సాక్షి, సంగారెడ్డి: పక్షం రోజుల ఉత్కంఠత.. ఉద్విగ్నతకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈవీఎంలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం నేడు బయటపడనుంది. నువ్వా, నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ఫలితాల వెల్లడికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్ 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలకు 23 మంది, 10 అసెంబ్లీ స్థానాలకు 105 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓటర్లు సైతం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో జిల్లాలో 76.83 శాతం పోలింగ్ నమోదైంది. అభ్యర్థుల తలరాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నిక్షిప్తమై ఉం ది. శుక్రవారం ఈ ఈవీఎంలను క్రోడీకరించడం ద్వారా ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
అందరి దృష్టీ జిల్లాపైనే
ఒకేసారి వచ్చినపడిన సార్వత్రిక, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పై చెయ్యి సాధించగా.. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు సైతం మన జిల్లా నుంచే పోటీ చేస్తుండడంతో అందరి చూపు ఇక్కడి ఫలితాలపైనే కేంద్రీకృతమై ఉంది.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీతో పాటు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. మెదక్ లోక్‌సభలో ఆయన గెలుపు సునాయసనమే అయినా.. గజ్వేల్‌లో మాత్రం టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి తన సొంత బలంతో అమీతుమీకి దిగి కేసీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డిలకు సైతం ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు ముచ్చెమటలు పట్టించారు. వీరి భవితవ్యంపై ఉత్కంఠకు నేటితో తెరపడనుంది.
లెక్కింపు కేంద్రాలు ఇవే..
జిల్లావ్యాప్తంగా 2,678 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ కోసం 6 వేల ఈవీఎంలను వినియోగించారు. అనంతరం ఈ యంత్రాలను..సంగారెడ్డి, పటాన్‌చెరు మండలాల పరిధిలోని మూడు ప్రైవేటు విద్యా సంస్థల్లో స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేసి భద్రపరిచారు.
డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల: జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును సంగారెడ్డి మండలం కాశీపూర్‌లోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఇదే కళాశాలలో భద్రపరిచారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల క్రోడీకరణ, ఫలితాల ప్రకటన డీవీఆర్ కళాశాలలోనే జరపనున్నారు.
ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాల: మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును సంగారెడ్డి మండలం ఫసల్‌వాది శివారులోని ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో నిర్వహించనున్నారు.
గీతం విశ్వవిద్యాలయం: మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును పటాన్‌చెరు మండలం రుద్రారం పరిధిలో గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల క్రోడీకరణ, ఫలితాల ప్రకటన సైతం గీతం యూనివర్శిటీలోనే జరుపుతారు.
మరికొన్ని గంటల్లో వెల్లడికానున్న ‘సార్వత్రిక’ ఫలితాలు
Published Thu, May 15 2014 11:37 PM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement