాలు దక్కే పరిస్థితి ఉంది.
కొత్త రైతులకు రుణం నిల్..
ఇటీవల కొత్తగా సహకార సంఘాల్లో సభ్యత్వం పొందిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. తట్టేపల్లి, యాలాల, నవాంద్గి సహకార సంఘాల్లో ఇంకా రబీ రుణాల పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. ఇక తాండూరు మండలంలోని ఎల్మకన్నె సహకార సంఘంలో కేవలం ఐదుగురు రైతులకు రూ.1.5 లక్షల రుణాలు పంపిణీ చేశారు. రబీ కొత్త రుణాల అలాంట్ రూ.70 లక్షలే అయినప్పటికీ.. గత ఏడాది రబీ రుణాలు రూ.566.83లక్షలను కలుపుకొని మొత్తం రూ.636.83 లక్షల అలాట్‌మెంట్‌గా చూపెట్టడం గమనార్హం. ఎంతమందికి ఇస్తారో...ఎంతిస్తారో తెలియని గందరగోళంగా మారింది కొత్త రుణాల పంపిణీ పరిస్థితి.
రైతులకు సహకారమే
Published Sat, Nov 23 2013 11:54 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement