ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి | should be respond on election complaints | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

Published Wed, Mar 12 2014 12:19 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM

should be respond on election complaints

 సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్:  ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాలకు వచ్చే ఫిర్యాదులను వెంటనే  పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో మంగళవారం ఆమె కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్వో దయానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

 జిల్లాలో 2407 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను ఈనెల 16లోగా పూర్తి చేసి నివేదికను ఎలక్షన్ వెబ్‌సైట్లో నిక్షిప్తం చేయాలన్నారు. ఈ సారి ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లో ‘పైన పేర్కొన్న వారు ఎవరూ కాదు’ అనే ఆప్షన్‌ను పొందుపర్చిందని, ఈ ఆప్షన్‌ను ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద బ్యానర్ల ద్వారా ప్రదర్శించి ప్రచారం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరం ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈనెల 16లోగా ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏ విధమైన కారణం లేకుండా ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 జిల్లాకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ పరిశీలకులు  40 మంది ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, జిల్లాలోని విశ్రాంతి గృహాలన్నింటినీ సంబంధిత రిటర్నింగ్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
 ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై ఎన్నికల సంఘం లిఖిత పూర్వక నిబంధనలు జారీ చేసిందని, ఏ అధికారి కూడా తమ సొంత విధానాలతో ఎన్నికల ప్రక్రియ చేపట్టవద్దని సూచించారు. శాసన సభా నియోజకవర్గాల వారీగా జోన్ రూట్‌మ్యాప్‌లను, పోలింగ్ కేంద్రాల టెలిఫోన్ నంబర్‌ఏర్పాటు, సంబంధిత అధికారి వివరాలను, రిటర్నింగ్ అధికారి కార్యాలయం, అధికారి చాంబర్ వివరాలు, రిసెప్షన్ సెంటర్, పంపిణీ కేంద్రం, టెంపరరీ స్ట్రాంగ్ రూమ్‌ల వివరాలను ఈనెల 20లోగా తయారు చేసి సమర్పించాలన్నారు.

ప్రతిపోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌పై ట్రయల్ రన్, వెబ్‌కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్ వీడియో గ్రఫీని ఈనెల 20లోగా తయారు చేసి సమర్పించాలని సూచించారు. ప్రతి శాసన సభా నియోజకవర్గం వారీగా ఈనెల 13లోగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలోని సమస్యాత్మక, సున్నిత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ సూచించారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో సమస్యాత్మక, సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. జిల్లాలో ఆయుధాల లెసైన్సులు, కొత్త ఆయుధాలకు లెసైన్సులు రెన్యువల్ చేయవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement