కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు నిర్భయంగా ఓటేసేందుకు తగిన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఈ నెల 6వ తేదీన తొలి విడత, 11వ తేదీన మలి విడత ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామన్నారు.
ప్రాదేశిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు గులాబీ రంగులో.. జెడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు తెలుపు రంగులో ఉంటాయన్నారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్‌తో కలిసి శుక్రవారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఓటు హక్కుపై ఓటర్లలో చైతన్యం పెంపొందించడం కోసం రూపొందించిన వీడియో సీడీ, సంకల్ప పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ శరత్, జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీపీఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థుల వాహనాలపై పరిమితి
పోలింగ్ రోజు ఎంపీటీసీ అభ్యర్థులు ఒక వాహనాన్ని, జెడ్పీటీసీ అభ్యర్థులు రెండు వాహనాలకు మించి వినియోగించుకోరాదని స్పష్టం చేశారు. ఈ వాహనాల ఖర్చులు సైతం అనుమతించిన వ్యయపరిమితి లోబడి ఉండాలన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఏదైన పోలింగ్ కేంద్రంలో అవాంఛనీ య కారణాలతో రీ-పోలింగ్ నిర్వహించాల్సి వస్తే పోలింగ్‌కు మరుసటి రోజే రీ-పోలింగ్ నిర్వహిస్తామన్నారు.
ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీని సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఉంటుందన్నారు. అప్పటివరకు బ్యాలెట్ పెట్టెలను పోలీసుల సంరక్షణలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తామన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు రూ.2.20 కోట్ల నగదు ను తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నగదు రవాణాకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతోనే ఈ నగదును సీజ్ చేశామన్నారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న 24 మండలాల్లో ఈ నెల 4 ను ంచి 6వ తేదీ వరకు.. మలి విడత ఎన్నికలు జరిగే 22 మండలాల్లో ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వర కు మద్యం, కల్లు విక్రయాలను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
మంచి నీటి సమస్యపై ఫిర్యాదు చేయండి : కలెక్టర్ విజ్ఞప్తి
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏదైన ప్రాంతంలో తాగునీటి సమస్య ఉత్పన్నమైతే కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నంబర్ 800-8321666కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.
పటిష్ట బందోబస్తు: ఎస్పీ
ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ వెల్లడించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో 227 మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసి శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.
సర్వం సిద్ధం
Published Sat, Apr 5 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement