వికసించని కమలం
వికసించని కమలం
Published Wed, May 14 2014 2:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
ఒక్క ఎంపీపీనీ గెలుచుకోలేని దైన్యం
పది జిల్లాలు కలిపి మూడు జెడ్పీటీసీ స్థానాలతో సరి
సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల్లో కమలం పార్టీ గల్లంతైంది. తెలంగాణలోని పది జిల్లాల్లో కనీసం ఒక్క మండల ప్రజా పరిషత్‌ను కూడా దక్కించుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో... తెలంగాణ తెచ్చిన పార్టీల్లో ఒకటిగా ప్రజల్లో ఉన్న గుర్తింపు భారీగా ఓట్లను రాలుస్తుందని ఆశించిన ఆ పార్టీకి తీవ్ర నిరాశే ఎదురైంది. సోమవారం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల్లో ఎంతోకొంత ప్రభావం చూపగలిగినా, ప్రాదేశిక ఎన్నికల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది.
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు నామమాత్రంగానైనా పోటీ ఇవ్వలేక చతికిలపడింది. తెలంగాణలోని పది జిల్లాలకు కలిపి ముచ్చటగా మూడు జెడ్పీటీసీలను మాత్రమే సాధించగలిగింది. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశించిన ఆ పార్టీ నేతలకు తీవ్ర నిరాశే మిగిలింది. జిల్లాలో 50 ఎంపీటీసీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ ఒక్క ఎంపీపీని కూడా కైవసం చేసుకోలేకపోయింది. మేడ్చల్ మండలంలో టీడీపీతో సమంగా 6 ఎంపీటీసీ స్థానాలు సాధించినందున ఆ పార్టీతో సంయుక్తంగా ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.
శంషాబాద్, హయత్‌నగర్ మండలాల్లో బీజేపీ సహకారంతో టీడీపీ ఎంపీపీని గెలుచుకునే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో 52 ఎంపీటీసీ స్థానాలు పొంది కొంత ఫర్వాలేదనిపించినా ఒక్క జెడ్పీటీసీతోనే సరిపుచ్చుకోవాల్సి రావటంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరించింది. నిజామాబాద్‌లో కేవలం 34 ఎంపీటీసీ స్థానాలతోనే సరిపెట్టుకుంది. వరంగల్‌లో మరీ దారుణంగా 8 ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైంది. ఆదిలాబాద్‌లో 23 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 54 ఎంపీటీసీ స్థానాలు, రెండు జెడ్పీటీసీ స్థానాలు సాధించింది. మెదక్‌లో 12 ఎంపీటీసీ స్థానాలతో సరిపెట్టుకుంది. నల్లగొండలో 8 ఎంపీటీసీ స్థానాలు పొందింది.
Advertisement
Advertisement