అవినీతి దారి
అవినీతి దారి
Published Tue, Feb 18 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
ప్రైవేటు వెంచర్‌కు సర్కారీ రహదారి
ఒక్క ఇల్లూ లేకపోయినా సీసీ రోడ్డు
కలెక్టరేట్ పక్కనే అక్రమం రూ.38 లక్షల
అంచనాలతో టెండర్
ప్లాట్ల విలువ పెంచేందుకు‘మాస్టర్ ప్లాన్’
ఇదీ అభివృద్ధి నిధి ప్రత్యే‘కథ’
అదో ప్రైవేటు వెంచర్. ఓ ఎమ్మెల్యే బంధువు, మరో ఎమ్మెల్యే అనుచరులు
ఆ వెంచర్‌లో పార్ట్‌నర్స్. ఆ స్థల యాజమాన్యం హక్కుల విషయంలో లెక్క లేనన్ని వివాదాలు. ఇప్పుడా వెంచర్‌ను సీఎం ప్రత్యేక నిధులతో అభివృద్ధిపరచడానికి రంగం సిద్ధమైంది. రూ.38 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి టెండర్లు సైతం పూర్తి కావడంతో రేపో మాపో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేకాభివృద్ధి నిధి ప్రత్యే‘కథ’పై ‘సాక్షి’ కథనం..
సాక్షి, సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని ఆనుకుని ఎడమ వైపు ఓ ప్రైవేటు వెంచర్ ఉంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరవర్గం రియల్టర్లుగా అవతారమెత్తి ఈ వెంచర్‌ను వేశారు. ప్రజాధనంతో ఆ వెంచర్‌ను అభివృద్ధిపరిచి ప్లాట్ల విలువ పెంచుకోడానికి పక్కా ప్రణాళిక రచించారు. ప్రధాన రహదారి నుంచి వెంచర్‌కు వెళ్లే మార్గంలో 460 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించి సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.38 లక్షలు నిధులు మంజూరు చేయించుకున్నారు. ప్రత్యేకాభివృద్ధి నిధులు కావడంతో ఈ పని కోసం కలెక్టర్ స్మితా సబర్వాల్ నుంచి పరిపాలనపరమైన అనుమతులూ తీసుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం సంగారెడ్డి మునిసిపాలిటీ అధికారులు గత నెలలో ఆన్‌లైన్ టెండర్లు కూడా నిర్వహించారు. ఆ వెంచర్ వేసిన రియల్టర్లే కాంట్రాక్టర్లు కావడంతో త్వరలో పనులు సైతం ప్రారంభం కానున్నాయి.
పక్కా ప్లాన్..
మాస్టర్ ప్లాన్ రోడ్డు కావడంతోనే అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు సంగారెడ్డి మునిసిపల్ ఇంజినీర్లు బుకాయిస్తున్నారు. రోడ్డు కోసం రియలర్టర్లు వదిలేసిన స్థలమేనని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక రోడ్డు నిర్మాణం తలపెట్టిన ప్రాంతంలో ఒక్క ఇల్లూ లేదు. మార్గంలో ఇసుక ట్రాక్టర్లు తప్ప ఇతర వాహనాల రాకపోకలూ ఉండవు. కేవలం వెంచర్‌ను అభివృద్ధి పరిచి ప్లాట్ల ధరలను పెంచుకోడానికే ఈ రోడ్డును నిర్మిస్తున్నారని ఈ విషయాలు చెప్పకనే చెప్పుతున్నాయి. సంగారెడ్డి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు లేని కాలనీలు ఎన్నో ఉన్నాయి. ఈ వెంచర్‌కు అవతలివైపు ‘4వ తరగతి ఉద్యోగుల కాలనీ’ ఉంది. ఆ కాలనీలో 184 ఇళ్లు ఉన్నా రోడ్డు మాత్రం లేదు. ప్రజావసరాల ముసుగులో రియల్టర్లకు లబ్ధి చేకూర్చి పాలకులు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నడానికి ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే.
మాస్టర్ ప్లాన్ రోడ్డు ..
పట్టణ మాస్టర్ ప్లాన్‌లో అక్కడ రోడ్డు ఉండడంతో ఆ మేరకు సీసీ రోడ్డు నిర్మిస్తున్నాం. సాంకేతికంగా అన్నీ విషయాలు పరిశీలించిన తర్వాతే రోడ్డు పనికి టెండర్లు పిలిచాము. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు.
- మునవ్వర్ అలీ, డీఈ,
సంగారెడ్డి మునిసిపాలిటీ
Advertisement