కలెక్టర్ స్మితా సబర్వాల్ బదిలీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ‘మార్పు’నకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ స్మితా సబర్వాల్ బదిలీ అయ్యారు. తెలంగాణ తొలి సీఎం కె.చంద్రశేఖర్‌రావు బృందంలో సభ్యురాలిగా నియామకమయ్యారు. సీఎం అదనపు కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
జాయింట్ కలెక్టర్ శరత్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొంది. స్మితా సబర్వాల్ కరీంనగర్ నుంచి మెదక్ జిల్లాకు గత ఏడాది అక్టోబర్‌లో వచ్చారు. అక్టోబర్ 16న కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సుమారు తొమ్మిది నెలలపాటు పనిచేశారు. ఆమె జిల్లా అభివృద్ధికి పాటుపడటంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించారు. అలాగే స్వల్ప వ్యవధిలో వచ్చిన పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
‘మార్పు’నకు శ్రీకారం
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్మితా సబర్వాల్ జిల్లాలో విద్య, వైద్యశాఖలపై దృష్టి పెట్టారు. మిహ ళలకు ముఖ్యంగా గర్భిణులకు మెరుగైన వైద్యసేవలతోపాటు పౌష్టికాహారం అందించేందుకు ‘మార్పు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే గర్భిణుల కోసం సిద్దిపేట, పటాన్‌చెరు, మెదక్‌లో హై రిస్కు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిని రూ.3 కోట్లతో అభివృద్ధి చేశారు. పదో తరగతి ఫలితాలు మెరుగుపర్చేందుకు తగిన చర్యలు చేపట్టారు.
అలాగే వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తెచ్చారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా 30 రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి స్మితా సబర్వాల్ చర్యలు చేపట్టారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం నాటి తన పర్యటన సందర్భంగా కలెక్టర్ స్మితా సబర్వాల్ పనితీరుపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.