సాక్షి, సంగారెడ్డి: వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల(బీఆర్‌జీఎఫ్)కు బూజు పట్టింది. ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ నిధులు రికార్డుల్లోనే మూలుగుతున్నాయి. కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశాలతో జిల్లా పరిషత్ కార్యాలయం అధికారులు నిరుపయోగంగా మూలుగుతున్న నిధుల లెక్కలు వెలికి తీశారు. వరుసగా 2010-11, 2011-12, 2012-13 సంవత్సరాల్లో మంజూరైన నిధులతో చేపట్టిన పనుల్లో పూర్తయినవి, పురోగతిలో ఉన్నవి, ఇంకా ప్రారంభం కాని పనుల జాబితాలను మండలాల వారీగా సిద్ధం చేశారు.
దాదాపు వారం రోజుల కసరత్తు ముగియడంతో జడ్పీ అధికారులు గురువారం సాయంత్రం సమగ్ర నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. జడ్పీ నిధులతో మంజూరైన పనులు ఇంకా ప్రారంభం కాకుంటే రద్దు చేస్తామని, అలాంటి పనుల పూర్తి వివరాలు అందజేయాలని.. ఈ నెల 4న డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన యంత్రాంగం నివేదిక సిద్ధం చేయడంతో వీటిని రద్దు చేస్తూ ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్ ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
బీఆర్‌జీఎఫ్ కింద జిల్లాకు వచ్చే నిధుల్లో 20 శాతం జిల్లా పరిషత్, 30 శాతం మండల పరిషత్, 50 శాతం గ్రామ పంచాయతీల వాటాలుగా కేటాయిస్తారు. ఈ నిధులతో రోడ్లు, మురికి కాల్వలు, భవనాలు, తాగునీటి వనరుల నిర్మాణం, మరమ్మతు పనుల కోసం వినియోగించాల్సి ఉంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ వివాదాలు, స్థల సమస్యలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లిప్తత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, తదితర కారణాల వల్ల చాలా పనులు ప్రారంభానికి నోచుకోలేకపోతున్నాయి. జిల్లా పరిషత్ పరిశీలనలో తేలిన లెక్కల ప్రకారం.. 2010-13 మధ్య కాలంలో రూ.110.80 కోట్ల బీఆర్‌జీఎఫ్ నిధులతో 12,353 పనులు మంజూరయ్యాయి. వీటిలో 7,889 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2,491 పనులు ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదు. 1,973 పనులైతే ఇంకా ప్రారంభమే కాలేదు. ప్రారంభం కాని పనులను రద్దు చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నిధులతో మళ్లీ అదే పనులను చేపడతారా? లేక కొత్త పనులకు ఈ నిధులను కేటాయిస్తారా ? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. పంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి కాబట్టి, పాత పాలకవర్గాలు చేపట్టిన పనులు రద్దు కానున్నాయి. దీంతో ఇపుడున్న పాలకవర్గాలు పనుల ఎంపిక చేసుకునే అవకాశం కలగనుంది. మరోవైపు ఈనెల 27వ తేదీన సిద్దిపేట, 28న మెదక్, 29న సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి బీఆర్‌జీఎఫ్ నిధుల వినియోగంపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.