మౌలిక వసతులు.. కార్పొరేట్‌ సొబగులు | Fundraising under Corporate Social Responsibility | Sakshi
Sakshi News home page

మౌలిక వసతులు.. కార్పొరేట్‌ సొబగులు

Published Mon, Aug 26 2019 4:40 AM | Last Updated on Mon, Aug 26 2019 4:40 AM

Fundraising under Corporate Social Responsibility  - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని మార్గాల్లో నిధులు సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రైవేట్‌ కంపెనీలు – కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్సార్‌)లో భాగంగా సామాజిక మౌలిక వసతుల కల్పనకు నిధులను సులభతరంగా సమకూర్చేందుకు వీలుగా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది. ‘మీ గ్రామాలకు ఏటా ఒకట్రెండుసార్లయినా రండి. మీ ఊళ్లోని పాఠశాల, ఆసుపత్రి అభివృద్ధికి సహకరించండి. మీ ద్వారా జరిగిన పనికి మీ పేర్లే పెడతాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల అమెరికా పర్యటనలో ప్రవాసాంధ్రులకు పిలుపునిచి్చన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వచ్చే నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రత్యేక విధానం కార్యరూపం దాలుస్తోంది. సీఎస్సార్‌ కింద సమకూర్చిన నిధులను ఖర్చు చేసే తీరు, మౌలిక ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ రూపొందిస్తున్నారు. దాతలు ఇచ్చే నిధులను నవరత్నాలకు ఉపయోగించడంతో పాటు.. ఆయా కంపెనీలు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ కొత్త విధానం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రైవేట్‌ కంపెనీలు, దాతలే మొత్తం ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం ఉండదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య తదితర సామాజిక మౌలిక వసతులు ఎక్కడెక్కడ కొరత ఉన్నాయో ప్రభుత్వమే గుర్తించనుంది. ప్రభుత్వం ప్రాధాన్యతగా గుర్తించిన పనుల నుంచి ఏ పనులను చేపట్టాలో ప్రైవేట్‌ కంపెనీలు, దాతలే నిర్ణయించుకుని అవసరమైన నిధులను అందజేయవచ్చు.  

ప్రాధాన్యతల మేరకు ప్రభుత్వం గుర్తించిన పనులు 
– పాఠశాలల్లో తరగతి నిర్మాణం (వ్యయం సుమారు రూ.10 లక్షలు) 
– తరగతి గదిలో అవసరమైన ఫర్నిచర్ను సమకూర్చడం (వ్యయం సుమారు రూ.లక్ష) 
– పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగ్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్‌ నిర్మాణం (వ్యయం సుమారు రూ.1.5 లక్షలు) 
– ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో లేబర్‌ రూమ్‌ నిర్మాణం 
– ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణం 
– కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో పనిచేసే ఎక్స్‌రే మిషన్‌  
– కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో అప్పుడే పుట్టిన పిల్లల కోసం స్టెబిలైజేషన్‌ యూనిట్‌ ఏర్పాటు 
– కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్ల కోసం క్వార్టర్స్‌ నిర్మాణం 
– అంగన్‌ వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్స్‌ గదుల నిర్మాణం 

అంతటా పారదర్శకం 
మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్‌ కంపెనీలు లేదా దాతలు పూర్తి పారదర్శకంగా వెబ్‌ బేస్డ్‌ సింగిల్‌ ప్లాట్‌ ఫాంలో పనులు చేపట్టవచ్చు. వ్యక్తిగత స్థాయిలో కూడా దాతలు ఈ ప్రాజెక్టులను చేపట్టవచ్చు. ప్రైవేట్‌ కంపెనీలు, దాతలు చేపట్టే పనులు వెబ్‌సైట్‌ డ్యాష్‌ బోర్డులో కనిపిస్తాయి. ప్రాజెక్టుల పనుల పురోగతిని కూడా చూడవచ్చు. నిధుల వినియోగం ఏ విధంగా జరుగుతుందో దాతలు తెలుసుకునేందుకు, వారిలో విశ్వాసం కలిగించేందుకు 13 జిల్లాల కలెక్టర్లు 13 ఎస్క్రో అకౌంట్లను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా నిధులు ఏ మేరకే వినియోగించారు.. ఇంకా ఎన్ని నిధులు మిగిలాయన్నది తెలుసుకోవచ్చు. పనులు జరిగే తీరును జిల్లా కలెక్టర్లు సమన్వయం చేస్తారు.

ఈ పనుల కోసం ప్రత్యేకంగా నిష్ణాతులతో కూడిన విభాగాన్ని ప్రణాళికా శాఖలో ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాల బ్రాండ్‌ను ఈ విభాగం మార్కెట్‌ చేస్తుంది. దాతలు ఇచ్చిన విరాళాలు సద్వినియోగమయ్యేలా ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. అన్ని విధాలా దాతలకు సహకారం అందిస్తుంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ప్రైవేట్‌ కంపెనీలు లేదా దాతలు చేపట్టిన పనులు పూర్తయ్యాక ప్రభుత్వానికి బదిలీ చేస్తారు. ఆ పనులకు ఆయా కంపెనీలు లేదా దాతల పేర్లను  పెడతారు. అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వమే స్వీకరిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు.  

వెబ్‌ బేస్ట్‌ ప్రాసెస్‌ ఇలా.. 
– ప్రభుత్వమే సామాజిక మౌలిక వసతులను గుర్తించి భౌగోళిక, రంగాల వారీగా ప్రాజెక్టులను డ్యాష్‌ బోర్డులో డిస్‌ప్లే చేస్తుంది. 
– డిస్‌ప్లే అయిన ప్రాజెక్టుల నుంచి ప్రైవేట్‌ కంపెనీలు, దాతలు ఏదో ప్రాజెక్టును ఎంపిక చేసుకుని విరాళాలు ఇవ్వొచ్చు.  
– ఆ విరాళాలు ఎస్క్రో అకౌంట్లకు వెళ్తాయి. పనులు సంబంధిత శాఖకు వెళ్తాయి. 
– జిల్లా కలెక్టర్‌ ఆ పనుల పురోగతిని నెల/మూడు నెలలకోసారి సమీక్షిస్తూ అవసరమైన నిధులను విడుదల చేస్తారు. పనుల పురోగతి ఫొటోలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. 
– పనులు పూర్తి కాగానే జిల్లా కలెక్టర్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఆ వెంటనే అవి పూర్తయిన పనుల ప్రాజెక్టుల జాబితాలోకి వెళ్తాయి. 

  ఈ కంపెనీలకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత.. 
– 2013 కంపెనీల చట్టం సెక్షన్‌ 135 కింద ఉన్న కంపెనీలు   
– రూ.500 కోట్లు లేదా ఆ పై విలువగల కంపెనీలు  
– రూ.1000 కోట్లు లేదా ఆపై టర్నోవర్‌ ఉన్న కంపెనీలు 
– ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లు ఆ పైన నికర లాభం కలిగిన కంపెనీలు 

ఈ కంపెనీలు లాభాల్లో కనీసం రెండు శాతం మేర నిధులను కార్పొరేట్‌ సామాజిక బాధ్యతకు వెచ్చించాలి. ప్రధానంగా పేదరిక నిర్మూలన, విద్యను ప్రోత్సహించడం, లింగ సమానత్వం, మహిళా సాధికారిత, మాతా శిశు మరణాలు తగ్గించడం, హెచ్‌ఐవీ.. ఏయిడ్స్‌ నిర్మూలన, మలేరియా, పర్యావరణ పరిరక్షణ, వృత్తి విద్యా శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాల పెంపు, సామాజిక ప్రాజెక్టులు, సామాజిక ఆర్థికాభివృద్ధి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల అభివృద్ధికి నిధులు వెచ్చించాలి . 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement