సాక్షి, కడప : రబీలో రూ.658.10 కోట్లు రుణాలుగా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్‌డిఎం) లేవాకు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. ఖరీఫ్‌లో రూ.2077.96 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుని రూ.1402.11 కోట్లు అందజేశామన్నారు. ముద్ర పథకం కింద ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణలిస్తామని, వివిధ పథకాల కింద రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి బ్యాంకుల్లో ఇక్కట్లు ఎదురైతే తమ దృష్టికి తేవచ్చని ఆయన బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు..
సాక్షి : ఖరీఫ్‌లో అనుకున్న రీతిలో రుణ లక్ష్యం చేరుకోలేదు.. రబీలో ఏ విధంగా వ్యూహం రూపొందిం చుకున్నారు?
ఎల్‌డీఎం : ఖరీఫ్‌లో 2077.96 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని 1402.11 కోట్లు ఖర్చు చేశాం. దాదాపు 67.48 శాతం వృద్ధి సాధించాం. ఇది మంచి ప్రగతే. సుమారు 2.40 లక్షల మంది రైతులకు రుణాలందించాం. 2014-15లో 32 బ్యాంకుల ద్వారా సుమారు పది వేల మంది కొత్త రైతులకు రుణాలిచ్చాము. ఇపుడు రబీ సీజన్ ప్రారంబమవుతోంది. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రుణ ప్రణాళిక రూపొందించుకున్నాం. ఇందులో భాగంగా రూ.658.10 కోట్లు రైతులకు రుణంగా ఇవ్వాలని నిర్ణయించాం.
సాక్షి : ఉద్యాన (హార్టికల్చర్) రైతులకు రుణ మాఫీ వర్తించలేదు. అందువల్ల చేయూతనిస్తామన్నారు.. ఆ ప్రక్రియ ఎంత వరకు వచ్చింది?
ఎల్‌డీఎం : ప్రభుత్వం నుంచి ఉద్యాన రైతులకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో నెల రోజులుగా వారి జాబితాను అప్‌లోడ్ చేస్తున్నాం. దాదాపు 70 - 80 వేల మంది పండ్ల తోటల రైతుల పేర్లను ప్రభుత్వానికి పంపుతున్నాం. త్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం.
సాక్షి : కౌలు రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు అందడం లేదు..
ఎల్‌డీఎం : జిల్లాలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో సుమారు 800 మంది కౌలు రైతులకు రుణాలు ఇచ్చాం. అన్నీ అర్హతలతో ముందుకు వస్తే ఇవ్వడానికి బ్యాంకులకు ఎలాంటి ఇబ్బంది లేదు.
సాక్షి : చాలా బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి.. కొద్ది రోజులు వేచి చూడవచ్చు కదా?
ఎల్‌డీఎం : బంగారం ధర అధికంగా ఉన్నప్పుడు చాలా మంది రుణాలు తీసుకున్నారు. ఇటీవల ధర తగ్గడంతో విడిపించుకునేందుకు చాలా మంది మొగ్గు చూపడం లేదు. ఇలాంటప్పుడు ఇంకా వేచి చూస్తే బ్యాంకులు నష్టపోతాయి.
సాక్షి : చాలా చోట్ల రైతుల రుణాల రెన్యూవల్స్ ఎందుకు అగిపోయాయి?
ఎల్‌డీఎం : పాస్ పుస్తకాలలో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం ఇటీవల ఆన్‌లైన్ చేయడంతో చాలా మంది రెన్యూవల్ చేయలేదు. గతంలో కొంత మంది తప్పుడు రికార్డులతో రుణాలు తీసుకునేవారు. ఇపుడు ఆన్‌లైన్ చేయడం వల్ల 1బి అడంగల్, ఇతర రికార్డులు సక్రమంగా ఉంటేనే బ్యాంకర్లు రుణం ఇస్తారు. ఇందువల్లే చాలా చోట్ల రెన్యూవల్స్ ఆగిపోయాయి.
సాక్షి : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలు, విద్యా రుణాల కోసం బ్యాంకర్లు బాగా తిప్పుకుంటున్నారనే ఆరోపణలున్నాయి..
ఎల్‌డీఎం : అన్ని వివరాలు సక్రమంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. విద్యా రుణాలకు సంబంధించి సబ్ ప్లాన్‌లో ప్రత్యేకంగా టార్గెట్ ఇచ్చారు. అదే పనిగా బ్యాంకు మేనేజర్లు ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకు వస్తే రుణం అందేలా చర్యలు తీసుకుంటాం.
సాక్షి : ముద్ర రుణాలు ష్యూరిటీ లేకుండా ఇస్తారా..?
ఎల్‌డీఎం : ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టిన ముద్ర పథకం ద్వారా అన్ని వ్యాపార లావాదేవీలకు రుణాలిస్తాము. రూ. 50 వేలు మొదలు రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాలు వచ్చాయి. ష్యూరిటీతో సంబంధం లేకుండా రుణం ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో మూడు వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
రబీ రుణ లక్ష్యం రూ.658.10 కోట్లు
Published Thu, Oct 1 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement
Advertisement