corporate social responsibility
-
రైతు సంక్షేమంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)– ‘పరివర్తన్’లో భాగంగా 2025 నాటికి సంవత్సరానికి రూ. 60,000 కంటే తక్కువ సంపాదించే 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘‘గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం అంటే స్థిరమైన వృద్ధిని పెంపొందించడమే. అలాగే బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి సంబంధించి మా నిరంతర నిబద్ధతను మా కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. 2014లో ప్రారంభమైనప్పటి నుండి, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద సీఎస్ఆర్ కార్యక్రమాలలో పరివర్తన్ ఒకటిగా ఎదిగింది’’ అని బ్యాంక్ డిప్యూటీ. మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ ఎం భారుచా అన్నారు. భారత్‌లోని సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో 2014లో ప్రారంభమైన హెచ్డీఎఫ్సి బ్యాంక్ ‘పరివర్తన్’ తన లక్ష్య సాధనలో పురోగమిస్తోందని ఆయన అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. → గత దశాబ్ద కాలంలో రూ. 5,100 కోట్లకు పైగా సీఎస్ఆర్ వ్యయంతో ‘పరివర్తన్’ కింద స్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, అభివృద్ధిని పెంపొందించడం, జీవన ప్రమాణాలను పెంపొందించడం వంటి లక్ష్యాలను కొంతమేర బ్యాంక్ సాకారం చేసుకుంది. → బ్యాంక్ తన సీఎస్ఆర్ చొరవ కింద దాదాపు 2 లక్షల మందికి స్వయం సమృద్ధిని పెంచడానికి నైపుణ్య శిక్షణను అందించాలని యోచిస్తోంది. → 2 లక్షల ఎకరాలను నీటిపారుదల కిందకు తీసుకువచి్చ, సాగుకు అనువైనదిగా తీర్చి దిద్దడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, 25,000 మంది ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు విద్య అవకాశాలను మెరుగుపరచడం, ఇందుకు స్కాలర్షిప్లు వంటివి అందించడం వంటి కార్యకలాపాలను బ్యాంక్ యోచిస్తోంది. → 17 ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) తొమ్మిదింటిని సాకారం చేయడానికి బ్యాంక్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వీటిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటు వంటివి ఉన్నాయి. → సమాజ ఆర్థిక శ్రేయస్సును ప్రతి బాధ్యతగల బ్యాంకింగ్ కోరుకుంటుంది. ఈ సూత్రానికి తన నిబద్ధతను బ్యాంక్ నిరంతరం ఉద్ఘాటిస్తుంది. దేశ నిర్మాణానికి దోహదపడే కార్యకలాపాలు చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 945.31 కోట్లను తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వెచి్చంచింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 125 కోట్లు అధికం. → కంపెనీల చట్టం 2013 ప్రకారం, సీఎస్ఆర్ నిబంధనలు వర్తించే ప్రతి కంపెనీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు ఆర్థిక సంవత్సరాల్లో సంపాదించిన దాని సగటు నికర లాభాలలో కనీసం 2 శాతం ఖర్చు చేసేలా చూసుకోవాలి. → బ్యాంక్ నికర లాభం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.44,109 కోట్లుకాగా, 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పరిమాణం 38 శాతం పెరిగి రూ.60,812 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దాదాపు రూ. 950 కోట్లు సీఎస్ఆర్ కింద వ్యయం చేయాల్సి ఉంది.గ్రీన్ ఎకానమీ పురోగతికి ప్రాధాన్యం...భారతదేశ జనాభాలో 65 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, గ్రామాలలో ప్రజల శ్రేయస్సు, జీవనోపాధి దేశ సమగ్ర అభివృద్ధికి కీలకమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్ (సీఎస్ఆర్) నుస్రత్ పఠాన్ అన్నారు. బ్యాంక్ తన కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతున్నాయని వెల్లడించారు. 2031–32 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారేందుకు బ్యాంక్ తన వంతు కృషి చేస్తుందని వివరించారు. ఈ చొరవలో భాగంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గ్రీన్ ఇనిíÙయేటివ్లో భాగంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ తన మొట్టమొదటి ఫైనాన్స్ బాండ్ ఇష్యూ ద్వారా 300 మిలియన్ డాలర్లను సేకరించిందని ఆయన చెప్పారు. సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)లు, ఈవీలుసహా గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. -
Busireddy Shankar Reddy: మాది సమష్టి సేవ
ప్రభుత్వం అన్నీ చేస్తుంది... కానీ! చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడుతుంది ప్రభుత్వం. చెప్పుల్లేకపోతే వచ్చే వ్యాధులను అరికట్టేదెవరు? స్కూలు భవనం కడుతుంది ప్రభుత్వం. ప్రహరీలు... టాయిలెట్లను మరచిపోతుంటుంది. హాస్పిటళ్లను కట్టిస్తుంది ప్రభుత్వం. వైద్యపరికరాల్లో వెనుకబడుతుంటుంది. ‘ప్రభుత్వం చేయలేని పనులు చేయడమే మా సేవ’ అంటున్నారు రోటరీ క్లబ్ గవర్నర్ డా.శంకర్‌రెడ్డి. ‘మనది పేద ప్రజలున్న దేశం. ప్రభుత్వాలు ఎంత చేసినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చే వాళ్లందరం సంఘటితమై చేస్తున్న సేవలే మా రోటరీ క్లబ్ సేవలు’ అన్నారు బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. ఒక రైతు తన పొలానికి నీటిని పెట్టుకున్న తర్వాత కాలువను పక్కపొలానికి మళ్లిస్తాడు. అంతే తప్ప నీటిని వృథాగా పోనివ్వడు. అలాగే జీవితంలో స్థిరపడిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడే జీవితానికి సార్థకత అన్నారు. సమాజానికి తమ సంస్థ అందిస్తున్న సేవల గురించి సాక్షితో పంచుకున్నారాయన. ‘కష్టపడడమే విజయానికి దారి’... ఇందులో సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చిన వారిలో సేవాగుణం కూడా ఉంటుంది. నేను 1994లో మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి మా సీనియర్ల సర్వీస్‌ను చూస్తూ మేము ఇంకా వినూత్నంగా ఏమి చేయవచ్చనే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సర్వీస్‌లో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. చదువుకునే పిల్లవాడికి పెన్ను ఇవ్వడం కూడా చాలా సంతృప్తినిస్తుంది. ఆ పెన్ను అందుకునేటప్పుడు పిల్లల కళ్లలో చిన్న మెరుపు, ముఖంలో సంతోషం... ఇవి చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. నేను స్కూళ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కారణం కూడా అదే. మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లలో ఆర్వో ప్లాంట్, కొన్ని స్కూళ్లకు టాయిలెట్లు, హ్యాండ్ వాష్ స్టేషన్లు, తరగతి గదుల నిర్మాణం, క్లాస్‌రూమ్‌లో బెంచీలతో మొదలైన మా సర్వీస్‌లో ఇప్పుడు పిల్లల ఆరోగ్యం ప్రధానంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు ప్రభుత్వం కొంతవరకు సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ అప్పటికప్పుడు తీర్చాల్సిన అవసరాలకు నిధులుండవు. వాటిల్లో ప్రధానమైనది ఆరోగ్యం. వాతావరణం మారిన ప్రతిసారీ పిల్లల మీద దాడి చేయడానికి సీజనల్ అనారోగ్యాలు పొంచి ఉంటాయి. మీరు ఊహించగలరా పాదాలకు సరైన పాదరక్షలు లేకపోవడం వల్ల చలికాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. నులిపురుగుల కారణంగా అనారోగ్యాల పాలవుతారు. హాస్టల్ ఆవరణలో కూడా చెప్పులతో తిరగాలని చెప్పడంతోపాటు మంచి బూట్లు ఇవ్వడం వరకు రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నాం. బూట్లు కూడా మంచి బ్రాండ్‌వే. లోటో కంపెనీ షూస్ మార్కెట్లో కొనాలంటే రెండు వేలవుతాయి. ఆ కంపెనీతో మాట్లాడి వారి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) ప్రోగ్రామ్ కింద మూడు వందల లోపు ధరకే తీసుకున్నాం. మేము సర్వీస్ కోసం చేసే ప్రతి రూపాయి కూడా నేరుగా ఆపన్నులకే అందాలి. కమర్షియల్‌గా వ్యాపారాన్ని పెంపొందించే విధంగా ఉండదు. పిల్లలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించడం వల్ల చాలామంది పిల్లల్లో కంటిచూపు సమస్యలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కంటి సమస్యల కోసం పెద్ద ఎత్తున వైద్యశిబిరాలు నిర్వహించినప్పటికీ పిల్లల మీద దృష్టి పెట్టలేదు. రవి గాంచని చోటును కవి గాంచును అన్నట్లు... ప్రభుత్వం చూపు పడని సమస్యల మీద మేము దృష్టి పెడుతున్నాం. శంకర్ నేత్రాలయ, మ్యాక్సివిజన్, ఆస్టర్ గ్రూప్ వైద్యసంస్థలతో కలిసి పని చేస్తున్నాం. తక్షణ సాయం! ఆరోగ్యం, చదువుతోపాటు ప్రకృతి విలయాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయం కోసం స్థానిక కలెక్టర్ల నుంచి పిలుపు వస్తుంది. అలా ఇల్లు కాలిపోయిన వాళ్లకు పాత్రలు, నిత్యావసర దినుసులు, దుస్తులు, దుప్పట్లు... వంటివి ఇస్తుంటాం. మా సేవలకు స్థిరమైన నిధి అంటూ ఏదీ ఉండదు. సాధారణంగా ఇందులో సభ్యులుగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి సమాజానికి తమ వంతుగా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్లే ఉంటారు. తక్షణ సాయానికి ఆ స్థానిక క్లబ్ సభ్యులు సొంత డబ్బునే ఖర్చుచేస్తారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేపట్టే కార్యక్రమాలకు మాత్రం కచ్చితంగా ప్రాజెక్టు రిపోర్ట్, కొటేసన్ సిద్ధం చేసుకుని నిధుల సమీకరణ మొదలు పెడతాం. ఇందులో మూడింట ఒక వంతు క్లబ్, ఒక వంతు దాత, ఒక వంతు ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఇది సమష్టి సేవ! రోటరీ క్లబ్ ద్వారా అందించే సేవలన్నీ సమష్ఠి సేవలే. ఏ ఒక్కరమూ తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోకూడదు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కలిపి మా పరిధిలో 113 క్లబ్లున్నాయి. ఎక్కడి అవసరాన్ని బట్టి అక్కడి సభ్యులు స్పందిస్తారు. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఇక నా వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే... మాది భద్రాచలం దగ్గర రెడ్డిపాలెం. పూర్వికులు ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సరావు పేట నుంచి భద్రాచలానికి వచ్చారు. సివిల్ కాంట్రాక్టర్‌గా ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్‌కు çసర్వీస్ ఇస్తున్నాను. మా ఊరికి నేను తిరిగి ఇస్తున్నది నీటి వసతి. పేపర్ మిల్లు నుంచి వెలువడే వాడిన నీటిని మా ఊరి పంట పొలాలకు అందించే ఏర్పాటు కొంత వరకు పూర్తయింది. పైప్‌లైన్ పని ఇంకా ఉంది. మేము గోదావరి తీరాన ఉన్నప్పటికీ నది నుంచి మాకు నీళ్లు రావు. గ్రామాల్లో విస్తృతంగా బోర్‌వెల్స్ వేయించాం. బూర్గుంపాడులో నేను చదువుకున్న స్కూల్‌కి ఆర్వో ప్లాంట్ నా డబ్బుతో పెట్టించాను. ‘ఇవ్వడం’లో ఉండే సంతృప్తి మాత్రమే మా చేత ఇన్ని పనులు చేయిస్తోంది. నాకు అరవైదాటాయి. కుటుంబ బాధ్యతలు పూర్తయ్యాయి. మా అమ్మాయి యూఎస్‌లో ఉంది, అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక నేను సర్వీస్ కోసం చేస్తున్న ఖర్చు గురించి నా భార్య అన్నపూర్ణ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలకు నాతోపాటు తను కూడా వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్న అవసరతను అర్థం చేసుకుంది, నన్ను కూడా అర్థం చేసుకుంది. కాబట్టే చేయగలుగుతున్నాను’’ అని వివరించారు రొటేరియన్ డాక్టర్ బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. శ్రీమంతులకు స్వాగతం! జీవితంలో సుసంపన్నత సాధించిన వారిలో చాలా మందికి సొంత ఊరికి ఏదైనా చేయాలని ఉంటుంది. తాము చదువుకున్న స్కూల్‌ను అభివృద్ధి చేయాలని ఉంటుంది. అలాంటి శ్రీమంతులకు నేనిచ్చే సలహా ఒక్కటే. మా సర్వీస్ విధానంలో ‘హ్యాపీ స్కూల్’ కాన్సెప్ట్ ఉంది. ఒక పాఠశాలను హ్యాపీ స్కూల్‌గా గుర్తించాలంటే... కాంపౌండ్ వాల్, పాఠశాల భవనం, డిజిటల్ క్లాస్ రూములు, నీటి వసతి, టాయిలెట్లు ఉండాలి. అలా తీర్చిదిద్దడానికి 90 లక్షలు ఖర్చవుతుందనుకుంటే ముప్ఫై లక్షలతో ఒక దాత వస్తే, మా రోటరీ క్లట్, అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్ నిధులతో పూర్తి చేయవచ్చు. గతంలో ఏపీలో కూడా మేము చాలా పాఠశాలలను దత్తత తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోంది. అక్కడ మా అవసరం లేదు, మాకు సర్వీస్ చేసే అవకాశమూ లేదు. తెలంగాణలో గడచిన ప్రభుత్వం పాఠశాలల మీద దృష్టి పెట్టకపోవడంతో మేము చేయగలిగినంత చేస్తూ వస్తున్నాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హైదరాబాద్ నగరం, మెట్రో రైల్వే స్టేషన్లలో 65 వాటర్ కూలర్లనిచ్చాం. నీలోఫర్, ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్‌కి వైద్యపరికరాలు, స్పర్శ్ పేరుతో క్యాన్సర్ బాధితులకు పాలియేటివ్ కేర్, కొన్ని హాస్పిటళ్లకు అంబులెన్స్‌లు ఇచ్చింది రోటరీ క్లబ్. ఇక ఆలయాల్లో పూజలకు అన్ని ఏర్పాట్లూ ఉంటాయి, కానీ భక్తులకు సౌకర్యాలు పెద్దగా ఉండవు. మా భద్రాచలం, పర్ణశాలలో టాయిలెట్లు, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి గదుల నిర్మాణం... ఇలా మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. – వాకా మంజులా రెడ్డి ఫొటో: గడిగె బాలస్వామి -
Shombi Sharp: ప్రపంచానికి భారత్ అవసరం
న్యూఢిల్లీ: సామాజిక అంశాలపై పెట్టుబడుల పరంగా భారత్ కంపెనీలు ముందున్నందున ప్రపంచానికి భారత్ అవసరం ఎంతో ఉందని ఐక్యరాజ్యసమితి భారత రెసిడెంట్ కోర్డినేటర్ శొంబిషార్ప్ పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో వ్యాపారాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఢిల్లీలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)పై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శొంబి మాట్లాడారు. భారత ప్రయాణంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత అనివార్యమంటూ.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలలో వ్యాపారాలు ముందున్నట్టు చెప్పారు. సీఎస్ఆర్ విషయంలో, భారత్ ప్రపంచాన్ని నడిపిస్తున్నట్టు తెలిపారు. ‘‘ప్రపంచంలో సగానికి సగం దేశాలు విద్య, ఆరోగ్యం కంటే తమ అప్పులు తీర్చడానికే ఎక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటోంది. ఇటీవలి జీ20 సదస్సు సందర్భంగా భారత్ నాయకత్వ పాత్ర పోషించింది’’అని శొంబి పేర్కొన్నారు. కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం లాభాల్లోని కంపెనీలు క్రితం మూడేళ్ల కాలంలోని సగటు లాభాల నుంచి 2 శాతాన్ని సామాజిక కార్యక్రమాల కోసం (సీఎస్ఆర్) వ్యయం చేయాల్సి ఉంటుంది. -
సీఎస్ఆర్ నిబంధనలకు సవరణ.. నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోతే
న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ఖాతాల్లో ఖర్చు చేయకుండా నిధులు మిగిలిపోతే వాటి వినియోగానికి సంబంధించి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు నిబంధనలను సవరించింది. సాధారణంగా నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు తాము సీఎస్ఆర్ కింద చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తి కాని సందర్భంలో, దానికి కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోతే ఆ మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తాజా సవరణ ప్రకారం ఆయా నిధులు సదరు ఖాతాల్లో ఉన్నంత వరకూ వాటి పర్యవేక్షణ కోసం కంపెనీలు సీఎస్ఆర్ కమిటీని ఏర్పాటు చేయాలి. అలాగే బోర్డు నివేదికలో పొందుపర్చాల్సిన సీఎస్ఆర్ కార్యకలాపాల వార్షిక రిపోర్టు ఫార్మాట్‌నూ ప్రభుత్వం సవరించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
బాధ్యత అనుకుంటేనే ఫలం, ఫలితం!
మన ఎదుగుదలకు ఇంత ఇచ్చిన సమాజానికి తిరిగి మనమేమి ఇస్తున్నాం? అన్న దృక్పథం నుంచి పుట్టిన సంస్థాగత కర్తవ్యమే కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సీఎస్సార్). అలాంటి వ్యక్తిగత భావన మనిషి ఉత్కృష్ట ఆలోచన, ఉదారత నుంచి పుట్టే వితరణ. కానీ, కార్పొరేట్లకు ఇది వితరణశీలత మాత్రమే కాదు... సమాజంపట్ల వారి బాధ్యత! కానీ జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైన 1,627 కంపెనీలు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించలేదు. కంపెనీల సీఎస్సార్ వ్యయానికి సంబంధించిన నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని పార్లమెంటు ఆర్థిక స్థాయీసంఘం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. చిత్తశుద్ధితో స్వయంగా పాల్గొనడం ద్వారా సమాజాభివృద్ధిలో కార్పొరేట్లు భాగం కావడమే నిజంగా కావాల్సింది! కార్పొరేట్ల సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ–సీఎస్సార్) ఒట్టి నినాదం కాకుండా దేశంలో దీన్ని చట్టబద్ధం చేసి నేటికి సరిగ్గా ఎనిమిదేళ్లు! కంపెనీ చట్టం సెక్షన్ 135 ప్రకారం నిర్దిష్ట పెట్టుబడి, లావాదేవీలు, లాభం కలిగిన దేశంలోని కంపెనీలన్నీ వాటి వార్షిక నికర లాభంలో 2 శాతం నిధుల్ని ఏటా సీఎస్సార్ కింద కచ్చితంగా వ్యయం చేయాలి. రూ. 500 కోట్ల నికర విలువ కలిగిన, లేదా ఏటా రూ. 1,000 కోట్ల లావాదేవీలు జరిపిన, లేదా ఏటా రూ. 5 కోట్ల లాభాలార్జించిన కంపెనీలన్నీ ఈ నిబంధన పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్లు ఉమ్మడిగా పనిచేస్తే సమ్మిళిత ప్రగతికి ఆస్కారం ఉంటుందన్న నమ్మకమే దీనికి పునాది. 2014 ఏప్రిల్ 1 నుంచి ఆచరణలోకి వచ్చిన ఈ విధానంతో... నిజంగా సాధించిందేమిటని వెనక్కి చూసుకుంటే, గొప్ప ఆశావహ వాతావరణమేమీ కనిపించదు. ఇందుకు కారణాలనేకం! దీన్నొక తంతుగా కొంత డబ్బు వెచ్చించి చేతులు దులుపుకొంటున్నాయి తప్ప సమాజ హితంలో ఏ మేర పాత్ర వహిస్తున్నామన్న సోయితో చేయ ట్లేదు. కొన్ని కార్పొరేట్లయితే వ్యయమే చేయట్లేదు. ఇంకొన్ని తమ వ్యాపార వృద్ధికే తప్ప సమాజం కోసం వ్యయం చేయట్లేదు. మరికొన్ని ఈ నిధుల వ్యయం కోసం సొంతంగా ట్రస్టులు, ఫౌండేషన్లు స్థాపించి మొక్కు బడిగా నిర్వహిస్తున్నాయి. ఇంకొందరైతే బోగస్ సంస్థలతో చేతులు కలిపి లెక్కలు మాత్రమే చూపించి, ఇరువురూ సీఎస్సార్ నిధుల్ని నొక్కేస్తున్నారు. అలా అని, సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న కార్పొరేట్లు అసలు లేవని కాదు, కానీ, వాటి సంఖ్య పరిమితం! నివేదిక కోరిన స్థాయీ సంఘం వివిధ విభాగాల్లోని పదేసి అగ్ర కంపెనీల సీఎస్సార్ వ్యయానికి సంబంధించిన సమగ్ర నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని పార్లమెంటు ఆర్థిక స్థాయీసంఘం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఇటీవలే ఆదేశించింది. నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ, ఎంతేసి వ్యయం చేశారో చూపాలని పేర్కొంది. అభివృద్ధి చెందిన చోటనే తూతూ మంత్రంగా వెచ్చించడం కాకుండా, నిజంగా అవసరం ఉన్న వెనుకబడిన ప్రాంతాల్లో ప్రగతి సమతూకం సాధించాలన్నది ఇందుకు ఉద్దేశించిన లక్ష్యాల్లో ఒకటి! సీఎస్సార్ వ్యయంపై ఆయా కంపెనీలిచ్చే నివేదికల్లో సమాచారం అసమగ్రంగా ఉందనీ, వాటిపై నిఘా, నియంత్రణ వ్యవస్థ కూడా సరిగా లేదనీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. మైనింగ్, రియల్ ఎస్టేట్, నిర్మాణ తదితర కీలక రంగాల్లో సీఎస్సార్ వ్యయాలు స్థానికంగా జరపటం లేదనే విష యాన్ని సంఘం గుర్తించింది. కార్పొరేట్ రంగంలో జరిగే తీవ్రమైన మోసాల దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) నిర్వహణ సరిగా లేదనీ తప్పుబట్టింది. అసాధారణంగా 60 శాతం పోస్టులు ఖాళీగా ఉండి, దర్యాప్తులు జాప్యమవటం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపు తోందని పేర్కొంది. సత్వరం సరిదిద్దాలని నిర్దేశించింది. గత ఏడేళ్లలో లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు సీఎస్సార్ కింద వ్యయమైనట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ నిరుడు పార్లమెంటుకు తెలిపారు. నిజానికిది నామ మాత్రమే! సగానికి మించి విఫలమే! సీఎస్సార్ నిధుల వ్యయం ద్వారా... విద్య, వైద్యం మెరుగు, ఆకలి, లింగ వివక్ష, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, గ్రామీణా భివృద్ధి, క్రీడాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, బలహీన వర్గాల సంక్షేమం– నైపుణ్యాల శిక్షణ వంటి పది లక్ష్యాల్ని నిర్దేశించారు. ఆయా అంశాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నిధుల్ని వ్యయం చేయవచ్చు. తగు ప్రాజెక్టుల్ని రూపొందించి, సొంతంగా ఏర్పరచుకున్న విభాగాల ద్వారానో, విశ్వసనీయత కలిగిన మూడో పక్ష ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతోనో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కానీ, దేశంలో వంద అతి పెద్ద కార్పొరేట్లలో 52 నిర్దేశించిన సీఎస్సార్ నిధుల్ని వ్యయం చేయలేదని ప్రపంచ స్థాయి అంచనాలు, అధ్యయన సంస్థ కేపీఎమ్‌జీ తాజా (2019) నివేదిక చెబుతోంది. ఒక్క 2017–18 లోనే పదివేల కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేయాల్సి ఉండిం దని ‘ప్రైమ్ డాటా గ్రూప్ అనాలిసిస్’ నివేదిక పేర్కొంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైన 1,627 కంపెనీలు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించలేదు. సరైన ప్రాజెక్టులు గుర్తించలేదనో, భాగస్వామ్యానికి విశ్వసనీయ సంస్థలు దొరకలేదనో చెప్పడం కూడా ఓ కుంటి సాకే! ఎందుకంటే, చట్టం అమల్లోకి వచ్చి 8 ఏళ్లవుతోంది. ఈ పనుల నిర్వహణకు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంస్థలు, ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టరై ఉన్నాయి. సీఎస్సార్ కార్యకలాపాలు, నిధుల వ్యయానికి సంబంధించి వివరాల వెల్లడిలో మరింత పార దర్శకత కోసం నిబంధనల్లో ప్రభుత్వం ఇటీవల కొన్ని సవరణలు తెచ్చింది. (క్లిక్: పర్యావరణాన్నే పణంగా పెడదామా?) ఒక సంవత్సరం నిర్దేశించిన మొత్తం నిధుల్ని వ్యయం చేయ కుంటే, తర్వాతి సంవత్సరాలకు బదలాయించడం కాకుండా, కేంద్రం ఇదే అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఒక నిధికి మళ్లించే వ్యవస్థను కూడా కల్పించింది. సీఎస్సార్– ఫారమ్ 2 ద్వారా చాలా వివరాలను కంపెనీలు/కార్పొరేట్లు పారదర్శకంగా వెల్లడించాల్సి ఉంటుంది. మంత్రిత్వ శాఖకు, బోర్డుకు, సభ్యులకిచ్చే వార్షిక నివేదికల్లో విధిగా ఇది ఉండాలి. తాము సీఎస్సార్ కింద నిర్వహించిన కార్యక్రమ సామాజిక ప్రభావాల అంచనా నివేదిక కూడా ఇందులో భాగం. మన కార్పొరేట్లు మారాలి! సీఎస్సార్ విషయంలో ప్రపంచ కంపెనీల దృక్పథంలో వచ్చిన మార్పు భారతీయ కార్పొరేట్లలో రావటం లేదు. ‘వాతావరణ సంక్షోభం’ వంటి విపత్కర పరిస్థితుల్లో గ్లోబల్ కార్పొరేట్ల మౌలిక ఆలోచనలే మారుతున్నాయి. సామాజిక బాధ్యతను తదేక దృష్టితో ఆచరిస్తున్నాయి. ‘ఎల్పీజీ’ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) తర్వాత కంపెనీల్లో ప్రజాపెట్టుబడులు పెరిగాయి. పెట్టుబడుల భాగస్వాములుగా, ఉత్పత్తులు, సేవల వినియోగదారులుగా సాధారణ ప్రజానీకం ఆశలు, ఆకాంక్షల్ని కూడా కార్పొరేట్లు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. తమ నడతను మార్చుకుంటున్నాయి. వస్తు సేవల నాణ్యత, ధర మాత్రమే కాకుండా కంపెనీ నడత, నిర్వహించే సామాజిక బాధ్యతను కూడా పౌరసమాజం లెక్కలోకి తీసుకుంటుందనే గ్రహింపు వారిలో ఈ పరివర్తనకు కారణం. 2015–16లో భారత్‌లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, వస్తు సేవల నాణ్యత మాత్రమే కాకుండా పర్యావరణ, సామాజిక అంశాల్లో ఆయా కంపెనీలు, కార్పొ రేట్ల క్రియాశీలత, బాధ్యత, జవాబుదారీతనాన్నీ వినియోగదారులు పరిగణనలోకి తీసుకొని అటు మొగ్గినట్టు తేలింది. కార్పొరేట్ల నైతికత, సామాజిక స్పృహ కూడా వారి వ్యాపారాభివృద్ధిని ప్రభావితం చేసే అంశమే! ఈ గ్రహింపు వల్లే టాటా గ్రూప్ వంటి కొన్ని పెద్ద సంస్థల సీఎస్సార్ నిర్వహణ ఎంతో పద్ధతిగా ఉంటుంది. కొన్ని సంస్థలైతే తప్పుడు పద్ధతులు అనుసరించడం, స్టాక్ ఎక్స్ఛేంజీలకు తప్పుడు సమాచారం ఇవ్వడం, సీబీఐ, ముంబై పోలీస్ వంటి విభాగాలు కేసులు నమోదు చేసే పరిస్థితుల్ని ఎదుర్కోవడం వరకూ వెళ్లాయి. (క్లిక్: మనమే రాస్తున్న మరణ శాసనం) పబ్లిక్ రంగ సంస్థల్లోనూ సీఎస్సార్ నిధులు దుర్వినియోగం అవు తున్నాయి. మంత్రుల ప్రత్యేక విమాన ప్రయాణాలకు, అధికారుల విలాసాలకు దుబారా చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల సంక్షేమానికి వాడి లెక్కలు చూపుతున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే, కేవలం నిధులిచ్చి పేరు తెచ్చుకోవడం అన్న భావన కన్నా అతీతమైంది. స్వయంగా పాల్గొనడం ద్వారా సమాజాభివృద్ధిలో కార్పొరేట్లు భాగం కావడం! కంపెనీలు, కార్పొరేట్లు చిత్తశుద్ధితో ‘అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి’ అనే విశాల దృక్పథంతో ఉంటేనే... సీఎస్సార్కి ఓ అర్థం, పరమార్థం! - దిలీప్ రెడ్డి సీనియర్ పాత్రికేయులు -
సీఎస్ఆర్ విషయంలో కంపెనీలకు స్వేచ్ఛ!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం విషయంలో కంపెనీలకు మరింత వెసులుబాటు కల్పిస్తూ కంపెనీల చట్టంలోని నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. సీఎస్ఆర్ కింద ఒకటికి మించి ఎక్కువ సంవత్సరాల పాటు పట్టే ప్రాజెక్టులను చేపట్టేందుకు అనుమతించింది. అదే విధంగా నిబంధనలకు మించి చేసిన అదనపు ఖర్చును తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో చూపించుకుని సర్దుబాటు చేసుకునే అవకాశం ఇచ్చింది. అదే విధంగా సీఎస్ఆర్ కింద లబ్ధిదారులు లేదా ప్రభుత్వం పేరిట మూలధన ఆస్తుల (క్యాపిటల్) కొనుగోలుకూ అనుమతించింది. కంపెనీల తరఫున సీఎస్ఆర్ కార్యక్రమాల అమలును చూసే ఏజెన్సీలకు 2021 ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ (నమోదును)ను తప్పనిసరి చేసింది. సీఎస్ఆర్ నిబంధనలను పాటించకపోవడాన్ని నేరపూరితం కాని చర్యగా మారుస్తూ.. దీని స్థానంలో పెనాల్టీని ప్రవేశపెట్టింది. ఒకవేళ సీఎస్ఆర్ కింద ఒక కంపెనీ చేయాల్సిన ఖర్చు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50లక్షల్లోపు ఉన్నట్టయితే సీఎస్ఆర్ కమిటీ ఏర్పాటు నుంచి మినహాయింపునిచ్చింది. వ్యాపార సులభ నిర్వహణ విషయంలో భారత్ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు.. నిబంధనలను పాటించకపోవడాన్ని నేరంగా చూడకపోవడం, సీఎస్ఆర్ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యాలతో తాజా సవరణలు చేపట్టినట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీల చట్టం 2013 కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖా సీఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లాభదాయక కంపెనీలు గడిచిన మూడేళ్ల కాల సగటు లాభంలో కనీసం 2% సీఎస్ఆర్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సంస్థలకు అనుమతి.. సీఎస్ఆర్ కార్యక్రమాలు లేదా ప్రాజెక్టుల రూపకల్పన, పర్యవేక్షణ, విశ్లేషణ పనులను చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతించడం కూడా కేంద్రం తీసుకువచ్చిన మార్పుల్లో భాగంగా ఉంది. కాకపోతే సీఎస్ఆర్ కార్యక్రమాలు లేదా ప్రాజెక్టుల అమలు బాధ్యతలను చూడ్డానికి వీల్లేదని స్పష్టం చేసింది. విదేశీ సంస్థలను అనుమతించడం వల్ల సీఎస్ఆర్ విభాగంలో అంతర్జాతీయంగా అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాలు, విధానాలను తీసుకొచ్చేందుకు వీలు పడుతుందని కార్పొరేట్ శాఖా తెలిపింది. 2014 ఏప్రిల్ 1 నుంచి సీఎస్ఆర్ నిబంధనలు అమల్లోకి రాగా.. 2014–15లో రూ.10,066 కోట్లను కంపెనీలు ఖర్చు చేశాయి. ఇది 2018–19లో రూ.18,655 కోట్లకు విస్తరించింది. ఐదేళ్లలో రూ.79,000 కోట్లను కంపెనీలు వెచ్చించాయి. -
మౌలిక వసతులు.. కార్పొరేట్ సొబగులు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని మార్గాల్లో నిధులు సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రైవేట్ కంపెనీలు – కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్)లో భాగంగా సామాజిక మౌలిక వసతుల కల్పనకు నిధులను సులభతరంగా సమకూర్చేందుకు వీలుగా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది. ‘మీ గ్రామాలకు ఏటా ఒకట్రెండుసార్లయినా రండి. మీ ఊళ్లోని పాఠశాల, ఆసుపత్రి అభివృద్ధికి సహకరించండి. మీ ద్వారా జరిగిన పనికి మీ పేర్లే పెడతాం’ అని సీఎం వైఎస్ జగన్ ఇటీవల అమెరికా పర్యటనలో ప్రవాసాంధ్రులకు పిలుపునిచి్చన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వచ్చే నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రత్యేక విధానం కార్యరూపం దాలుస్తోంది. సీఎస్సార్ కింద సమకూర్చిన నిధులను ఖర్చు చేసే తీరు, మౌలిక ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తున్నారు. దాతలు ఇచ్చే నిధులను నవరత్నాలకు ఉపయోగించడంతో పాటు.. ఆయా కంపెనీలు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ కొత్త విధానం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రైవేట్ కంపెనీలు, దాతలే మొత్తం ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం ఉండదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య తదితర సామాజిక మౌలిక వసతులు ఎక్కడెక్కడ కొరత ఉన్నాయో ప్రభుత్వమే గుర్తించనుంది. ప్రభుత్వం ప్రాధాన్యతగా గుర్తించిన పనుల నుంచి ఏ పనులను చేపట్టాలో ప్రైవేట్ కంపెనీలు, దాతలే నిర్ణయించుకుని అవసరమైన నిధులను అందజేయవచ్చు. ప్రాధాన్యతల మేరకు ప్రభుత్వం గుర్తించిన పనులు – పాఠశాలల్లో తరగతి నిర్మాణం (వ్యయం సుమారు రూ.10 లక్షలు) – తరగతి గదిలో అవసరమైన ఫర్నిచర్‌ను సమకూర్చడం (వ్యయం సుమారు రూ.లక్ష) – పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగ్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణం (వ్యయం సుమారు రూ.1.5 లక్షలు) – ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో లేబర్ రూమ్ నిర్మాణం – ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ థియేటర్ నిర్మాణం – కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో పనిచేసే ఎక్స్‌రే మిషన్ – కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో అప్పుడే పుట్టిన పిల్లల కోసం స్టెబిలైజేషన్ యూనిట్ ఏర్పాటు – కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కోసం క్వార్టర్స్ నిర్మాణం – అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్స్ గదుల నిర్మాణం అంతటా పారదర్శకం మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్ కంపెనీలు లేదా దాతలు పూర్తి పారదర్శకంగా వెబ్ బేస్డ్ సింగిల్ ప్లాట్ ఫాంలో పనులు చేపట్టవచ్చు. వ్యక్తిగత స్థాయిలో కూడా దాతలు ఈ ప్రాజెక్టులను చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీలు, దాతలు చేపట్టే పనులు వెబ్సైట్ డ్యాష్ బోర్డులో కనిపిస్తాయి. ప్రాజెక్టుల పనుల పురోగతిని కూడా చూడవచ్చు. నిధుల వినియోగం ఏ విధంగా జరుగుతుందో దాతలు తెలుసుకునేందుకు, వారిలో విశ్వాసం కలిగించేందుకు 13 జిల్లాల కలెక్టర్లు 13 ఎస్క్రో అకౌంట్లను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా నిధులు ఏ మేరకే వినియోగించారు.. ఇంకా ఎన్ని నిధులు మిగిలాయన్నది తెలుసుకోవచ్చు. పనులు జరిగే తీరును జిల్లా కలెక్టర్లు సమన్వయం చేస్తారు. ఈ పనుల కోసం ప్రత్యేకంగా నిష్ణాతులతో కూడిన విభాగాన్ని ప్రణాళికా శాఖలో ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాల బ్రాండ్‌ను ఈ విభాగం మార్కెట్ చేస్తుంది. దాతలు ఇచ్చిన విరాళాలు సద్వినియోగమయ్యేలా ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. అన్ని విధాలా దాతలకు సహకారం అందిస్తుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రైవేట్ కంపెనీలు లేదా దాతలు చేపట్టిన పనులు పూర్తయ్యాక ప్రభుత్వానికి బదిలీ చేస్తారు. ఆ పనులకు ఆయా కంపెనీలు లేదా దాతల పేర్లను పెడతారు. అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వమే స్వీకరిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. వెబ్ బేస్ట్ ప్రాసెస్ ఇలా.. – ప్రభుత్వమే సామాజిక మౌలిక వసతులను గుర్తించి భౌగోళిక, రంగాల వారీగా ప్రాజెక్టులను డ్యాష్ బోర్డులో డిస్ప్లే చేస్తుంది. – డిస్ప్లే అయిన ప్రాజెక్టుల నుంచి ప్రైవేట్ కంపెనీలు, దాతలు ఏదో ప్రాజెక్టును ఎంపిక చేసుకుని విరాళాలు ఇవ్వొచ్చు. – ఆ విరాళాలు ఎస్క్రో అకౌంట్లకు వెళ్తాయి. పనులు సంబంధిత శాఖకు వెళ్తాయి. – జిల్లా కలెక్టర్ ఆ పనుల పురోగతిని నెల/మూడు నెలలకోసారి సమీక్షిస్తూ అవసరమైన నిధులను విడుదల చేస్తారు. పనుల పురోగతి ఫొటోలను వెబ్సైట్లో ఉంచుతారు. – పనులు పూర్తి కాగానే జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ వెంటనే అవి పూర్తయిన పనుల ప్రాజెక్టుల జాబితాలోకి వెళ్తాయి. ఈ కంపెనీలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత.. – 2013 కంపెనీల చట్టం సెక్షన్ 135 కింద ఉన్న కంపెనీలు – రూ.500 కోట్లు లేదా ఆ పై విలువగల కంపెనీలు – రూ.1000 కోట్లు లేదా ఆపై టర్నోవర్ ఉన్న కంపెనీలు – ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లు ఆ పైన నికర లాభం కలిగిన కంపెనీలు ఈ కంపెనీలు లాభాల్లో కనీసం రెండు శాతం మేర నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యతకు వెచ్చించాలి. ప్రధానంగా పేదరిక నిర్మూలన, విద్యను ప్రోత్సహించడం, లింగ సమానత్వం, మహిళా సాధికారిత, మాతా శిశు మరణాలు తగ్గించడం, హెచ్ఐవీ.. ఏయిడ్స్ నిర్మూలన, మలేరియా, పర్యావరణ పరిరక్షణ, వృత్తి విద్యా శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాల పెంపు, సామాజిక ప్రాజెక్టులు, సామాజిక ఆర్థికాభివృద్ధి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల అభివృద్ధికి నిధులు వెచ్చించాలి . -
‘విస్తరిస్తున్న’ కార్పొరేట్ల సేవ
న్యూఢిల్లీ: ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించిన మాదిరిగానే భారత కార్పొరేట్లు తమ సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విస్తరిస్తున్నారు. దీంతో సామాజిక సేవ, అభివృద్ధి కార్యక్రమాల కోసం వీరు వెచ్చిస్తున్న మొత్తం గణనీయంగా పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2017–18)లో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమం కోసం చేసిన నిధుల వ్యయం 11% మేర పెరిగింది. రూ.10,030 కోట్లను ఇందుకు ఖర్చు చేయడం విశేషం. ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన 1,795 కంపెనీల్లో 1,080 కంపెనీల నిధుల వ్యయం ఆధారంగా ప్రైమ్ డేటాబేస్ గ్రూపు ఈ వివరాలను వెల్లడించింది. ఎన్ఎస్ఈ లిస్డెడ్ కంపెనీల సీఎస్ఆర్ నిధుల వ్యయం వార్షికంగా 16 శాతం చొప్పున గత మూడు సంవత్సరాల్లో వృద్ధి చెందినట్టు ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా తెలిపారు. పెరిగిన భాగస్వామ్యం సీఎస్ఆర్ చట్టం 2014 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. రూ.500 కోట్లకు పైగా నికర విలువ కలిగిన కంపెనీలు లేదా రూ.1,000 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీలు లేదా రూ.5 కోట్ల నికర లాభం ఆర్జిస్తున్నవి తమ లాభాల్లో 2 శాతాన్ని (క్రితం మూడు సంవత్సరాల్లో సగటు లాభంపై) సీఎస్ఆర్ కోసం ఖర్చు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. 2017–18లో కంపెనీలు రూ.10,885 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయాలనుకున్నాయి. చట్టప్రకారం చూస్తే వాస్తవంగా ఖర్చు చేయాల్సిన దానికంటే ఇది రూ.200 కోట్లు ఎక్కువ. అయితే, ఇందులో రూ.1,717 కోట్లు ఖర్చు చేయకుండా ఉండిపోయాయి. అయితే, అంతిమంగా సీఎస్ఆర్ కింద చేసిన వ్యయం రూ.10,030 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2016–17లో ఈ కార్యక్రమం కింద కార్పొరేట్ల నిధుల వ్యయాల మొత్తం రూ.9,060 కోట్లు. సీఎస్ఆర్ కింద నిధులు ఖర్చు చేసిన కంపెనీల సంఖ్య 2016–17లో 931గా ఉంటే (మొత్తం కంపెనీల్లో 92%), 2017–18లో వీటి సంఖ్య 1016కు (94%) పెరిగింది. అగ్రస్థాయి కంపెనీల వాటా అగ్రస్థాయి పది కంపెనీలు పెట్టిన ఖర్చే మొత్తం సీఎస్ఆర్ నిధుల వ్యయాల్లో 36.06 శాతంగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐవోసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, విప్రో అగ్ర స్థాయి పది కంపెనీలుగా ఉన్నాయి. మొత్తం మీద 59 శాతం కంపెనీలు నిధుల వ్యయాలను పెంచాయి. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన స్వచ్ఛ భారత్, క్లీన్ గంగా కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు 10%, 47% చొప్పున తగ్గిపోయాయి. స్వచ్ఛభారత్‌కు 2016–17లో కార్పొరేట్ కంపెనీల వినియోగం రూ.581 కోట్లుగా ఉంటే, 2017–18లో రూ.521 కోట్లకు పరిమితమైంది. క్లీన్ గంగాకు కేటాయింపులు 2016–17లో ఉన్న రూ.151 కోట్ల నుంచి 2017–18లో రూ.80 కోట్లు తగ్గిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపించిన 2015–16లో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి నిధుల కేటాయింపులు రూ.1,009 కోట్ల మేర ఉన్నాయి. ఇతర కార్యక్రమాలకూ చేయూత కంపెనీల చట్టం 11 భిన్న షెడ్యూళ్లలో నిధుల వ్యయాలను తప్పనిసరి చేసింది. వీటికి అదనంగా కొన్ని కంపెనీలు అయితే సామాజికాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఖర్చు చేస్తుండటం అభినందించే విషయమే. 2017–18లో విద్యా సంబంధిత కార్యక్రమాలకు 38 శాతం నిధులు అందగా, హెల్త్‌కేర్‌కు 25 శాతం, అసమానతల నిరోధానికి 2 శాతం, జాతీయ వారసత్వ సంపదకు 4 శాతం, సాయుధ బలగాలకు 1 శాతం, క్రీడలు 2 శాతం నిధులు అందుకున్నాయి. -
జాతీయవాద పారిశ్రామికవేత్త
మన దిగ్గజాలు భారత పారిశ్రామిక రంగం మూల పురుషుల్లో ముఖ్యుడు ఆయన. మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితుడు. స్వాతంత్య్రోద్యమానికి అండగా నిలిచిన జాతీయవాది. పూర్తిగా స్వదేశీ పెట్టుబడితోనే బ్యాంకును స్థాపించిన దార్శనికుడు ఘనశ్యామ్ బిర్లా. టాటాలకు పోటీగా నిలిచిన బిర్లాల పారిశ్రామిక సామ్రాజ్యానికి మూల పురుషుడు ఆయన. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ ప్రవచనాలేవీ వినిపించని రోజుల్లోనే సేవా కార్యక్రమాల కోసం విరివిగా ఖర్చు చేసిన వదాన్యుడు ఆయన. మూలాలు రాజస్థాన్‌లో... స్వాతంత్య్రానికి ముందే అపర కుబేరులుగా ఎదిగిన వారిలో టాటాలతో పాటు బిర్లాలు కూడా ఉన్నారు. బిర్లాల పారిశ్రామిక సామ్రాజ్యానికి వ్యవస్థాపకుడు ఘనశ్యామ్‌దాస్ బిర్లా. ఆయన పూర్వీకులు రాజస్థాన్‌లోని పిలానీ ప్రాంతానికి చెందినవారు. ఘనశ్యామ్ తాత శివనారాయణ బిర్లా స్వస్థలంలో మిగిలిన మార్వాడీల్లాగానే వడ్డీవ్యాపారం చేసుకునే వారు. వ్యాపారాన్ని విస్తరించాలనే ఉద్దేశంలో 1850లలో బాంబేకు తరలి వచ్చారు. ఘనశ్యామ్ తండ్రి బలదేవ్దాస్ హయాంలో బిర్లా కుటుంబం 1861లో అప్పట్లో దేశ రాజధానిగా ఉన్న కలకత్తాకు వలస వచ్చింది. బలదేవ్దాస్కు నలుగురు కొడుకులు. పెద్దకొడుకు జుగల్‌కిశోర్ చిన్న వయసులోనే తండ్రికి చేదోడుగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక రెండో కొడుకైన ఘనశ్యామ్‌దాస్ బిర్లా కూడా వ్యాపారంలో చేరారు. వెండి, సుగంధ ద్రవ్యాలు సహా పలు వ్యాపారాలు చేసేవారు. వ్యాపారాలు లాభసాటిగా సాగడంతో బిర్లా కుటుంబం కలకత్తాలోని సంపన్న కుటుంబాల్లో ఒకటిగా ఎదిగింది. అంచెలంచెల ఎదుగుదల మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలో వస్తువులకు విపరీతంగా కొరత ఏర్పడింది. అప్పటికే వస్తూత్పత్తి రంగంలోకి దిగిన బిర్లాలకు ఈ పరిస్థితి చక్కగా అనుకూలించింది. వస్తూత్పత్తి రంగంలో తమ ఉనికిని విస్తరించుకునేందుకు సోదరులతో కలసి ఘనశ్యామ్‌దాస్ బిర్లా 1919లో బిర్లా బ్రదర్స్ లిమిటెడ్ సంస్థను రూ.50 లక్షలతో ప్రారంభించారు. అప్పట్లో ఆ మొత్తం చాలా భారీ పెట్టుబడి. అదే ఏడాది గ్వాలియర్ కేంద్రంగా ఒక దుస్తుల మిల్లును ప్రారంభించారు. కలకత్తాలో జ్యూట్ మిల్లును నెలకొల్పారు. ఘనశ్యామ్‌దాస్ బిర్లా ఒకవైపు వ్యాపారాలు సాగిస్తూనే, మరోవైపు జాతీయవాద రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. మహాత్మాగాంధీతో సన్నిహిత సంబంధాలు నెరపేవారు. గాంధీ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ఆయన బిర్లా భవన్‌లోనే బస చేసేవారు. బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 1926లో ఎన్నికయ్యారు. మహాత్మాగాంధీ 1932లో స్థాపించిన హరిజన సేవక సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారు. 1940లలో హిందుస్థాన్ మోటార్స్‌ను స్థాపించారు. స్వాతంత్య్రానంతరం తేయాకు, వస్త్రాలు, రసాయనాలు, సిమెంట్, స్టీల్ ట్యూబ్స్ తయారీ రంగాల్లో తన వ్యాపారాలను విస్తరించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పూర్తిగా స్వదేశీ పెట్టుబడితోనే బ్యాంకును ప్రారంభించాలని సంకల్పించారు. ఆ సంకల్పంతోనే కలకత్తా కేంద్రంగా 1943లో యునెటైడ్ కమర్షియల్ బ్యాంకును (యూకో బ్యాంకు) స్థాపించారు. ప్రస్తుతం దేశంలోని అగ్రగామి పారిశ్రామిక సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థలకు ఆయనే మూల పురుషుడు. విద్యారంగంలో, సేవారంగంలో ముద్ర ఘనశ్యామ్‌దాస్ బిర్లా విద్యా, సేవా రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. తన పూర్వీకుల పట్టణం పిలానీలో ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారు. అదే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్). ఐఐటీల తర్వాత దేశంలో అంతటి ప్రతిష్ఠాత్మక సంస్థగా ఇప్పటికీ ఇది వెలుగొందుతోంది. ఇదొక్కటే కాకుండా దేశవ్యాప్తంగా పలుచోట్ల పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పారు. హైదరాబాద్ సహా పలుచోట్ల బిర్లా మందిరాలు నిర్మించారు. ఘనశ్యామ్ బిర్లా సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1957లో ‘పద్మవిభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. తొంభయ్యేళ్ల నిండు జీవితం గడిపిన ఘనశ్యామ్ బిర్లా 1983 జూన్ 11న కన్నుమూశారు. -
ప్రభుత్వ పథకాలకు ‘కార్పొరేట్’ విరాళాలు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) ద్వారా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి, శాంతిభద్రతల అంశంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అత్యాధునిక నిఘా వ్యవస్థ కోసం రూ. 1,200 కోట్లతో నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నగరంలో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో మంత్రి ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లక్ష సీసీ కెమెరాల ప్రాజెక్టుకు కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ కింద విరివిగా విరాళాలు అందజేయాలని మంత్రి కోరారు. నగరంలో నేరాల సంఖ్య తగ్గుముఖం ప్రభుత్వం, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలతో నేరస్తులు నగరంలో అడుగు పెట్టేందుకు సాహసించడం లేదని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతిభద్రతల కోసం రూ. వేల కోట్ల నిధులను కేటాయించి పోలీసు శాఖకు సహకరిస్తోందన్నారు. పాతబస్తీలోని కామాటిపూర పోలీసు స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సీఎస్ఆర్ పథకం కింద రూ. కోటి విరాళాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ యాజమాన్యం.. తొలి విడతగా రూ. 25 లక్షల చెక్కును మంత్రి ఈటల సమక్షంలో సంస్థ హెచ్ఆర్ డెరైక్టర్ యూపీ పానీ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా యూపీ పానీ మాట్లాడుతూ తమ విద్యుత్ కేంద్రాల చుట్టూ ఉన్న గ్రామాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయల కోసం సీఎస్ఆర్ గతేడాది రూ. 300 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం పెట్టుకోగా, రూ.450 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ-తెలంగాణ చెర్మైన్ నృపేందర్‌రావు, ఎన్టీపీసీ దక్షిణ భారత విభాగం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వీబీ ఫడ్నవీస్, సీఐఐ ఉపాధ్యక్షుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలకు ఎల్ఈడీలు!
వీధిదీపాలకు పొదుపు మంత్రం సీఎస్ఆర్ కింద పంపిణీకి ఎన్టీపీసీ సంసిద్ధత విశాఖపట్నం: విద్యుత్తు వాడకాన్ని తగ్గించే ఎల్ఈడీ దీపాలు విశాఖ నగరంలో విజయవంతం కావడంతో అదే రీతిలో గ్రామాల్లోనూ ఏర్పాటు కానున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని పంచాయతీలకు అందించడానికి ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. వీటిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని అధికారవర్గాల సమాచారం. విశాఖనగరంలో జాతీయ రహదారి, బీఆర్టీఎస్ రహదారితో పాటు వీధిదీపాలకు ఎల్ఈడీ లైట్లను వినియోగిస్తున్నారు. వీటితో విద్యుత్తు పొదుపు సాధ్యమైంది. దీంతో జిల్లాలోని 925 పంచాయతీల్లోనూ వీధిదీపాలకు ఎల్ఈడీ లైట్లను వినియోగించాలనే సూచనలు వచ్చాయి. ఈమేరకు సీఎస్ఆర్ కింద ఎల్ఈడీ దీపాలను అందించేందుకు ఎన్టీపీసీ సింహాద్రి యాజమాన్యం ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ఎన్ని దశల్లో, ఏయే పంచాయతీల్లో ఎప్పుడెప్పుడు... ఎన్నెన్ని ఏర్పాటు చేయాలనే విషయమై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఎన్టీపీసీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... త్వరలోనే గ్రామాల్లోనూ తెల్లని ఎల్ఈడీ వెలుగులు విరబూస్తాయి. -
విశాఖకు ఐబీఎం సీఎస్ఆర్ సేవలు..
సాక్షి, విశాఖపట్నం: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 16 నగరాలను ఎంపిక చేసుకుని ఆయా నగరాల్లో వివిధ అంశాల్లో చేయూతనివ్వాలని నిర్ణయించినట్టు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎం సీఎస్ఆర్ (ఇండియా) హెడ్ మమతాశర్మ అన్నారు. బుధవారం ఆమె విశాఖ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ భారత్‌లో విశాఖతో సహా సూరత్, అలహాబాద్‌లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నందున. ఈ మూడు నగరాల్లో సీఎస్ఆర్ కింద సహకారం అందించాలని నిర్ణయించామన్నారు. సూరత్‌లో నూరు శాతం సౌరసేవలు, అలహాబాద్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, విశాఖలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో సీఎస్ఆర్ నిధులను వెచ్చించి అవసరమైన సాంకేతిక, నైపుణ్యతను ఐబీఎం అందజేస్తుందన్నారు. విశాఖలో తుపాన్లు ఎదుర్కొనే ప్రణాళికలను ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి రూపొందించి అందిస్తామన్నారు. ఇందుకోసం విపత్తులను అధ్యయనం చేయడంలో అనుభవం గల అంతర్జాతీయ స్థాయినిపుణులను విశాఖకు రప్పించి ఇక్కడి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి జిల్లా యంత్రాంగాన్ని అందిస్తా మన్నారు. ఇందుకయ్యే ఖర్చునంతటినీ తమ సంస్థ భరిస్తుందన్నారు. ఈ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా జిల్లా యంత్రాంగంతో పాటు విశాఖ నగరంలోని పలు వర్గాల వారితో చర్చించి నివేదిక తయారుచేస్తామన్నారు. -
బెదిరిస్తే... పారిపోతాం!
కర్నూలు : కర్నూలు జిల్లాలో అధికార యంత్రాంగానికి కార్పొరేట్ సంస్థలకు మధ్య వివాదం మరింత ముదురుతోంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తలెత్తిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేపట్టాలని కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ తమపై ఒత్తిడి తెస్తే జిల్లాలో పెట్టుబడులు పెట్టకుండా వెళ్లిపోతామని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో సీఎస్ఆర్ కింద మౌలిక సదుపాయాల కల్పన అంశం కాస్తా... అటు అధికార యంత్రాంగానికి ఇటు కార్పొరేట్ సంస్థల మధ్య కొత్త చిచ్చును రేపుతోంది. వెళ్లిపొమ్మంటారా...! సీఎస్ఆర్ అమలు కింద జిల్లావ్యాప్తంగా 50కిపైగా కంపెనీలను కలెక్టర్ గుర్తించారు. వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికీ జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఈ కంపెనీలు కూడా సీఎస్ఆర్ అమలు చేయమనడంతో ఇప్పుడు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఇటువంటి కంపెనీలు కొన్ని తమ మీద ఒత్తిడి తెస్తే జిల్లాలో పెట్టుబడులు పెట్టకుండానే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతామని పేర్కొంటున్నారు. ఉదాహరణకు.. కోడుమూరు నియోజకవర్గంలో ఎంపీఎల్ మినరల్ ప్రాసెసింగ్ కంపెనీ యూనిటు ఏర్పాటు కోసం 150 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇక్కడ మినరల్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ అంటోంది. అయితే, ఎటువంటి పనులు ప్రారభించకుండానే తాము ఎక్కడి నుంచి నిధులు తెచ్చి సీఎస్ఆర్ కింద సంక్షేమ కార్యకలాపాలు చేపట్టాలని ఈ కంపెనీ అంటున్నట్టు సమాచారం. ఒకవేళ తమ మీద ఒత్తిడి తెస్తే యూనిట్ ఏర్పాటును విరమించుకుని జిల్లా నుంచి వెళ్లిపోతామని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రధాన కంపెనీ నుంచి మైనింగ్ లీజు తీసుకున్న చిన్న కంపెనీలపై కూడా ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రధాన కంపెనీతో పాటు తమను కూడా సీఎస్ఆర్ అమలు చేయాలంటూ తమ మీద ఎలా ఒత్తిడి తెస్తారని కంపెనీల యజమానులు వాపోతున్నారు. మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కార్పొరేట్ల కొర్రీతో జిల్లాలో సీఎస్ఆర్ అమలు ప్రక్రియ కాస్తా నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కంపెనీల పట్ల గుర్రుగా ఉన్నారు. లక్షలాది రూపాయల లాభాన్ని ఆర్జించుకుంటూ.. పేద పిల్లలకు సదుపాయాలు కల్పించకపోవడం ఏమిటని కంపెనీల ప్రతినిధులను ఆయన ప్రశ్నిస్తున్నారు. కొర్రీలు వేస్తూ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ముందుకు రాకపోవడం ఏమిటని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో కంపెనీల ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని సమాచారం. సీఎస్ఆర్ అమలుకు ససేమిరా అంటే.. ఐటీ దాడులు చేయిస్తానని వారిపై మండిపడ్డట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఈ వ్యవహారం కాస్తా ఇరుపక్షాల మధ్య కొత్త వివాదాలకు కారణమవుతోంది. కంపెనీల చట్టం ఏం చెబుతోంది? వాస్తవానికి సీఎస్ఆర్ను కంపెనీలు కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఏదైనా సంస్థ సీఎస్ఆర్ కింద తమకు వచ్చిన లాభాల నుంచి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాల్సిందే. ఇది కంపెనీల చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోంది. ఏదైనా సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించి... వచ్చిన నికర లాభాల్లో 2 శాతం మొత్తాన్ని వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను సీఎస్ఆర్ కింద చేపట్టాలి. అయితే, జిల్లాలో ఇప్పటికీ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టని కంపెనీలకు కూడా సీఎస్ఆర్ కింద లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాలంటూ లక్ష్యాలు విధిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. -
మాజీ సైనికులకు ఉద్యోగాలివ్వండి
న్యూఢిల్లీ: మాజీ సైనికోద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కార్పొరేట్ సంస్థలను కోరారు. ‘సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన సిబ్బంది కార్పొరేట్ సంస్థలకు అవసరం. అలాంటి వారు మాజీ సైనికుల్లో విరివిగా లభిస్తారు. విధి నిర్వహణలో వారి నిబద్ధత శిఖరసమానమైనది. అత్యంత క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహించిన ఘనత వారిది...’ అని తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన మాజీ సైనికోద్యోగుల పునరావాస సదస్సులో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల నిర్వహణలో మాజీ సైనికులను వినియోగించవచ్చని సూచించారు. ప్రతి ఏటా సుమారు 60 వేల మంది సాయుధ బలగాల సిబ్బంది పదవీ విరమణ తీసుకుంటారనీ, వీరిలో 44 శాతం మంది 40-50 ఏళ్లు, 33 శాతం మంది 35-40 ఏళ్ల వారేననీ తెలిపారు. మరో 12 శాతం మంది 30-35 ఏళ్ల ప్రాయంలో రిటైర్ అవుతుంటారని చెప్పారు. కాగా, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఉద్యోగాలు కల్పించేందుకు భారతీయ పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ), సైన్యం ఈ సదస్సు సందర్భంగా సంయుక్తంగా కృషిచేస్తాయి. -
పీసీబీ సర్క్యులర్ల అమలు నిలిపివేత
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక వర్గాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధికి వారి ప్రాజెక్టు వ్యయంలో ఒక శాతం మొత్తాన్ని కేటాయించాలంటూ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) జారీ చేసిన సర్క్యులర్లను హైకోర్టు బుధవారం నిలుపుదల చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వెనుకబడిన తరగతుల సంక్షేమం, మహిళా సాధికారిత కోసం ఏర్పాటు చేసిన సీఎస్ఆర్ నిధికి ప్రాజెక్టు వ్యయంలో కనీసం ఒక శాతం మొత్తాన్ని, తర్వాత పదేళ్లపాటు 0.2 శాతం మొత్తాన్ని రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు కేటాయించాలంటూ 2012లో పీసీబీ సర్క్యులర్లు జారీచేసింది. ఈ సర్కులర్ల అమలు బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఇందులో భాగంగా ఇటీవల కొన్ని జిల్లాల కలెక్టర్లు పలు పరిశ్రమలకు నోటీసులు జారీ సీఎస్ఆర్ నిధికి డబ్బు జమ చేయాలని ఆదేశించారు. ఇలా నోటీసులు అందుకున్న మెదక్ జిల్లాలోని థర్మల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయిం చింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫున చల్లా గుణరంజన్ వాదనలు వినిపిస్తూ.. ఇటువంటి నోటీసులు జారీ చేసే పరిధి పీసీబీకి లేదన్నారు. పీసీబీ జారీ చేసిన సర్క్యులర్ల వల్ల పరిశ్రమలపై భారం పడుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం పీసీబీ సర్క్యులర్ల అమలు ను నిలిపివేస్తూ పై ఉత్తర్వులు జారీ చేసింది. -
సీఎస్ఆర్ నిధులతో సామాజిక కార్యక్రమాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటివరకు జిల్లాలో రూ.3.87 కోట్లు సేకరించినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. జిల్లాలోని పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు తమ ఆదాయంలో 1 నుంచి 5 శాతం నిధులను సామాజిక సేవా కార్యక్రమాల కింద ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ పథకం గత కొన్నేళ్లుగా జిల్లాలో అమలు కావడంలేదు. ఏ ఒక్క పరిశ్రమ యాజమాన్యం, కార్పొరేట్ సంస్థ అధికార యంత్రాంగానికి పీఎస్ఆర్ నిధులను అందించలేదన్నారు. ఈ పథకంపై దృష్టి సారించి జిల్లాలోని పరిశ్రమలకు నోటీసులు జారీ చేయడంతో రూ.3.87 కోట్లు సమకూరినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం బహుళ జాతి సంస్థకు చెందిన అల్లానా పరిశ్రమ డెరైక్టర్ సీకే తోట రూ.20లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. ఈ నిధులతో విద్య,వైద్య రంగాలకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే రక్తహీనత, పోషకాహార లోపంతో ఉన్న గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన హైరిస్క్ కేంద్రాలకు ఈ నిధులు ఉపయోగిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. సంక్షేమ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు, అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం వేళ అల్పాహారం కోసం ఈ నిధులను వెచ్చిస్తున్నట్టు చెప్పారు. నిధుల వినియోగాన్ని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. జిల్లా నుంచి సీఎస్ఆర్ కింద రూ.41 కోట్లు రావాల్సి ఉందని, మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రాబట్టి జిల్లా సంక్షేమానికి వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జేసీ శరత్, సీపీఓ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్ఆర్ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచి, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిబంధనలు కార్యరూపం దాల్చనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వీటిని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ(నోటిఫై) చేసింది. కొత్త కంపెనీల చట్టం-2013లో భాగంగా నిబంధనలను తీసుకొచ్చారు. దీని ప్రకారం కార్పొరేట్ కంపెనీలు ఇక నుంచి సామాజిక పురోభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులకు నిధులను తప్పనిసరిగా వెచ్చించడం, ఇతరత్రా కార్యకలాపాలను చేపట్టాల్సి ఉంటుంది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయసేకరణ, విసృ్తత చర్చల తర్వాతే ఈ నిబంధనలను ఖరారు చేశామని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సచిన్ పైలట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సీఎస్ఆర్ వ్యయంపై పన్ను రాయితీలు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇదివరకే కోరింది. అయితే, దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కంపెనీలకు ప్రశ్నార్థకంగా మారిన చాలా అంశాలకు ఈ నిబంధనలతో స్పష్టత లభించిందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇండియా టెక్నికల్ అడ్వయిజర్ సంతోష్ జయరామ్ అభిప్రాయపడ్డారు. నిబంధనల సారాంశమిదీ... సీఎస్ఆర్ నిబంధనల ప్రకారం సామాజిక సంక్షేమ కార్యకలాపాలకు కంపెనీలు తప్పకుండా తమ లాభాల్లో కొంత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. మూడేళ్ల సగటు వార్షిక లాభాల ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరం లాభాల్లో కనీసం 2 శాతాన్ని సీఎస్ఆర్కు ఖర్చుచేయాలి. కనీసం 500 కోట్ల నెట్‌వర్త్ లేదా రూ.1,000 కోట్ల టర్నోవర్ లేదా కనీసం రూ. 5 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తున్న కంపెనీలన్నీ సీఎస్ఆర్కు కచ్చితంగా వ్యయం చేయాల్సి వస్తుంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు లెక్క. దేశంలోనే ఈ సీఎస్ఆర్ కార్యకలాపాలు చేపట్టాలి. భారత్‌లో రిజిస్టర్ అయిన విదేశీ కంపెనీలకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయి. కాగా, విదేశీ శాఖల నుంచి లభించే లాభాలు, దేశీయంగా ఉన్న ఇతర అనుబంధ కంపెనీల నుంచి వచ్చే డివిడెండ్లను సీఎస్ఆర్ విషయంలో ఒక కంపెనీ నికర లాభాలను లెక్కించేటప్పుడు పరిగణనలోకి తీసుకోకుండా వెసులుబాటు ఇచ్చారు. రిజిస్టర్డ్ ట్రస్ట్ లేదా సొసైటీ లేదా ప్రత్యేక కంపెనీ ద్వారా కూడా కంపెనీలు సీఎస్ఆర్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం ఇతర కంపెనీలతో భాగస్వామ్యాన్ని కూడా ఏర్పాటుచేసుకోవచ్చు. అయితే, ఇలాంటి ప్రాజెక్టుల్లో వ్యయాన్ని ప్రత్యేకంగా చూపించాల్సి ఉంటుంది. సీఆర్ఆర్ ప్రాజెక్టులు/కార్యకలాపాలు/ప్రోగ్రామ్స్‌కు కేటాయించిన నిధుల్లో మిగులును కంపెనీలు తిరిగి తమ వ్యాపార లాభాల్లోకి మళ్లించబోమని సీఎస్ఆర్ పాలసీల్లో హామీనివ్వాల్సి ఉంటుంది. సీఎస్ఆర్ పనుల కోసం కంపెనీలు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవచ్చు. అయితే, ఈవిధమైన సిబ్బందిపై వ్యయం ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం సీఎస్ఆర్ ఖర్చులో 5 శాతం వరకూ మాత్రమే అనుమతిస్తారు. తాజా నిబంధనల అమలులో పారదర్శకత కోసం కంపెనీలు సీఎస్ఆర్ కార్యకలాపాల ద్వారా చేపట్టిన పనులను తమ వెబ్సైట్లలో పొందుపరచాల్సి ఉంటుంది. అయితే, రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇచ్చే విరాళాలు, నిధులు; కంపెనీలోని సొంత సిబ్బంది(వారి కుటుంబ సభ్యులు సహా) ప్రయోజనాల కోసం వెచ్చించిన సొమ్ము ఈ సీఎస్ఆర్ వ్యయం కిందికి రాదు. ఈ విధానం పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక సీఎస్ఆర్ కమిటీని కంపెనీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సీఎస్ఆర్ కింద ఏ పనులు చేపట్టాలి... నిబంధనల అమలు వంటివన్నీ ఈ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆతర్వాత కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదించాకే ఖర్చు చేయాలి. ఏ పనులను చేపట్టొచ్చు... దేశ సంస్కృతి-సంప్రదాయాల(చరిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న పురాతన కట్టడాలు, ప్రాంతాలు, కళల సంరక్షణ, పునరుద్ధరణ వంటివి) పరిరక్షణ చర్యలు, ప్రజలకోసం గ్రంథాలయాల ఏర్పాటు, సంప్రదాయ కళలు, హస్తకళాకృతుల అభివృద్ధి-ప్రోత్సాహానికి పాటుపడే పనులు కంపెనీల సీఎస్ఆర్ కార్యకలాపాల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ధి, సోమాజికాభివృద్ధి ప్రాజెక్టులు; ఆరోగ్య సంరక్షణ, సురక్షితమైన తాగునీటి కల్పన, పారిశుధ్య పనులు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎదురవుతున్న అసమానతల తగ్గింపు లక్ష్యంగా చేపట్టే విభిన్న కార్యక్రమాలు. మాజీ సైనికోద్యోగులు, యుద్ధంలో భర్తను కోల్పోయిన వితంతువులు, వాళ్ల కుటుంబీకులకు చేదోడుగా నిలిచే చర్యలు. మహిళలు, అనాథలకు ఇళ్లు, హాస్టళ్ల ఏర్పాటు; వయసు మళ్లిన వారికోసం ప్రత్యేక వసతుల(ఓల్డేజ్ హోమ్స్, డే కేర్ సెంటర్లు వంటివి) కల్పన. ఆగ్రో-ఫారెస్ట్రీ, అడవుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, పశు సంవర్థకం, సహజ వనరుల సంరక్షణ; నీరు-గాలి-మట్టి నాణ్యతను కాపాడే చర్యలు. గ్రామీణ ఆటలు, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన క్రీడలు, పారాలింపిక్(అంగవైకల్యం ఉన్నవాళ్లకు) స్పోర్ట్స్, ఒలింపిక్ స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం, శిక్షణ కార్యక్రమాలు, ఇతరత్రా. -
సీఎస్ఆర్ నిధులు చెల్లించాల్సిందే..
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిధులు చెల్లించాల్సిందేనని పరిశ్రమల యాజమాన్యాలను కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. సీఎస్ఆర్ కింద వివిధ పరిశ్రమల నుంచి రూ.46 కోట్లకు గాను కేవలం రూ.90 లక్షలు మాత్రమే రావడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు రాబట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ నిధుల అంశంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశ్రమలు చెల్లించాల్సిన వాటిలో 50 శాతం నిధులను ఈ నెలాఖరులోగా జమ చేయాలని సూచించారు. డివిజన్ స్థాయిలో అధికారులు పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి సీఎస్ఆర్ నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమలు తమ ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేయరాదన్నారు. జిల్లా కమిటీ ఆమోదం మేరకే పనులను చేపట్టాలన్నారు. వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వండి.. సీఎస్ఆర్ నిధులు చెల్లించేందుకు ఉత్సాహం చూపని పరిశ్రమల బ్యాంకు నిర్వహణ ఖాతాల వివరాలను తెలియజేయాల్సిందిగా లీడ్ బ్యాంకు మేనేజర్‌ను కలెక్టర్ ఆదేశించారు. నిధులు చెల్లించని ఆయా పరిశ్రమల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఆయా నిధులను వివిధ అభివృ ద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో జేసీ శరత్, డీఐసీ జీఎం సురేశ్‌కుమార్, సీపీఓ గురుమూర్తి, లేబర్ కమిషనర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈలు పాల్గొన్నారు. -
బొమ్మల మాటున బొక్కే ఎత్తు..!
సాక్షి, కాకినాడ :హైదరాబాద్‌లోని టాంక్ బండ్ తరహాలో కాకినాడ బోట్‌క్లబ్‌ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రిలయన్స్ సంస్థ సమకూర్చిన రూ.60 లక్షలతో ఆధునికీకరించారు. క్లబ్ చుట్టూ కర్బ్‌వాల్ నిర్మించి గ్రావెల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. లోపల ఫౌంటెన్లు, ఆధునిక ఎలక్ట్రిక్ స్తంభాలు, లైట్లు, బాలల కోసం వివిధ రకాల ఆట పరికరాలు సమకూర్చారు. వాకర్స్‌కు అవసరమైన మరుగుదొడ్లు నిర్మించారు. పలురకాల మొక్కలు నాటారు. గ్రానైట్ రాతితో మలచిన ఆదికవి నన్నయ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బోయి భీమన్న వంటి కవుల, రఘుపతి వెంకటరత్నంనాయుడు, కందుకూరి వీరేశలింగం వంటి సంస్కర్తల విగ్రహాలను పెడెస్టళ్లపై ప్రతిష్టించారు. ఆధునికీకరించిన బోట్‌క్లబ్‌ను గత నవంబర్ 15న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్‌ల సమక్షంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎంపళ్లంరాజు ప్రారంభించారు. విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. నాటి సభలో రిలయన్స్ సమకూర్చిన రూ.60 లక్షలతో బోట్‌క్లబ్‌ను ఆధునికీరించామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇప్పటికైనా పట్టించుకోండి ప్రత్యేకాధికారి గారూ.. కాగా ‘నగర పాలక సంస్థ కమిషనర్ అనుమతితో’ అంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల ఒకటిన రూ.18.03 లక్షలు వ్యయమయ్యే 19 పనులకు స్వల్పకాలిక టెండర్ నోటీసు జారీ చేశారు. ఆ పనుల్లో ఇప్పటికే క్లబ్లో ఉన్న కవులు, సంఘసంస్కర్తల విగ్రహాల ఏర్పా టు, వాటికి పెడెస్టళ్ల నిర్మాణం, గ్రానైట్ రాయి బిగింపు, కొత్త లైట్ల ఏర్పాటు వంటి రూ.9.76 లక్షల విలువైన పది పనులుండడం గమనార్హం. టెండర్ల దాఖలుకు ఈ నెల 9 వరకు గడువని, 10న సాయంత్రం టెండర్లు తె రుస్తామని జారీ అయిన నోటీసులో స్థానికేతరులెవరూ దాఖ లు చేయడానికి వీల్లేని రీతిలో బాక్సు టెండర్‌గా పిలి చారు. సాధారణంగా లక్షలోపు పనులను నామినేషన్ పద్ధతిలో ఇవ్వొచ్చు. ఇప్పటికే రూ.2.97 కోట్లతో 297 పనులను అడ్డగోలుగా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన అధికారులు ఇప్పుడు అంతా అయిపోయి వినియోగంలోకి వచ్చాక విగ్రహాలు, వాటికి పెడెస్టళ్లు, గ్రానైట్ బిగిం పు పేరుతో టెండర్లు పిలవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. పైగా రిలయన్స్ నిధులతో జరిగిన ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలవడాన్ని బట్టి రూ.9.76 లక్షల కార్పొరేషన్ నిధులను దొడ్డిదారిన పంచుకుకోనున్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ క్లబ్ ఆధునికీకరణ పనుల్లో ఇవన్నీ లేవనుకుంటే అప్పుడు ఏ నిధులతో వాటిని చేయించారు, ఆ పనులకు ఇప్పుడెం దుకు టెండర్లు పిలవాల్సి వచ్చింది, ఎవరి ప్రయోజనం ఆశించి ఇలాంటి దొడ్డిదారి పద్ధతులకు తెర తీస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే టెండర్‌లోని మిగిలిన 9 పనులు కూడా ఈ బాపతుగా పూర్తయినవే కావచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకాధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ జోక్యం చేసుకొని కార్పొరేషన్ అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. -
కానరాని ‘సామాజిక బాధ్యత’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్) కింద పరిశ్రమల నుంచి కోట్లాది రూపాయలు వసూలు కావాల్సి ఉంది. నిబంధనలపై అధికారులకు అవగాహన లేకపోవడంతో ఏళ్ల తరబడి సీఎస్సార్ పద్దు కింద నిధుల సేకరణ నత్తనడకన సాగుతోంది. సమస్యలను సాకుగా చూపుతూ ‘సామాజిక బాధ్యత’ కింద ఇవ్వాల్సిన నిధిని యజమానులు అరకొరగా విదుల్చుతున్నారు. దీంతో సామాజిక అవసరాల కోసం వినియోగించాల్సిన సొమ్ము కోసం అధికారులు పరిశ్రమల యజమానుల వేటలో పడ్డారు. జిల్లాలో సుమారు 400 పైగా భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వసూలయ్యే సీఎస్సార్ నిధిని విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, రక్షిత తాగునీటి సరఫరా, బలహీనవర్గాల సంక్షేమం తదితర సామాజిక అవసరాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీఓ) కన్వీనర్‌గా వ్యవహరించే కలెక్టర్ ఆమోదంతో సామాజిక అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సీఎస్సార్ కింద నిధి ఇవ్వడం తప్పనిసరి కాకపోయినా, పరిశ్రమల పెట్టుబడిలో కనీసం 0.2 శాతం యజమానులు జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న విధానం మేరకు పరిశ్రమలు ఆర్జించే లాభాల్లో 0.2 శాతం సీఎస్సార్ పద్దుకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఏళ్ల తరబడి పరిశ్రమల నుంచి సీఎస్సార్ నిధికి డబ్బు సమకూరడం లేదు. గతంలో కలెక్టర్లుగా పనిచేసిన సురేశ్ కుమార్, దినకర్‌బాబు సుమారు మూడు కోట్ల రూపాయలు సీఎస్సార్ ఫండ్‌గా సమకూర్చారు. పరిశ్రమలన్నీ స్పందిస్తే ఈ మొత్తం సుమారు రూ.30 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. కలెక్టర్‌గా స్మితాసబర్వాల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎస్సార్ ఫండ్ సేకరణపై దృష్టి సారించారు. సీపీఓ కన్వీనర్‌గా ఎనిమిది మంది జిల్లా అధికారులతో ప్రస్తుతం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, డీపీఓ, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. పరిశ్రమలకు లేఖలు పరిశ్రమల వారీగా సీఎస్సార్ మొత్తాన్ని లెక్కగట్టి లేఖలు రాసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. బడా పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో సీఎస్సార్ నిధి అందాల్సి ఉండటంతో వాటిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచే సుమారు రూ.70 లక్షలకు పైగా నిధి వసూలు కావాల్సి ఉంది. ప్రత్యేక ఖాతాలో జమ చేయాల్సిన డబ్బును కొన్ని పరిశ్రమలు తామే సొంతంగా ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నాయి. గ్రామాల్లో వైద్య శిబిరాలు, పాఠశాలల్లో యూనిఫారాలు, పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్తున్నాయి. సీఎస్సార్ నిధి ఇవ్వకుండా తప్పించుకునేందుకే పరిశ్రమలు ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్సార్ నిధిని సొంతంగా ఖర్చు చేసే పరిశ్రమలకు కలెక్టర్ స్మితా సబర్వాల్ కొత్త మెలిక పెట్టారు. ఇకపై సొంతంగా నిధులు వెచ్చించే పరిశ్రమలు కచ్చితంగా కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని లేఖలు రాస్తున్నారు. సీఎస్సార్ ద్వారా సమకూరే నిధిని సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగు పరిచేందుకు వినియోగించాలని కలెక్టర్ యోచిస్తున్నారు. హాస్టళ్లలో మౌలిక సౌకర్యాల కొరతపై ఈ నెల 28లోగా నివేదించాల్సిందిగా ‘సన్నిహిత’ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కాగా సీఎస్సార్ నిధి వసూలుకు ఈ నెల 30వ తేదీ గడువుగా నిర్ణయించారు. -
రెడ్డి ల్యాబ్స్ రూ. 9.5 కోట్ల విరాళం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎన్ఆర్) కింద పారిశ్రామిక వేత్తలు తమవంతు బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం రెడ్డిల్యాబ్స్ సంస్థ ప్రతినిధులు రవికుమార్, ప్రసాద్, బాలేశ్ సీఎన్ఆర్ కింద రూ.9.5 లక్షల చెక్కును కలెక్టర్ స్మితాసబర్వాల్కుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పారిశ్రామికవేత్తలు జిల్లా అభివృద్ధికి తమవంతు చేయూతనందించాలని కోరారు. ఈ నిధులను వసతి గృహాల మౌళిక వసతుల మెరుగు, ఇతర సామాజిక అంశాలపై వెచ్చిస్తున్నామనీ, వీటికి సంబంధించిన వివరాలను జిల్లా వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నామని ఆమె తెలిపారు. సామాజిక బాధ్యతతో జిల్లా అభివృద్ధికి విరాళమిచ్చిన రెడ్డి ల్యాబొరేటిస్ యాజమాన్యాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.