కలెక్టరమ్మ ఇక్కడే
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిత్మా సబర్వాల్‌నే జిల్లా కలెక్టర్‌గా కొనసాగించనున్నారు. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నిక ముగిసేంత వరకు ఆమెను ఇక్కడే కొనసాగించే అవకాశాలున్నాయి.
రాజకీయ వివాదాలకు దూరంగా ఉండటం, సమర్థురాలైన అధికారిగా గుర్తింపు పొందడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొత్త రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియలో భాగంగా సిత్మా సబర్వాల్‌కు బదిలీ తప్పదని అందరూ భావించారు. ‘ఓటరు పండుగ’ కార్యక్రమంలో స్వయంగా కలెక్టరే జూన్ 2 తర్వాత తన బదిలీ ఉంటుందని సన్నిహితులతో చెప్పారు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు ఏ రాష్ట్రంలో పని చేయడానికి ఇష్టపడుతున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
చిన్ననాటి నుంచీ హైదరాబాద్‌తో అనుబంధం ఉన్న సిత్మా సబర్వాల్ తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేయడానికి తొలి ఆప్షన్ ఇచ్చినట్టు సమాచారం, లేదంటే కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కొత్త ప్రభుత్వంలో కీలకమైన జిల్లా కలెక్టర్ల కూర్పుపై కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటెలిజెన్స్, ఇతర ముఖ్యుల ద్వారా సమాచారం తెప్పించుకుని కసరత్తు చేసినట్టు సమాచారం. స్మితా సబర్వాల్ పనితీరు పట్ల కేసీఆర్, హరీష్‌రావు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
2001 బ్యాచ్‌కు చెందిన ఆమె అక్టోబర్‌లో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టారు. సమయ పాలన పాటించని అధికారులపై కొరడా ఝుళిపించారు. బడా పారిశ్రామికవేత్తల నుంచి సీఎస్‌ఆర్ నిధులు వసూలు చేశారు. అన్నిటికీ మించి రాజకీయ వివాదాలకు దూరంగా ఉన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా మూడు ఎన్నికలను సమర్థవంతంగా పూర్తిచేశారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు ఆమెను జిల్లాలోనే కొనసాగించాలని హరీష్‌రావు చేసిన సూచన మేరకు కేసీఆర్ పై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.