డీఈఓపై.. బదిలీ వేటు!  | Nalgonda DEO Transfer TO Kothagudem By Alligations | Sakshi
Sakshi News home page

డీఈఓపై.. బదిలీ వేటు! 

Published Sat, Oct 26 2019 10:34 AM | Last Updated on Sat, Oct 26 2019 10:34 AM

Nalgonda DEO Transfer TO Kothagudem By Alligations - Sakshi

సాక్షి, నల్లగొండ : ఎట్టకేలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. కొన్నాళ్లుగా జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న వ్యవహారాలపై ఏమీ పట్టనట్టు వ్యవహరించిన వారు ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు. జిల్లా ఓపెన్‌ స్కూల్స్‌ కో–ఆర్డినేటర్‌ పోస్టింగ్‌ విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖాధికారి పి.సరోజినీదేవిపై బదిలీ వేటు వేశారు. ఆమెను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేశారు. జిల్లా విద్యాశాఖలో  బాహాటంగా జరిగిన వ్యవహారాలను ‘సాక్షి’ రెండు వరుస కథనాలతో బట్టబయలు చేసింది. జిల్లా విద్యాశాఖను ఓ కుదుపు కుదిపిన ఈ కథనాలతో రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం స్పందించక తప్పలేదు.

జిల్లా ఓపెన్‌ స్కూల్స్‌ కో–ఆర్డినేటర్‌ పోస్టులో కొనసాగేందుకు రావులపెంట జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం. మంగళ ఏకంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి పేర సిఫారసు లేఖను సృష్టించారు. ఈ సిఫారసు లేఖను అడ్డం పెట్టి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తనకు పోస్టింగ్‌ ఇచ్చినట్లుగా నకిలీ ఉత్తర్వులను సృష్టించారు. వీటి ఆధారంగా ఆమె తిరిగి జిల్లా ఓపెన్స్‌ స్కూల్స్‌ కో–ఆర్డినేటర్‌గా నియామకం అయ్యారు. ఈ వ్యవహారం మొత్తాన్ని ‘సాక్షి’ జిల్లా ఎడిషన్‌ లో ఈనెల 4వ తేదీన ‘పోస్టింగ్‌ కోసం ఫోర్జరీ’, 5వ తేదీన ‘ కదులుతున్న డొంక – పోస్టింగ్‌ లేఖ కూడా ఫోర్జరీ’ అన్న ప్రత్యేక కథనాలు ప్రచురించింది. 

కదిలిన ఉన్నతాధికారులు
ఈ రెండు ప్రత్యేక కథనాల తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తొలుత అప్పటి కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ జిల్లా విద్యాశాఖాధికారి నుంచి ఓ నివేదిక తెప్పించుకుని ఉన్నతాధికారులకు సమర్పించారు. అదే సమయంలో డీఈఓ సైతం ఓ నివేదికను పాఠశాల విద్యాశాఖకు అందజేశారు. ఆ వెంటనే రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ‘మంత్రి కేటీఆర్‌ సిఫారసు లేఖను ఫోర్జరీ అని తేల్చారు. దీంతోపాటే పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఇచ్చినట్లుగా సృష్టించిన పోస్టింగ్‌ ఉత్తర్వులూ నకిలీదిగా గుర్తించారు. దీంతో కమిషనర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి సృష్టించి నకిలీ ఉత్తర్వుల కాపీ అంశంపై కో–ఆర్డినేటర్‌ మంగళపై నల్లగొండ వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఆమె తన కో–ఆర్డినేటర్‌ పోస్టుకు రాజీనామా చేసి ఒరిజినల్‌ పోస్టు అయిన రావులపెంట జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎంగా విధుల్లో చేరారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నమోదైన ఈ కేసులో ఆమె వన్‌టౌన్‌ పోలీసుల ఎదుట సోమవారం నాడు లొంగిపోయి స్టేషన్‌ బెయిల్‌ తీసుకున్నారు. పూర్తి చర్యలకు సిఫారసు చేస్తూ డీఈఓ కార్యాలయం నుంచి ఆర్జేడీ కార్యాలయానికి నివేదిక పంపారు. అయితే, జిల్లా ఓపెన్‌ స్కూల్స్‌ కో ఆర్డినేటర్‌గా మంగళను  రెండోసారి కొనసాగించడానికి సహకరించడమే కాకుండా, కొత్తగా పోస్టింగ్‌ పొందిన సూర్యాపేట జిల్లాకు చెందిన హెచ్‌ఎంను విధుల్లో చేర్చుకోకుండా డీఈఓ తిప్పి పంపించారు. నకిలీ ఉత్తర్వుల ఆధారంగా మంగళను ఆపోస్టులో కొనసాగించారు. దీంతో ఈ అంశాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారని, ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే జి ల్లా విద్యాశాఖాధికారి పి.సరోజిదేవీపై బదిలీ వే టు వేశారని విద్యాశాఖ వర్గాలు విశ్లేషించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement