deo transfer
-
డీఈఓపై.. బదిలీ వేటు!
సాక్షి, నల్లగొండ : ఎట్టకేలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. కొన్నాళ్లుగా జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న వ్యవహారాలపై ఏమీ పట్టనట్టు వ్యవహరించిన వారు ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు. జిల్లా ఓపెన్ స్కూల్స్ కో–ఆర్డినేటర్ పోస్టింగ్ విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖాధికారి పి.సరోజినీదేవిపై బదిలీ వేటు వేశారు. ఆమెను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేశారు. జిల్లా విద్యాశాఖలో బాహాటంగా జరిగిన వ్యవహారాలను ‘సాక్షి’ రెండు వరుస కథనాలతో బట్టబయలు చేసింది. జిల్లా విద్యాశాఖను ఓ కుదుపు కుదిపిన ఈ కథనాలతో రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం స్పందించక తప్పలేదు. జిల్లా ఓపెన్ స్కూల్స్ కో–ఆర్డినేటర్ పోస్టులో కొనసాగేందుకు రావులపెంట జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం. మంగళ ఏకంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి పేర సిఫారసు లేఖను సృష్టించారు. ఈ సిఫారసు లేఖను అడ్డం పెట్టి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తనకు పోస్టింగ్ ఇచ్చినట్లుగా నకిలీ ఉత్తర్వులను సృష్టించారు. వీటి ఆధారంగా ఆమె తిరిగి జిల్లా ఓపెన్స్ స్కూల్స్ కో–ఆర్డినేటర్‌గా నియామకం అయ్యారు. ఈ వ్యవహారం మొత్తాన్ని ‘సాక్షి’ జిల్లా ఎడిషన్ లో ఈనెల 4వ తేదీన ‘పోస్టింగ్ కోసం ఫోర్జరీ’, 5వ తేదీన ‘ కదులుతున్న డొంక – పోస్టింగ్ లేఖ కూడా ఫోర్జరీ’ అన్న ప్రత్యేక కథనాలు ప్రచురించింది. కదిలిన ఉన్నతాధికారులు ఈ రెండు ప్రత్యేక కథనాల తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తొలుత అప్పటి కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ జిల్లా విద్యాశాఖాధికారి నుంచి ఓ నివేదిక తెప్పించుకుని ఉన్నతాధికారులకు సమర్పించారు. అదే సమయంలో డీఈఓ సైతం ఓ నివేదికను పాఠశాల విద్యాశాఖకు అందజేశారు. ఆ వెంటనే రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ‘మంత్రి కేటీఆర్ సిఫారసు లేఖను ఫోర్జరీ అని తేల్చారు. దీంతోపాటే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇచ్చినట్లుగా సృష్టించిన పోస్టింగ్ ఉత్తర్వులూ నకిలీదిగా గుర్తించారు. దీంతో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సృష్టించి నకిలీ ఉత్తర్వుల కాపీ అంశంపై కో–ఆర్డినేటర్ మంగళపై నల్లగొండ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఆమె తన కో–ఆర్డినేటర్ పోస్టుకు రాజీనామా చేసి ఒరిజినల్ పోస్టు అయిన రావులపెంట జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా విధుల్లో చేరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నమోదైన ఈ కేసులో ఆమె వన్‌టౌన్ పోలీసుల ఎదుట సోమవారం నాడు లొంగిపోయి స్టేషన్ బెయిల్ తీసుకున్నారు. పూర్తి చర్యలకు సిఫారసు చేస్తూ డీఈఓ కార్యాలయం నుంచి ఆర్జేడీ కార్యాలయానికి నివేదిక పంపారు. అయితే, జిల్లా ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్‌గా మంగళను రెండోసారి కొనసాగించడానికి సహకరించడమే కాకుండా, కొత్తగా పోస్టింగ్ పొందిన సూర్యాపేట జిల్లాకు చెందిన హెచ్ఎంను విధుల్లో చేర్చుకోకుండా డీఈఓ తిప్పి పంపించారు. నకిలీ ఉత్తర్వుల ఆధారంగా మంగళను ఆపోస్టులో కొనసాగించారు. దీంతో ఈ అంశాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారని, ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే జి ల్లా విద్యాశాఖాధికారి పి.సరోజిదేవీపై బదిలీ వే టు వేశారని విద్యాశాఖ వర్గాలు విశ్లేషించాయి. -
ఎన్నికల తర్వాత బదిలీ
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: డీఈఓబదిలీ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఎన్నికలు ముగిసిన తరువాత రమేష్‌ను జిల్లా నుంచి రిలీవ్ చేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. డీఈఓను బదిలీ చేయాలని, లేకుంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తామని బుధవారం ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టర్‌కు అల్టిమేటం ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గురువారం ఆమె పీఆర్టీయూ నాయకులు సత్యనారాయణరెడ్డి, లక్ష్మణ్, యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, సాయిలు, తదితరులతో చర్చలు జరిపారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నేతలే ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాము డీఈఓ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేయగా, అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. డీఈఓపై వచ్చిన ఆరోపణల గురించి త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే డీఈఓ రమేష్‌ను కొనసాగిస్తున్నట్లు ఆమె వెల్లడించారనీ, ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన్ను రిలీవ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సమస్యలపట్ల కూడా కలెక్టర్ సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.