సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న చాగండ్ల నరేంద్రనాథ్ చుట్టూ కష్టాలు ముసురుకుంటున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నందున ఆయనపై చర్యలకు సిఫారసు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు గురువారం సాయంత్రం నివేదిక పంపించారు. రామాయంపేట, శంకరంపేట, మెదక్, గజ్వేల్, కౌడిపల్లి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు కొన్ని రోజు లుగా జరిపిన దాడుల్లో భారీ ఎత్తున గృహోపకరణాలు, క్రీడా సామగ్రి లభ్యమైంది. బీరువాలు, వీధి దీపాలు, డ్రమ్ములు, క్యారం బోర్డు లు, క్రికెట్ కిట్లు, వాలీబాల్ నెట్లు, వాచీలు తదితర వస్తువులు వీటిలో ఉన్నాయి.
వీటి విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా ఓటర్లకు పంపిణీ చేసేందుకు నరేంద్రనాథ్ నిల్వ చేసినవేనని అనుమానిస్తున్నారు. దీనిపై వివరణ కోరుతూ ఆయనకు మూడు సార్లు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈ సరుకుతో తనకెలాంటి సంబంధం లేదని నరేంద్రనాథ్ తొలి రెండు నోటీసులకు జవాబు ఇచ్చుకున్నట్టు సమాచారం. ఎక్కడో ఓ చోట ఆయనకు సంబంధించిన సరుకు లభిస్తుండడంతో.. మిగిలిన నిల్వలను మంగళవారం సాయంత్రంలోగా బయటపెట్టాలని గడువు విధిస్తూ నరేంద్రనాథ్‌కు జిల్లా కలెక్టర్ మూడో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుకు నరేంద్రనాథ్ గడువులోగా సమాధానం ఇవ్వలేదు.
ఈ పరిణామాలను వివరిస్తూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి నివేదికను పంపించారు. ఈసీ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం నరేంద్రనాథ్‌పై చర్యలు తీసుకునే అవకాశముంది. సామగ్రి పట్టుబడిన విషయంలో ఇప్పటికే నరేంద్రనాథ్‌పై వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఏడు కేసులు నమోదయ్యాయి. ఓసారి ఆయన అరెస్టయి ఆ వెంటనే బెయిలుపై విడుదలయ్యారు కూడా. తాజాగా కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో ఆయన మరింత చిక్కుల్లో చిక్కుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే ప్రజలకు పంపిణీ చేయడానికి మధ్యవర్తులకు సరుకును అప్పగిస్తే.. వారు పంపిణీ చేయకుండా దాచి పెట్టుకోవడంతోనే ఈ సమస్య వచ్చిందని నరేంద్రనాథ్ సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. దీని మూలంగా సరుకు ఎవరి వద్ద ఉందో ఇప్పుడు చెప్పడం తనకు సాధ్యం కాదని ఆయన చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నరేన్.. మారరేం!
Published Fri, Mar 28 2014 11:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement