రికార్డు స్థాయిలో మండుతున్న ధరలు
గ్రేటర్‌లో మొదటి రకం బియ్యం కిలో రూ.70–80
నెల రోజుల్లోనే కేజీపై రూ.20 పెరుగుదల
ఉత్పత్తులు పెరిగినా దిగిరాని ధరలు
పన్నులు ఎత్తివేసినా రేట్లు తగ్గించని వ్యాపారులు
ఇబ్బందుల్లో వినియోగదారులు
సాక్షి హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్‌లో బియ్యం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నాణ్యమైన సన్న బియ్యం కొనాలంటే కిలోకు రూ.65 నుంచి రూ. 55కి పైగానే చెల్లించాల్సి వస్తోంది. గతేడాది ఫస్ట్ క్వాలిటీ పాత సన్నబియ్యం కిలోకు రూ.45 నుంచి 50లోపు లభించేవి. ప్రస్తుతం కిలో రూ.65 నుంచి రూ 75 చెల్లిస్తే కాని మార్కెట్‌లో లభించడం లేదు. ఇక ఫస్ట్‌క్లాస్ కొలమ్ బియ్యం తినాలంటే మాత్రం రూ.80–85 చెల్లించాల్సిందే. గత, ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతంలో కంటే 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అధికంగా సేకరణ జరిగిందని పౌరసరఫరాల అధికారులకు లెక్కలు చెబుతున్నాయి. డిమాండ్ కంటే ఎక్కువగా బియ్యం మార్కెట్‌కు వచి్చనా ధరలు మాత్రం తగ్గడం లేదు. ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ధరల నియంత్రణలో పౌర సరఫరాల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
మిల్లర్లు, రిటైల్ వ్యాపారుల దగా..
జీఎస్టీ రాకముందు మిల్లర్లు, వ్యాపారులు ప్రతి క్వింటాల్‌పై 4 శాతం పన్నులు చెల్లించేవారు. కానీ జీఎస్టీ అమలులోకి వచ్చాక వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై పన్నులను పూర్తిగా తొలగించారు. అందులో భాగంగానే బియ్యంపై వ్యాట్‌ను కూడా పూర్తిగా ఎత్తివేశారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు వరిని ధాన్యం రూపంలో చేసి తెలంగాణ వ్యాపారులకు అమ్మితే గతంలో ఉన్న 1 శాతం పన్నును 2019 జీవో నంబర్ 219 ద్వారా ప్రభుత్వం ఎత్తివేసింది. రైస్ మిల్లర్లు కేవలం 1 శాతం ప్యాడీపై మాత్రమే మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ వచ్చాక 4 శాతం వ్యాట్‌ను ఎత్తివేశారు. 1 శాతం పన్నును కూడా ఎత్తి వేశారు. అయినా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు.
వ్యవసాయాధారిత ఉత్పత్తులు వినియోగదారులకు తక్కువ ధరలకే అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పన్నులు ఎత్తివేసింది. కానీ కేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. వ్యాపారులు పన్నులు చెల్లించినప్పుడు బియ్యం ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పన్నులు రద్దు అయిన తర్వాత బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కొనుగోలుదారులను దోచేస్తున్నారు. ప్రభుత్వం సరైన రీతిలో పర్యవేక్షణ చేయని కారణంగానే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉత్పత్తులు పెరిగినా..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం వరిధాన్యం ఉత్పత్తులు భారీగా పెరిగాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం సేకరించిన బియ్యాన్ని మిల్లర్లకు అందజేశారు. ప్రస్తుతం మిల్లర్ల వద్ద భారీఎత్తున బియ్యం నిల్వలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని మిల్లర్ల వద్ద కూడా ప్రస్తుతం లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగానే బియ్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం.
పొంతన లేని ధరలు..
గ్రేటర్ పరిధిలో అధికారుల పర్యవేక్షణలో లేకపోవడంతో హోల్‌సేల్ మార్కెట్‌లో బియ్యం ధరలకు, రిటైల్ ధరలకు పొంతన ఉండడం లేదు. గ్రేటర్ పరిధిలో 250 రైస్‌మిల్లర్లు ఉన్నట్లు తెలిసింది. ప్రతి సంవత్సరం ఒక్కో మిల్లర్ వద్ద 40 నుంచి 50 టన్నుల బియ్యం నిల్వలు పెరుగుతున్నట్టు పౌరసరఫరాల వద్ద లెక్కలు ఉన్నట్లు సమాచారం. గ్రేటర్‌లో రోజుకు 35 నుంచి 40 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగం అవుతున్నట్టు అధికారుల అంచనా. బియ్యం వినియోగం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం మిల్లర్ ధర క్వింటాల్‌కు రూ.3200 నుంచి రూ.3500 పలుకుతోంది. మార్కెట్‌కు చేరిన తర్వాత రిటైల్ వ్యాపారులు చెప్పిందే ధర. ప్రస్తుతం పాత సన్నబియ్యం ఫైన్ క్వాలిటీ క్వింటాల్‌కు రూ.6500 నుంచి రూ.7500 చేరింది.
Comments
Please login to add a commentAdd a comment