
నేడు సింగపూర్ పర్యటనకు కేసీఆర్
రాత్రి 11.20కి ప్రయూణం
ఈనెల 25వ తేదీన తిరిగి రాక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం రాత్రి 11.20 గంటలకు సింగపూర్ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన బృందం సభ్యులు సింగపూర్‌తోపాటు మలేషియా కూడా వెళ్తున్నారు. ఈ రెండు దే శాల పర్యటన తరువాత వారు ఈ నెల 25వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. కేసీఆర్‌తోపాటు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డెరైక్టర్ జయేష్‌రంజన్‌లు ఈ పర్యటనకు వెళ్తున్నారు.
ఈ నెల 20న సింగపూర్‌లో జురాంగ్ ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శిస్తుంది. ఆరోజు రాత్రి సింగపూర్‌లో ఉండే తెలంగాణ ప్రజలతో సమావేశం అవుతారు. 21వ తేదీ న సింగపూర్‌లోని స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పరి శ్రమ వర్గాలతో సమావేశం అవుతారు. 22వ తేదీన ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. సదస్సులో సింగపూర్ ప్రధానమంత్రి కూడా పాల్గొంటారని సమాచారం. 23న సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులతో సమావేశం, సింగపూర్ పట్టణ నమూనా, అభివృద్ధిపై పరిశీలన, ఈ-గవర్నెన్స్‌పై అధ్యయనం ఉంటుంది. 24వ తేదీన మలేషియా బయలుదేరి వెళ్తారు. ఆ దేశంలో కౌలాలంపూర్ నగర అభివృద్ధిని పరిశీలిస్తారు. 25వ తేదీన పట్టణీకరణ, రవాణా వ్యవస్థ, పోలీసింగ్ ను పరిశీలిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.