chagandla narendra nath
-
నరేన్.. మారరేం!
సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న చాగండ్ల నరేంద్రనాథ్ చుట్టూ కష్టాలు ముసురుకుంటున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నందున ఆయనపై చర్యలకు సిఫారసు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు గురువారం సాయంత్రం నివేదిక పంపించారు. రామాయంపేట, శంకరంపేట, మెదక్, గజ్వేల్, కౌడిపల్లి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు కొన్ని రోజు లుగా జరిపిన దాడుల్లో భారీ ఎత్తున గృహోపకరణాలు, క్రీడా సామగ్రి లభ్యమైంది. బీరువాలు, వీధి దీపాలు, డ్రమ్ములు, క్యారం బోర్డు లు, క్రికెట్ కిట్లు, వాలీబాల్ నెట్లు, వాచీలు తదితర వస్తువులు వీటిలో ఉన్నాయి. వీటి విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా ఓటర్లకు పంపిణీ చేసేందుకు నరేంద్రనాథ్ నిల్వ చేసినవేనని అనుమానిస్తున్నారు. దీనిపై వివరణ కోరుతూ ఆయనకు మూడు సార్లు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈ సరుకుతో తనకెలాంటి సంబంధం లేదని నరేంద్రనాథ్ తొలి రెండు నోటీసులకు జవాబు ఇచ్చుకున్నట్టు సమాచారం. ఎక్కడో ఓ చోట ఆయనకు సంబంధించిన సరుకు లభిస్తుండడంతో.. మిగిలిన నిల్వలను మంగళవారం సాయంత్రంలోగా బయటపెట్టాలని గడువు విధిస్తూ నరేంద్రనాథ్‌కు జిల్లా కలెక్టర్ మూడో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుకు నరేంద్రనాథ్ గడువులోగా సమాధానం ఇవ్వలేదు. ఈ పరిణామాలను వివరిస్తూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి నివేదికను పంపించారు. ఈసీ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం నరేంద్రనాథ్‌పై చర్యలు తీసుకునే అవకాశముంది. సామగ్రి పట్టుబడిన విషయంలో ఇప్పటికే నరేంద్రనాథ్‌పై వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఏడు కేసులు నమోదయ్యాయి. ఓసారి ఆయన అరెస్టయి ఆ వెంటనే బెయిలుపై విడుదలయ్యారు కూడా. తాజాగా కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో ఆయన మరింత చిక్కుల్లో చిక్కుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే ప్రజలకు పంపిణీ చేయడానికి మధ్యవర్తులకు సరుకును అప్పగిస్తే.. వారు పంపిణీ చేయకుండా దాచి పెట్టుకోవడంతోనే ఈ సమస్య వచ్చిందని నరేంద్రనాథ్ సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. దీని మూలంగా సరుకు ఎవరి వద్ద ఉందో ఇప్పుడు చెప్పడం తనకు సాధ్యం కాదని ఆయన చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఇగో తీస్కో.. నాకే ఓటేస్కో!
సాక్షి, సంగారెడ్డి: మునిసిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడంతో ఓటర్లపై మూడు వైపుల నుంచి ప్రలోభాలు చుట్టు ముట్టాయి. మునిసిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉంటుందని అన్ని పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 30న మునిసిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6న ప్రాదేశిక ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు సమయం ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీల తరఫున శాసనసభ, లోక్‌సభ టికెట్లు ఆశిస్తున్న కొందరు నేతలు రంగంలోకి దిగారు. పంపిణీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నిఘా కళ్లు గప్పి.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభైన వెంటనే జిల్లా వ్యాప్తంగా 26 చెక్‌పోస్టులు ఏర్పా టు చేసి వాహనాల తనఖీ కోసం భారీ సంఖ్యలో బలగాలను నియమించారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1.56 కోట్ల నగదును ఈ తనిఖీల్లో పట్టుకున్నారు. పట్టుబడిన నగదులో సింహభాగం ఎన్నికలతో సంబంధం లేదని తెలుస్తోంది. రాజకీయ నేతలు పోలీసులకు చిక్కకుండా రహస్య మార్గాల్లో నగదును ఓటర్లకు చేరవేస్తుండడమే దీనికి కారణం. బీజేపీ మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి చాగండ్ల నరేంద్రనాథ్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రలోభాలకు గురిచేశారనే ఆరోపణలపై ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ సోమవారం తాఖీదులు జారీ చేశారు. రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఇంటిపై దాడి చేసిన అధికారులు భారీ ఎత్తున గృహోపకరణ వస్తువులు, క్రీడా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని కలెక్టర్ బీజేపీ నేత నరేంద్రనాథ్‌కు నోటీసులు జారీ చేశారు. హైదరాబాదీ బిర్యానీతో .. సంగారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న కొందరు మాజీ కౌన్సిలర్లు రోజూ లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. వీరిలో కొందరు అభ్యర్థులైతే హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్ల నుంచి ‘చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్’ పొట్లాలను తెప్పించి చీకటి పడ్డాగా ఇంటింటికి చేరవేస్తున్నారు. హైదరాబాదీ బిర్యానీ రుచిచూపించి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా ఎన్నికల అధికారులు, స్థానిక పోలీసులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.