ప్రభుత్వ బడికి సరికొత్త శోభ | 8000 crores for the development of 22217 school | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడికి సరికొత్త శోభ

Published Thu, Jan 4 2024 5:56 AM | Last Updated on Thu, Jan 4 2024 11:15 AM

8000 crores for the development of 22217 school - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ రెండో దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రెండో దశలో భాగంగా 22,217 పాఠశాలల్లో పనులు చేపట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే 2,755 స్కూళ్లలో నూరు శాతం పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చింది. అన్ని పాఠశాలల్లో కొత్త భవనాలతో పాటు తాగునీటి నుంచి ఆట వస్తువుల వరకు నిర్దేశిత 12 వసతులను కల్పిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలోని 44,512 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం సదుపాయాలు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఇందులో భాగంగా నాడు–నేడు మొదటి దశ కింద ఇప్పటికే దాదాపు రూ.3,700 కోట్లతో 15,715 ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. మొదటి దశలో లేని 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది.

ఇందులో ఇప్పటివరకు 2,755 స్కూళ్లలో పనులు నూరు శాతం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. అలాగే మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్‌ షెడ్ల నిర్మాణం, మరో 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్‌ రిపేర్లను పూర్తి చేసింది. 394 పాఠశాలల్లో పెయింటింగ్, తాగునీటి సదుపాయాలు తప్ప ఇతర అన్ని పనులూ పూర్తయ్యాయి. రెండో దశలో చేపట్టిన పనులకు ఇప్పటికే రూ.3,535.44 కోట్ల బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. 

సమున్నతంగా నిలిపేందుకు..
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను సమున్నతంగా నిలిపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్‌ వెల్ఫేర్, ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్లతో సహా అన్ని ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో ఉన్న రెసిడెన్షియల్‌ పాఠశాలలతో సహా మొత్తం 44,512 స్కూళ్లను నాడు–నేడు పథకం కిందకు తీసుకువచ్చారు.

పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో, దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో నిరంతర నీటి సరఫరాతో పాటు టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి డబుల్‌ డెస్క్‌ ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, అదనపు తరగతి గదులు, వంటషెడ్లు, ప్రహరీ వంటి మొత్తం 12 సదుపాయాలను కల్పిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement