నిజామాబాద్ బిజినెస్/ మోర్తాడ్, న్యూస్‌లైన్ : జిల్లాలో 15 రోజుల క్రితం బీపీటీ ధాన్యం ధర క్వింటాలుకు రూ. 1,400 నుం చి రూ. 1,500 పలికింది. దాదాపుగా ధాన్యం రైతుల వద్దనుంచి దళారులు, మిల్లర్ల వద్దకు చేరిపోయింది. దీంతో ధాన్యం ధర పెరుగుతోంది. ప్రస్తుతం బీపీటీ ధాన్యం ధర క్వింటాలుకు రూ. 1,700 నుంచి రూ. 1,800 పలుకుతోంది. హెచ్‌ఎంటీ ధాన్యం ధర రూ.1,700ల నుంచి రూ. 2 వేలకు చేరింది. జైశ్రీరాం రకం ధాన్యం ధర రూ. 2 వేలనుంచి రూ. 2,300లకు పెరిగింది. కాగా దొడ్డురకం ధాన్యం ధర రూ. 1,300 ఉండగా ఇప్పుడు రూ. 1,400 లభిస్తోంది. దీంతో బియ్యం ధరలకూ రెక్కలొచ్చాయి.
పదిహేను రోజుల క్రితం బీపీటీ పాత బియ్యం ధర క్వింటాలుకు రూ. 3,400 ఉండేది. కొత్త బియ్యం రూ. 2,400 నుంచి 2,700 మధ్య విక్రయించేవారు. ప్రస్తుతం ధరలు పెరిగాయి. పాత బియ్యం రూ. 3,800లుదాటింది. కొత్త బియ్యం రూ. 2,800 నుంచి రూ. 3వేల వరకు విక్రయిస్తున్నారు. హెచ్‌ఎంటీ ధర రూ. 2,800 నుంచి 3,200లకు చేరింది. జై శ్రీరాం రకం బియ్యం మార్కెట్‌లో క్వింటాలుకు 4 వేల రూపాయలు పలుకుతోంది.
ధర తగ్గుతుందనుకుంటే..
జిల్లాలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. పంటలు సైతం బాగానే పండాయి. దీంతో ఈసారి బియ్యం ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నెల క్రితం వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ పండిన పంటను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తరలించారు. బీహార్, మధ్యప్రదేశ్‌ల నుంచి వరి ధాన్యం దిగుమతి కొనసాగుతున్నా.. ఆ ధాన్యాన్ని పట్టిస్తే నూక ఎక్కువగా వస్తుండడంతో ధర పెరుగుతోంది.
ధాన్యాన్ని ముందుగానే విక్రయించిన రైతులు ఇప్పుడు పెరిగిన ధరను చూసి నిరాశ చెందుతున్నారు. ధర పెరగడం వల్ల రైతుల కంటే వ్యాపారులు, రైస్‌మిల్లర్లు ఎక్కువగా లాభపడుతున్నారని స్పష్టం అవుతోంది. కాగా ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు నిల్వ చేసుకొని ధర పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో పంట చేతికి వస్తోందని, త్వరలో అక్కడినుంచి ధాన్యం దిగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ధాన్యం దిగుమతి అయిన తర్వాత బియ్యం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
పెరిగిన ధాన్యం, బియ్యం ధరలు
Published Wed, Dec 18 2013 6:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement