మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 2
నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 2
నామినేషన్ల స్వీకరణకు
ఆఖరి గడువు: ఏప్రిల్ 10
నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 12
పోలింగ్ తేదీ ఏప్రిల్ 30
కౌంటింగ్, ఫలితాల ప్రకటన మే 16
సాక్షి, సంగారెడ్డి: మరో సమరానికి తెరలేవనుంది. సార్వత్రిక ఎన్నికలకు బుధవారం నగారా మోగనుంది. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు పనిది నాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. శాసనసభ నియోజకవర్గాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.
మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్లను కలెక్టరేట్‌లో స్వీకరించనున్నారు. మెదక్ లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్, జహీరాబాద్ లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ వ్యవహరించనున్నారు. గడువులోగా దాఖలైన నామినేషన్లను ఈ నెల 10వ తేదీన పరిశీలించనున్నారు. అనంతరం 12వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.
ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
కొత్త పోలింగ్ కేంద్రాలు 271
గత సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 2,407 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగినందున అదనంగా 271 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,678కు పెరగనుంది.
ఓటరుకు బ్రహ్మాస్త్రం ‘నోటా’
తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరణ(నోటా) ఓటును వినియోగించుకునే అవకాశాన్ని పొందనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఒక్కరూ నచ్చకపోతే ఈవీఎంపై ఉండే ‘నోటా’ మీటను నొక్కి అందరినీ తిరస్కరించే వెసులుబాటును ఓటర్లు పొందనున్నారు. అయితే, ఈ ఎన్నికల సందర్భంగా జిల్లాలో వీవీ పాడ్(ఓట్ వెరిఫయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రయల్) సౌకర్యాన్ని ఓటర్లకు కల్పించడం లేదని ఈవీఎంల నోడల్ అధికారి, డీఆర్వో దయానంద్ ‘సాక్షి’కి తెలిపారు. ఓటేసిన తర్వాత తమ ఓటు ఎవరికి పోలైందో తెలుసుకోడానికి ఓటరుకు ప్రింట్ రశీదు అందేలా ‘వీవీ పాడ్’ సౌకర్యం ఓటర్లకు కల్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.
ఓటు నమోదుకు 9వ తేదీ వరకు
జనవరి 31న ప్రచురించిన తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 21 లక్షల 36 వేల 348 మంది ఓటర్లున్నారు. ఇంకా ఓటరుగా నమోదు కాని వారు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని ‘ఫారం-6’ నింపి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడానికి గత నెలాఖరు వరకు అవకాశం కల్పించారు. దీనికి ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువును పొడిగించినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అనంతరం కొత్త దరఖాస్తులపై విచారణ జరిపి అర్హులైన ఓటర్లతో అనుబంధ(సప్లిమెంటరీ) ఓటరు జాబితాను ప్రచురించనున్నారు.