సాక్షి, రంగారెడ్డి జిల్లా: సన్నబియ్యం ధరలను అదుపు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.40కిపైగా సన్నబియ్యం విక్రయిస్తుండగా.. వీటిని మరింత తక్కువకే వినియోగదారులకు విక్రయించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. సోనామసూరి(సన్నాలు) బియ్యం కిలో రూ.30 చొప్పున అమ్మేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం నుంచే ఈ బియ్యం రైతుబజార్లలో లభించనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లోని తొమ్మిది రైతు బజార్లతోపాటు రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి మార్కెట్ యార్డుల్లో విక్రయాల కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రైతుబజార్ల ద్వారా సోనామసూరి బియ్యం విక్రయించేందుకు ప్రభుత్వం 700మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించింది. వీటిని ఉత్తరప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కోటా మొత్తాన్ని జిల్లాలోని అన్ని విక్రయ కేంద్రాలకు చేరవేశారు. ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 20కిలోలు విక్రయించనున్నారు. అయితే ఈ కోటా పూర్తయ్యేలోపు డిమాండ్‌ను బట్టి మరింత కోటా తెప్పించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
సన్నాలు @30
Published Sat, Oct 5 2013 2:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement