సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్) కింద పరిశ్రమల నుంచి కోట్లాది రూపాయలు వసూలు కావాల్సి ఉంది. నిబంధనలపై అధికారులకు అవగాహన లేకపోవడంతో ఏళ్ల తరబడి సీఎస్సార్ పద్దు కింద నిధుల సేకరణ నత్తనడకన సాగుతోంది. సమస్యలను సాకుగా చూపుతూ ‘సామాజిక బాధ్యత’ కింద ఇవ్వాల్సిన నిధిని యజమానులు అరకొరగా విదుల్చుతున్నారు. దీంతో సామాజిక అవసరాల కోసం వినియోగించాల్సిన సొమ్ము కోసం అధికారులు పరిశ్రమల యజమానుల వేటలో పడ్డారు.
జిల్లాలో సుమారు 400 పైగా భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వసూలయ్యే సీఎస్సార్ నిధిని విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, రక్షిత తాగునీటి సరఫరా, బలహీనవర్గాల సంక్షేమం తదితర సామాజిక అవసరాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీఓ) కన్వీనర్‌గా వ్యవహరించే కలెక్టర్ ఆమోదంతో సామాజిక అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సీఎస్సార్ కింద నిధి ఇవ్వడం తప్పనిసరి కాకపోయినా, పరిశ్రమల పెట్టుబడిలో కనీసం 0.2 శాతం యజమానులు జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న విధానం మేరకు పరిశ్రమలు ఆర్జించే లాభాల్లో 0.2 శాతం సీఎస్సార్ పద్దుకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఏళ్ల తరబడి పరిశ్రమల నుంచి సీఎస్సార్ నిధికి డబ్బు సమకూరడం లేదు. గతంలో కలెక్టర్లుగా పనిచేసిన సురేశ్ కుమార్, దినకర్‌బాబు సుమారు మూడు కోట్ల రూపాయలు సీఎస్సార్ ఫండ్‌గా సమకూర్చారు. పరిశ్రమలన్నీ స్పందిస్తే ఈ మొత్తం సుమారు రూ.30 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. కలెక్టర్‌గా స్మితాసబర్వాల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎస్సార్ ఫండ్ సేకరణపై దృష్టి సారించారు. సీపీఓ కన్వీనర్‌గా ఎనిమిది మంది జిల్లా అధికారులతో ప్రస్తుతం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, డీపీఓ, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం.
పరిశ్రమలకు లేఖలు
పరిశ్రమల వారీగా సీఎస్సార్ మొత్తాన్ని లెక్కగట్టి లేఖలు రాసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. బడా పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో సీఎస్సార్ నిధి అందాల్సి ఉండటంతో వాటిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచే సుమారు రూ.70 లక్షలకు పైగా నిధి వసూలు కావాల్సి ఉంది. ప్రత్యేక ఖాతాలో జమ చేయాల్సిన డబ్బును కొన్ని పరిశ్రమలు తామే సొంతంగా ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నాయి. గ్రామాల్లో వైద్య శిబిరాలు, పాఠశాలల్లో యూనిఫారాలు, పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్తున్నాయి. సీఎస్సార్ నిధి ఇవ్వకుండా తప్పించుకునేందుకే పరిశ్రమలు ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీఎస్సార్ నిధిని సొంతంగా ఖర్చు చేసే పరిశ్రమలకు కలెక్టర్ స్మితా సబర్వాల్ కొత్త మెలిక పెట్టారు. ఇకపై సొంతంగా నిధులు వెచ్చించే పరిశ్రమలు కచ్చితంగా కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని లేఖలు రాస్తున్నారు. సీఎస్సార్ ద్వారా సమకూరే నిధిని సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగు పరిచేందుకు వినియోగించాలని కలెక్టర్ యోచిస్తున్నారు. హాస్టళ్లలో మౌలిక సౌకర్యాల కొరతపై ఈ నెల 28లోగా నివేదించాల్సిందిగా ‘సన్నిహిత’ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కాగా సీఎస్సార్ నిధి వసూలుకు ఈ నెల 30వ తేదీ గడువుగా నిర్ణయించారు.