సాక్షి, సంగారెడ్డి: సాధారణ ఎన్నికల వేళ ఏటీఎంల ద్వారా నగదు లావాదేవీలు అసాధారణ రీతిలో జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కొందరు అభ్యర్థులు ఏటీఎంలను డబ్బు రవాణా మార్గాలుగా ఉపయోగించుకుంటున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతుం డడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జిల్లా సరిహద్దుల్లో నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనఖీలు చేస్తుండడంతో కొందరు అభ్యర్థులు నగదు రవాణా, పంపిణీ అవసరాలకు ఏటీఎంలను వినియోగించుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం నేపథ్యంలో .. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ బుధవారం ఏటీఎంలకు సంబంధించిన లావాదేవీలపై ఆరాతీశారు. గడిచిన మూ డు నెలల్లో జిల్లాలోని ఏటీఎంల ద్వారా జరిగిన నగదు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బ్యాంకుల నుంచి తెప్పించుకుని విశ్లేషిస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో ఏటీఎంల ద్వారా డబ్బుల డ్రా అసాధారణ రీతిలో పెరిగిపోయినట్లు కలెక్టర్ పరిశీలనలో తేలింది. జిల్లాలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలైన ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రబ్యాంక్‌లకు సంబంధించిన 86 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏటీఎంల ద్వారా.. జనవరిలో 174.16 కోట్లు, ఫిబ్రవరిలో 165.07 కోట్లు డ్రా అయితే మార్చి నెలలో రూ.190.59 కోట్లు డ్రా అయ్యాయి. ఫిబ్రవరితో పోల్చితే ఒక్క మార్చి నెలలోనే ఏకంగా రూ.25.59 కోట్లు అదనంగా డ్రా అయ్యాయి.
బ్యాంకుల వారీగా పరిశీలిస్తే.. ఎస్‌బీహెచ్‌కు సంబంధించిన 19 ఏటీఎంల ద్వారా ఫిబ్రవరిలో రూ.92.39 కోట్ల లావాదేవీలు జరిగితే మార్చిలో రూ.110.65 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆంధ్రబ్యాంక్‌కు చెందిన 31 ఏటీఎంల ద్వారా ఫిబ్రవరిలో రూ.32.49 కోట్లు డ్రా అయితే, మార్చిలో రూ.41.21 కోట్లు డ్రా అయ్యాయి. దీంతో ఈ లావాదేవీలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంల లావాదేవీలపై దర్యాప్తు పనిని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఏటీఏంల ద్వారా అసాధారణ లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాదారులను పిలిపించి ఏ విషయంలో డబ్బులు డ్రా చేశారనే అంశంపై విచారించే అవకాశాలున్నాయి. డ్వాక్రా సంఘాల ఖాతాలను సైతం పరిశీలించి చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఆ నాలుగు నియోజకవర్గాలపై కన్ను..
పారిశ్రామికంగా వృద్ధి చెందిన పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని 15 ఏటీఎంల ద్వారా ఫిబ్రవరిలో రూ.32.49 కోట్లు డ్రా అయితే మార్చిలో రూ.40 కోట్లు డ్రా అయ్యాయి. అదే విధంగా సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో 19 ఏటీఎంల ద్వారా ఫిబ్రవరిలో రూ.41.85 కోట్లు డ్రా అయితే మార్చిలో రూ.45.40 కోట్లు డ్రా అయ్యాయి. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని 11 ఏటీంఎంలలో సైతం రూ.3.73 కోట్లు అదనంగా డ్రా అయ్యాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని 5 ఏటీఎంలో ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రూ.3.84 కోట్లు అదనంగా డ్రా అయ్యాయి. లోతుగా దర్యాప్తు జరిపితే ఎన్నికల కోణం బయట పడే అవకాశాలున్నాయి.
అ‘సాధారణ’ రీతిలో లావాదేవీలు
Published Tue, Apr 8 2014 11:45 PM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM
Advertisement
Advertisement