ఇవేం పరీక్షలు? | Chaos in half yearly examinations | Sakshi
Sakshi News home page

ఇవేం పరీక్షలు?

Published Tue, Dec 31 2013 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

Chaos in half yearly examinations

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  విద్యార్థుల ప్రతిభను సమగ్రంగా మధింపు చేసేందుకు ప్రభుత్వం సీసీఈ విధానాన్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారా అమలు చేస్తోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షల ప్రశ్న పత్రాలను జిల్లా పరీక్షల ఉమ్మడి బోర్డు(డీసీఈబీ) ద్వారా పాఠశాలలకు పంపిణీ చేసేవారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే అర్ధవార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను రాష్ట్ర స్థాయిలో రాజీవ్ విద్యా మిషన్ రూపొందించింది. ‘ఆర్క్‌బర్డ్’ పబ్లికేషన్స్ అనే ప్రైవేటు సంస్థకు ముద్రణ, పంపిణీ బాధ్యతలు అప్పగించింది. సదరు సంస్థ ప్రశ్న పత్రాలను 1000, 500 కట్టలుగా కట్టి బస్తాల్లో జిల్లాకు పంపింది.

మెదక్‌లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల గోడౌన్‌లో సదరు ఏజెన్సీ ప్రశ్న పత్రాలు డంప్ చేసి చేతులు దులుపుకుంది. దీంతో తరగతులు, పాఠశాలల వారీగా ప్రశ్న పత్రాలను వేరు చేసి సీల్డ్ కవర్లలో పాఠశాలలకు చేరవేయాల్సిన బాధ్యత రాజీవ్ విద్యా మిషన్ అధికారులపైనే పడింది. 2023 ప్రాథమిక పాఠశాలలు, 434 ప్రాథమికోన్నత పాఠశాలలకు 2.64లక్షల ప్రశ్న పత్రాలను సకాలంలో చేరవేయ లేక విద్యాశాఖ, ఆర్‌వీఎం అధికారులు, సిబ్బంది తల పట్టుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో 18, ప్రాథమికోన్నత స్థాయిలో 19 టైటిళ్లకు సంబంధించిన ప్రశ్న పత్రాలను లెక్క తప్పకుండా సర్దుబాటు చేయలేక పోతున్నారు. మండల వనరుల కేంద్రాలకు(ఎంఆర్‌సీ) ప్రశ్న పత్రాలు పంపినా, తిరిగి అక్కడా ప్రశ్న పత్రాలను వేరు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఆదరాబాదరాగా కొన్ని పాఠశాలలకు ప్రశ్న పత్రాలను చేరవేయగలిగారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రశ్న పత్రాలు సరఫరా కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తిరిగి మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

 ప్రశ్న పత్రాలకు రక్షణ ఏదీ?
 భద్రంగా సీల్డ్ కవర్లలో సరఫరా చేయాల్సిన ప్రశ్న పత్రాలు ఓపెన్ కవర్లలో పాఠశాలలకు చేరవేస్తున్నారు. దీంతో ప్రశ్న పత్రాల్లో వున్న ప్రశ్నలను ఉపాధ్యాయులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అర్ధవార్షిక పరీక్షల ఫలితాలను పాఠశాలలు, సబ్జెక్టుల వారీగా సమీక్షిస్తామని కలెక్టర్ స్మితాసబర్వాల్ హెచ్చరించారు. ప్రశ్న పత్రాలు ముందే వెల్లడవుతుండటంతో ఉపాధ్యాయులు ప్రశ్నలను విద్యార్థులకు ముందస్తుగా వెల్లడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో డీసీఈబీ ద్వారా సరఫరా చేసే ప్రశ్న పత్రాలను సీల్డ్ కవర్లలో పంపేలా తగిన ఏర్పాట్లు చేసేవారు. ప్రస్తుతం రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర స్థాయిలో ప్రశ్న పత్రాలు ముద్రించాలనే నిర్ణయం వెనుక అధికారుల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే అనుమానాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.
 సర్దుబాటు చేస్తున్నాం: ఎఎంఓ సత్యనారాయణ
 ప్రశ్న పత్రాలు కట్టలుగా సర ఫరా చేయడంతో వేరు చేయడంలో సమస్య తలెత్తిందని ఆర్‌వీఎం అకడమిక్ మానిటరింగ్ అధికారి సత్యనారాయణ ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రశ్న పత్రాలు తక్కువ పడిన పాఠశాలలకు తక్షణమే ప్రశ్న పత్రాలు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టైటిళ్లు ఎక్కువగా వుండటంతో బండిల్స్ చేయడంలో శ్రమిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement