కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు 2013 నుంచి చెల్లించాల్సిన బకాయిల కోసం ఈనెల 29వ తేదీన చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కడప రీజినల్ అధ్యక్షుడు వై.రవీంద్రనాథ్‌వర్మ, సెక్రటరీ ఎల్.రఘునాథరెడ్డిలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. 19న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని ప్రధాన కార్యాలయాల ఎదురుగా సామూహిక రిలే నిరాహార దీక్షలు నిర్వహించామన్నారు. యాజమాన్యం స్పందించని కారణంగా 29న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. యాజమాన్యం రాష్ట్ర కమిటీని మంగళవారం చర్చలకు ఆహ్వానించి మూడు వారాల్లోపు బకాయిలలో 50 శాతం ఇచ్చేందుకు, మిగతా 50 శాతం ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చేందుకు, పీఎఫ్ కార్యదర్శితో చర్చించి త్వరలో బకాయిలు చెల్లించేందుకు ఎండీ పీఎఫ్ సెక్రటరీని ఆదేశించారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎన్ రెడ్డి, బి.పటేల్ రాజారెడ్డిలు పాల్గొని ఎండీతో చర్చించారని వారు పేర్కొన్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.