ప్రభుత్వ పథకాలకు ‘కార్పొరేట్’ విరాళాలు | Government schemes to Corporate donations | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలకు ‘కార్పొరేట్’ విరాళాలు

Published Fri, May 6 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

Government schemes to Corporate donations

సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) ద్వారా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి, శాంతిభద్రతల అంశంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అత్యాధునిక నిఘా వ్యవస్థ కోసం రూ. 1,200 కోట్లతో నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నగరంలో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.

భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో మంత్రి ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లక్ష సీసీ కెమెరాల ప్రాజెక్టుకు కార్పొరేట్ సంస్థలు సీఎస్‌ఆర్ కింద విరివిగా విరాళాలు అందజేయాలని మంత్రి కోరారు.  
 
నగరంలో నేరాల సంఖ్య తగ్గుముఖం
ప్రభుత్వం, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలతో నేరస్తులు నగరంలో అడుగు పెట్టేందుకు సాహసించడం లేదని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతిభద్రతల కోసం రూ. వేల కోట్ల నిధులను కేటాయించి పోలీసు శాఖకు సహకరిస్తోందన్నారు.

పాతబస్తీలోని కామాటిపూర పోలీసు స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సీఎస్‌ఆర్ పథకం కింద రూ. కోటి విరాళాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ యాజమాన్యం.. తొలి విడతగా రూ. 25 లక్షల చెక్కును మంత్రి ఈటల సమక్షంలో సంస్థ హెచ్‌ఆర్ డెరైక్టర్ యూపీ పానీ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా యూపీ పానీ మాట్లాడుతూ తమ విద్యుత్ కేంద్రాల చుట్టూ ఉన్న గ్రామాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయల కోసం సీఎస్‌ఆర్ గతేడాది రూ. 300 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం పెట్టుకోగా, రూ.450 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ-తెలంగాణ చెర్మైన్ నృపేందర్‌రావు, ఎన్టీపీసీ దక్షిణ భారత విభాగం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వీబీ ఫడ్నవీస్, సీఐఐ ఉపాధ్యక్షుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement