మెదక్/మెదక్ టౌన్, న్యూస్‌లైన్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని, ఒక వేళ నిర్లక్ష ్య వైఖరి అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించారు. గురువారం స్థానిక సాయి బాలాజీ గార్డెన్స్‌లో రైస్ మిల్లర్లు, సహకార సంఘాల చైర్మన్లు, ఐకేపీ సభ్యులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ ప్రమాణాలతో కూడిన ధాన్యానికి మద్దతు ధర రూ.1345 ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనన్నారు. జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తూకం వేసిన 72గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస వసతులు కల్పించాలన్నారు.
రైస్‌మిల్లులను, కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు తహశీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. మద్దతు ఇవ్వని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద ధరల పట్టిక, హెల్ప్‌లైన్ నంబర్‌ను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ యంత్రాలు, టార్పాలిన్లు, తూకాలు, బస్తాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతులు బ్యాంకర్లకు అప్పులుంటే వాటితో ధాన్యం డబ్బులను ముడిపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. మరో రెండు వారాల్లో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలవుతుందన్నారు. బ్యాంకులో ఖాతాలు లేని రైతులకు అధికారులు సహకరించి ఖాతాలు తెరిచేలా చూడాలన్నారు. అనంతరం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రపాల్ మాట్లాడుతూ మిల్లర్లు ఎల్లప్పుడు రైతుల పక్షానే ఉంటారన్నారన్నారు. సమావేశంలో జేసీ శరత్, ఆర్డీఓలు వనజాదేవి, ముత్యంరెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి ఏసురత్నం, జిల్లా వ్యవసాయఅధికారిణి ఉమా మహేశ్వరమ్మ పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
Published Fri, Nov 8 2013 3:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement