కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో 20 సూత్రాల పథకం అమలులో లక్ష్యం సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో 20 సూత్రాల పథకం పురోగతిపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణం, అంగన్‌వాడీ మినహా మిగిలిన అన్ని శాఖలు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇందిరా ఆవాస్‌యోజన కింద చేపట్టిన 900కు పైగా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మినీ అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులకు ఇప్పటికే మంజూరు తీసుకున్నా పనులు పూర్తి చేయకపోవటంపై ఐసీడీఎస్ పీడీ శైలజపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సీపీఓ గురుమూర్తి, డీఆర్‌డీఏ , డ్వామా, హోసింగ్ పీడీలు రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్, బాల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయప్రకాశ్ పాల్గొన్నారు.
నిర్వాసితులకు నెలలోగా పట్టాలు
దుండిగల్ వైమానిక దళ అకాడమీలో ఓపెన్ టెస్టు రేంజ్ ఏర్పాటుతో నిర్వాసితులవుతున్న దాచారం, దరుగుల్ల గ్రామ ప్రజలకు ఈనెలాఖరులోగా ఇళ్ల స్థలాలు అందజేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ భరోసా ఇచ్చారు. నెలాఖరులోగా నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందజేసేలా చూస్తామన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో నిర్వాసితుల పునరావాస కల్పనపై సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేసీ శరత్, భూ సేకరణ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుండిగల్ సమీపంలో కేంద్ర రక్షణ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓపెన్ టెస్టు రేంజ్ ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు మండల పరిధిలోని కిష్టాయపల్లిలో 35 ఎకరాల భూమి గుర్తించి పునరావాసం కల్పించేందుకు గతంలోనే నిర్ణయించినట్లు చెప్పారు. పునరావాసం, పరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.14.40 కోట్లు విడుదల చేసిందన్నారు. జాతీయ పునరావాస పథకం కింద రూ.7.20 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ చెప్పారు. రెండు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి 350కు పైగా నిర్వాసిత కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు.
191 పక్కా కట్టడాలను గుర్తించామని వాటికి నష్టపరిహారం అందజేస్తామన్నారు. ప్రాజెక్టు ద్వారా నష్టపోతున్న 175 కుటుంబాలకు రూ.3.09 కోట్లు ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద అందించేందుకు మెదక్ ఆర్డీవో ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్లాట్ల కేటాయింపు, మార్కింగ్ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. సమావేశంలో మెదక్ ఆర్డీవో వనజాదేవి, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
Published Wed, Mar 5 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
Advertisement
Advertisement