సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: డీఈఓబదిలీ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఎన్నికలు ముగిసిన తరువాత రమేష్‌ను జిల్లా నుంచి రిలీవ్ చేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. డీఈఓను బదిలీ చేయాలని, లేకుంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తామని బుధవారం ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టర్‌కు అల్టిమేటం ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గురువారం ఆమె పీఆర్‌టీయూ నాయకులు సత్యనారాయణరెడ్డి, లక్ష్మణ్, యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, సాయిలు, తదితరులతో చర్చలు జరిపారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నేతలే ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తాము డీఈఓ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేయగా, అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. డీఈఓపై వచ్చిన ఆరోపణల గురించి త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే డీఈఓ రమేష్‌ను కొనసాగిస్తున్నట్లు ఆమె వెల్లడించారనీ, ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన్ను రిలీవ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సమస్యలపట్ల కూడా కలెక్టర్ సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఎన్నికల తర్వాత బదిలీ
Published Thu, Mar 6 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement
Advertisement