Corporate donations
-
ఎలక్టరోల్ ట్రస్టుల విరాళాల్లో బీజేపీ టాప్.. రెండోస్థానంలో టీఆర్ఎస్!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థల నుంచి బీజేపీకి విరాళాల వరద పారింది. ఎలక్టరోల్ ట్రస్టులకు(ఈటీ) వచ్చిన కార్పొరేట్, వ్యక్తిగత విరాళాల్లో 72 శాతానికిపైగా కాషాయ పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. పోల్ రైట్స్ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) 2021-22 ఆర్థిక ఏడాదికి గల ఎలక్టరోల్ ట్రస్టుల విరాళాల వివరాలను వెల్లడించింది. 2021-22 ఏడాదిలో బీజేపీకి అత్యధికంగా రూ.351.50 కోట్ల విరాళాలు ఈటీల ద్వారా అందాయి. మొత్తం పార్టీలు అందుకున్న విరాళాలతో పోలిస్తే బీజేపీకే 72.17 శాతం అందినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ద ఫ్రుడెండ్ ఎలక్టరోల్ ట్రస్ట్ అత్యధికంగా రూ.336.50 కోట్లు బీజేపీకి విరాళంగా అందించింది. అంతకు ముందు ఏడాది 2020-21లో రూ.209 కోట్లు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. అలాగే.. 2021-22 ఏడాదిలో ఏపీ జనరల్ ఈటీ, సమాజ్ ఈటీ వరుసగా రూ.10కోట్లు, రూ.5 కోట్లు బీజేపీకి అందించాయి. రెండోస్థానంలో టీఆర్ఎస్.. బీజేపీ తర్వాత రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిలిచింది. ఫ్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు ఒక్కదాని నుంచే రూ.40 కోట్లు అందాయి. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి రూ.18.43 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.21.12 కోట్లు ట్రస్టుల ద్వారా అందాయి. ఇండిపెండెంట్ ఈటీ నుంచి ఆప్ పార్టీకి రూ.4.81 కోట్లు అందిన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టింది చీపురు పార్టీ. అలాగే.. స్మాల్ డొనేషన్స్ ఈటీ నుంచి కాంగ్రెస్‌కు 1.9351 కోట్లు అందాయి. ఫ్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు 9 రాజకీయ పార్టీలకు విరాళాలు అందించింది. అందులో టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీలు ఉన్నాయి. మరో ఆరు ఎలక్టరోల్ ట్రస్టులు 2021-22 ఏడాదికి గానూ రూ.487.0856 కోట్లు విరాళాలుగా అందాయని తెలిపాయి. అందులో రూ.487.0551 కోట్లు(99.994శాతం) వివిధ రాజకీయ పార్టీలకు అందించినట్లు పేర్కొన్నాయి. అయితే, ఏ పార్టీకి ఎంత ఇచ్చామనే వివరాలు వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం విరాళాల్లో 95 శాతాన్ని అర్హతగల రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్టు పంపిణీ చేయాలి. రిజిస్టర్ అయిన 23 ఎలక్టోరల్ ట్రస్టుల్లో 16 ట్రస్టులు తమ విరాళాల కాపీలను ఎలక్షన కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నాయి. మిగిలిన 7 ట్రస్టులు తమ విరాళాల నివేదికలను వెల్లడించలేదు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
ప్రభుత్వ పథకాలకు ‘కార్పొరేట్’ విరాళాలు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) ద్వారా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి, శాంతిభద్రతల అంశంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అత్యాధునిక నిఘా వ్యవస్థ కోసం రూ. 1,200 కోట్లతో నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నగరంలో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో మంత్రి ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లక్ష సీసీ కెమెరాల ప్రాజెక్టుకు కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ కింద విరివిగా విరాళాలు అందజేయాలని మంత్రి కోరారు. నగరంలో నేరాల సంఖ్య తగ్గుముఖం ప్రభుత్వం, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలతో నేరస్తులు నగరంలో అడుగు పెట్టేందుకు సాహసించడం లేదని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతిభద్రతల కోసం రూ. వేల కోట్ల నిధులను కేటాయించి పోలీసు శాఖకు సహకరిస్తోందన్నారు. పాతబస్తీలోని కామాటిపూర పోలీసు స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సీఎస్ఆర్ పథకం కింద రూ. కోటి విరాళాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ యాజమాన్యం.. తొలి విడతగా రూ. 25 లక్షల చెక్కును మంత్రి ఈటల సమక్షంలో సంస్థ హెచ్ఆర్ డెరైక్టర్ యూపీ పానీ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా యూపీ పానీ మాట్లాడుతూ తమ విద్యుత్ కేంద్రాల చుట్టూ ఉన్న గ్రామాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయల కోసం సీఎస్ఆర్ గతేడాది రూ. 300 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం పెట్టుకోగా, రూ.450 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ-తెలంగాణ చెర్మైన్ నృపేందర్‌రావు, ఎన్టీపీసీ దక్షిణ భారత విభాగం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వీబీ ఫడ్నవీస్, సీఐఐ ఉపాధ్యక్షుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు.