సాక్షి, సంగారెడ్డి: జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ వ్యవహార శైలి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఖంగు తినిపించింది. కలెక్టర్‌ను కలవడానికి గురువారం ఆమె కార్యాలయానికి వచ్చిన దుబ్బాక, పటాన్‌చెరు ఎమ్మెల్యేలు చెరుకు ముత్యంరెడ్డి, నందీశ్వర్ గౌడ్‌లకు పరాభవం ఎదురైంది. ఇద్దరిలో ఓ ఎమ్మెల్యే కలెక్టర్‌ను కలుసుకోలేకే వెనుతిరిగిపోగా.. మరో ఎమ్మెల్యే దాదాపు రెండు గంటలకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే...జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ గురువారం మధ్యాహ్నం తన కార్యాలయ సమావేశ మందిరంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటి తర్వాత ఎమ్మెల్యేలు చెరుకు ముత్యంరెడ్డి ముత్యం రెడ్డి, నందీశ్వర్ గౌడ్‌లు కలెక్టర్‌ను కలవడానికి ఆమె కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యేలు వచ్చిన విషయాన్ని కార్యాలయ సిబ్బంది సమావేశంలో ఉన్న కలెక్టర్‌కు చేరవేశారు.
అయితే, కలెక్టర్ స్మితా సబర్వాల్ సమావేశంలో పాల్గొనడానికే మొగ్గు చూపడంతో ఎమ్మెల్యేలు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాదాపు అర్ధగంటకు పైగా వేచి చూసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కలెక్టర్‌ను కలుసుకోకుండానే వెనుతిరిగారు. ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి చూసి కలెక్టర్‌ను రాగానే ఆమెతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు.
ఈ అంశంపై ముత్యంరెడ్డి ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ .. మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తై రైతులకు మార్క్‌ఫెడ్ ఇంకా డబ్బులు చెల్లించలేదనే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి వచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ నేతలిద్దరూ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సభ్యులైనప్పటికీ సమావేశంలో పాల్గొనకుండా కలెక్టర్‌ను కలవడానికే మొగ్గు చూపడం విశేషం.
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు లభించని కలెక్టర్ దర్శనం
Published Thu, Jan 16 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement