మాట్లాడుతున్న పెదరాసు సుబ్రహ్మణ్యం
పుట్టపర్తి: మాజీ మంత్రి, పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పల్లె రఘునాథరెడ్డికి అసమ్మతి సెగ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత పెదరాసు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మంగళవారం బుక్కపట్నంలో అసమ్మతి నేతలందరూ సమావేశమై ఈ సారి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వరాదంటూ తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు. సమావేశంలో పెదరాసు మాట్లాడుతూ.. పల్లె కంటే పార్టీలో తామే సీనియర్లమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేశామని పల్లెలా పార్టీని అడ్డం పెట్టుకుని రూ.కోట్లు సంపాదించలేదని మండిపడ్డారు.
పార్టీ బలోపేతానికి తాము సమావేశాలు ఏర్పాటు చేస్తూంటే వద్దనేందుకు నీవెవరూ అంటూ ప్రశ్నించారు. నీవెక్కడి వాడవని నిలదీశారు. స్థానికేతరుడైన పల్లెకు కాకుండా ఈ సారి పార్టీ టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్లెను బేషరతుగా నియోజకవర్గం వీడి వెళ్లాలన్నారు. .2009, 2014 ఎన్నికల్లో పల్లెను గెలిపిస్తే అడ్డగోలు సంపాదనకే ప్రాధాన్యతనిస్తూ పార్టీ కార్యకర్తలను, నాయకులను, బీసీల అభ్యున్నతిని ఏనాడూ పట్టించుకోలేదని పీసీ గంగన్న విమర్శించారు. 2014లో పార్టీ విజయానికి తాము పడిన కష్టాన్ని వివరించారు.
పుట్టపర్తి మున్సిపాలిటీ చైర్మన్‌గా తాను ఎన్నికై నప్పుడు తన ఎదుగుదలకు పల్లె రఘునాథరెడ్డి అడుగడుగునా అడ్డుపడ్డాడని ఆరోపించారు. నిధులున్నా పుట్టపర్తిలో అభివృద్ధి పనులు చేపట్టకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. 2024లో పార్టీ విజయం సాధించాలంటే పల్లెకు టికెట్ ఇవ్వకుండా వేరొకరికి ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు కేశప్ప, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చెన్నకేశవులు, నాగప్ప, మైనార్టీ నాయకుడు అల్లాబకాష్ తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో ఓడీచెరువు మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, కొత్తచెరువు శ్రీనాథ్, అగ్రహారం వరదప్ప, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment