బాధ్యత అనుకుంటేనే ఫలం, ఫలితం! | Corporate Social Responsibility Guest Column By Dileep Reddy | Sakshi
Sakshi News home page

బాధ్యత అనుకుంటేనే ఫలం, ఫలితం!

Published Fri, Apr 1 2022 1:15 AM | Last Updated on Fri, Apr 1 2022 2:16 PM

Corporate Social Responsibility Guest Column By Dileep Reddy - Sakshi

మన ఎదుగుదలకు ఇంత ఇచ్చిన సమాజానికి తిరిగి మనమేమి ఇస్తున్నాం? అన్న దృక్పథం నుంచి పుట్టిన సంస్థాగత కర్తవ్యమే కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సీఎస్సార్‌). అలాంటి వ్యక్తిగత భావన మనిషి ఉత్కృష్ట ఆలోచన, ఉదారత నుంచి పుట్టే వితరణ. కానీ, కార్పొరేట్లకు ఇది వితరణశీలత మాత్రమే కాదు... సమాజంపట్ల వారి బాధ్యత! కానీ జాతీయ స్టాక్‌ ఎక్స్‌చేంజీలో నమోదైన 1,627 కంపెనీలు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించలేదు. కంపెనీల సీఎస్సార్‌ వ్యయానికి సంబంధించిన నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని పార్లమెంటు ఆర్థిక స్థాయీసంఘం కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. చిత్తశుద్ధితో స్వయంగా పాల్గొనడం ద్వారా సమాజాభివృద్ధిలో కార్పొరేట్లు భాగం కావడమే నిజంగా కావాల్సింది!

కార్పొరేట్ల సామాజిక బాధ్యత (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ–సీఎస్సార్‌) ఒట్టి నినాదం కాకుండా దేశంలో దీన్ని చట్టబద్ధం చేసి నేటికి సరిగ్గా ఎనిమిదేళ్లు! కంపెనీ చట్టం సెక్షన్‌ 135 ప్రకారం నిర్దిష్ట పెట్టుబడి, లావాదేవీలు, లాభం కలిగిన దేశంలోని కంపెనీలన్నీ వాటి వార్షిక నికర లాభంలో 2 శాతం నిధుల్ని ఏటా సీఎస్సార్‌ కింద కచ్చితంగా వ్యయం చేయాలి. రూ. 500 కోట్ల నికర విలువ కలిగిన, లేదా ఏటా రూ. 1,000 కోట్ల లావాదేవీలు జరిపిన, లేదా ఏటా రూ. 5 కోట్ల లాభాలార్జించిన కంపెనీలన్నీ ఈ నిబంధన పరిధిలోకి వస్తాయి.  ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్లు ఉమ్మడిగా పనిచేస్తే సమ్మిళిత ప్రగతికి ఆస్కారం ఉంటుందన్న నమ్మకమే దీనికి పునాది.

2014 ఏప్రిల్‌ 1 నుంచి ఆచరణలోకి వచ్చిన ఈ విధానంతో... నిజంగా సాధించిందేమిటని వెనక్కి చూసుకుంటే, గొప్ప ఆశావహ వాతావరణమేమీ కనిపించదు. ఇందుకు కారణాలనేకం! దీన్నొక తంతుగా కొంత డబ్బు వెచ్చించి చేతులు దులుపుకొంటున్నాయి తప్ప సమాజ హితంలో ఏ మేర పాత్ర వహిస్తున్నామన్న సోయితో చేయ ట్లేదు. కొన్ని కార్పొరేట్లయితే వ్యయమే చేయట్లేదు. ఇంకొన్ని తమ వ్యాపార వృద్ధికే తప్ప సమాజం కోసం వ్యయం చేయట్లేదు. మరికొన్ని ఈ నిధుల వ్యయం కోసం సొంతంగా ట్రస్టులు, ఫౌండేషన్లు స్థాపించి మొక్కు బడిగా నిర్వహిస్తున్నాయి. ఇంకొందరైతే బోగస్‌ సంస్థలతో చేతులు కలిపి లెక్కలు మాత్రమే చూపించి, ఇరువురూ సీఎస్సార్‌ నిధుల్ని నొక్కేస్తున్నారు. అలా అని, సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న కార్పొరేట్లు అసలు లేవని కాదు, కానీ, వాటి సంఖ్య పరిమితం!

నివేదిక కోరిన స్థాయీ సంఘం
వివిధ విభాగాల్లోని పదేసి అగ్ర కంపెనీల సీఎస్సార్‌ వ్యయానికి సంబంధించిన సమగ్ర నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని పార్లమెంటు ఆర్థిక స్థాయీసంఘం కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఇటీవలే ఆదేశించింది. నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ, ఎంతేసి వ్యయం చేశారో చూపాలని పేర్కొంది. అభివృద్ధి చెందిన చోటనే తూతూ మంత్రంగా వెచ్చించడం కాకుండా, నిజంగా అవసరం ఉన్న వెనుకబడిన ప్రాంతాల్లో ప్రగతి సమతూకం సాధించాలన్నది ఇందుకు ఉద్దేశించిన లక్ష్యాల్లో ఒకటి! సీఎస్సార్‌ వ్యయంపై ఆయా కంపెనీలిచ్చే నివేదికల్లో సమాచారం అసమగ్రంగా ఉందనీ, వాటిపై నిఘా, నియంత్రణ వ్యవస్థ కూడా సరిగా లేదనీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది.

మైనింగ్, రియల్‌ ఎస్టేట్, నిర్మాణ తదితర కీలక రంగాల్లో సీఎస్సార్‌ వ్యయాలు స్థానికంగా జరపటం లేదనే విష యాన్ని సంఘం గుర్తించింది. కార్పొరేట్‌ రంగంలో జరిగే తీవ్రమైన మోసాల దర్యాప్తు విభాగం (ఎస్‌ఎఫ్‌ఐవో) నిర్వహణ సరిగా లేదనీ తప్పుబట్టింది. అసాధారణంగా 60 శాతం పోస్టులు ఖాళీగా ఉండి, దర్యాప్తులు జాప్యమవటం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపు తోందని పేర్కొంది. సత్వరం సరిదిద్దాలని నిర్దేశించింది. గత ఏడేళ్లలో లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు సీఎస్సార్‌ కింద వ్యయమైనట్టు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి రావ్‌ ఇందర్‌జిత్‌ సింగ్‌ నిరుడు పార్లమెంటుకు తెలిపారు. నిజానికిది నామ మాత్రమే!  

సగానికి మించి విఫలమే!
సీఎస్సార్‌ నిధుల వ్యయం ద్వారా... విద్య, వైద్యం మెరుగు, ఆకలి, లింగ వివక్ష, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, గ్రామీణా భివృద్ధి, క్రీడాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, బలహీన వర్గాల సంక్షేమం– నైపుణ్యాల శిక్షణ వంటి పది లక్ష్యాల్ని నిర్దేశించారు. ఆయా అంశాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నిధుల్ని వ్యయం చేయవచ్చు. తగు ప్రాజెక్టుల్ని రూపొందించి, సొంతంగా ఏర్పరచుకున్న విభాగాల ద్వారానో, విశ్వసనీయత కలిగిన మూడో పక్ష ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతోనో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.

కానీ, దేశంలో వంద అతి పెద్ద కార్పొరేట్లలో 52 నిర్దేశించిన సీఎస్సార్‌ నిధుల్ని వ్యయం చేయలేదని ప్రపంచ స్థాయి అంచనాలు, అధ్యయన సంస్థ కేపీఎమ్జీ తాజా (2019) నివేదిక చెబుతోంది. ఒక్క 2017–18 లోనే పదివేల కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేయాల్సి ఉండిం దని ‘ప్రైమ్‌ డాటా గ్రూప్‌ అనాలిసిస్‌’ నివేదిక పేర్కొంది. జాతీయ స్టాక్‌ ఎక్స్‌చేంజీలో నమోదైన 1,627 కంపెనీలు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించలేదు. సరైన ప్రాజెక్టులు గుర్తించలేదనో, భాగస్వామ్యానికి విశ్వసనీయ సంస్థలు దొరకలేదనో చెప్పడం కూడా ఓ కుంటి సాకే! ఎందుకంటే, చట్టం అమల్లోకి వచ్చి 8 ఏళ్లవుతోంది. ఈ పనుల నిర్వహణకు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంస్థలు, ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టరై ఉన్నాయి. సీఎస్సార్‌ కార్యకలాపాలు, నిధుల వ్యయానికి సంబంధించి వివరాల వెల్లడిలో మరింత పార దర్శకత కోసం నిబంధనల్లో ప్రభుత్వం ఇటీవల కొన్ని సవరణలు తెచ్చింది. (క్లిక్‌: పర్యావరణాన్నే పణంగా పెడదామా?)

ఒక సంవత్సరం నిర్దేశించిన మొత్తం నిధుల్ని వ్యయం చేయ కుంటే, తర్వాతి సంవత్సరాలకు బదలాయించడం కాకుండా, కేంద్రం ఇదే అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఒక నిధికి మళ్లించే వ్యవస్థను కూడా కల్పించింది. సీఎస్సార్‌– ఫారమ్‌ 2 ద్వారా చాలా వివరాలను కంపెనీలు/కార్పొరేట్లు పారదర్శకంగా వెల్లడించాల్సి ఉంటుంది. మంత్రిత్వ శాఖకు, బోర్డుకు, సభ్యులకిచ్చే వార్షిక నివేదికల్లో విధిగా ఇది ఉండాలి. తాము సీఎస్సార్‌ కింద నిర్వహించిన కార్యక్రమ సామాజిక ప్రభావాల అంచనా నివేదిక కూడా ఇందులో భాగం.

మన కార్పొరేట్లు మారాలి!
సీఎస్సార్‌ విషయంలో ప్రపంచ కంపెనీల దృక్పథంలో వచ్చిన మార్పు భారతీయ కార్పొరేట్లలో రావటం లేదు. ‘వాతావరణ సంక్షోభం’ వంటి విపత్కర పరిస్థితుల్లో గ్లోబల్‌ కార్పొరేట్ల మౌలిక ఆలోచనలే మారుతున్నాయి. సామాజిక బాధ్యతను తదేక దృష్టితో ఆచరిస్తున్నాయి. ‘ఎల్పీజీ’ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) తర్వాత కంపెనీల్లో ప్రజాపెట్టుబడులు పెరిగాయి. పెట్టుబడుల భాగస్వాములుగా, ఉత్పత్తులు, సేవల వినియోగదారులుగా సాధారణ ప్రజానీకం ఆశలు, ఆకాంక్షల్ని కూడా కార్పొరేట్లు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. తమ నడతను మార్చుకుంటున్నాయి.

వస్తు సేవల నాణ్యత, ధర మాత్రమే కాకుండా కంపెనీ నడత, నిర్వహించే సామాజిక బాధ్యతను కూడా పౌరసమాజం లెక్కలోకి తీసుకుంటుందనే గ్రహింపు వారిలో ఈ పరివర్తనకు కారణం. 2015–16లో భారత్‌లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, వస్తు సేవల నాణ్యత మాత్రమే కాకుండా పర్యావరణ, సామాజిక అంశాల్లో ఆయా కంపెనీలు, కార్పొ రేట్ల క్రియాశీలత, బాధ్యత, జవాబుదారీతనాన్నీ వినియోగదారులు పరిగణనలోకి తీసుకొని అటు మొగ్గినట్టు తేలింది.

కార్పొరేట్ల నైతికత, సామాజిక స్పృహ కూడా వారి వ్యాపారాభివృద్ధిని ప్రభావితం చేసే అంశమే! ఈ గ్రహింపు వల్లే టాటా గ్రూప్‌ వంటి కొన్ని పెద్ద సంస్థల సీఎస్సార్‌ నిర్వహణ ఎంతో పద్ధతిగా ఉంటుంది. కొన్ని సంస్థలైతే తప్పుడు పద్ధతులు అనుసరించడం, స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలకు తప్పుడు సమాచారం ఇవ్వడం, సీబీఐ, ముంబై పోలీస్‌ వంటి విభాగాలు కేసులు నమోదు చేసే పరిస్థితుల్ని ఎదుర్కోవడం వరకూ వెళ్లాయి. (క్లిక్‌: మనమే రాస్తున్న మరణ శాసనం)

పబ్లిక్‌ రంగ సంస్థల్లోనూ సీఎస్సార్‌ నిధులు దుర్వినియోగం అవు తున్నాయి. మంత్రుల ప్రత్యేక విమాన ప్రయాణాలకు, అధికారుల విలాసాలకు దుబారా చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల సంక్షేమానికి వాడి లెక్కలు చూపుతున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత అంటే, కేవలం నిధులిచ్చి పేరు తెచ్చుకోవడం అన్న భావన కన్నా అతీతమైంది. స్వయంగా పాల్గొనడం ద్వారా సమాజాభివృద్ధిలో కార్పొరేట్లు భాగం కావడం! కంపెనీలు, కార్పొరేట్లు చిత్తశుద్ధితో ‘అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి’ అనే విశాల దృక్పథంతో ఉంటేనే... సీఎస్సార్‌కి ఓ అర్థం, పరమార్థం!

- దిలీప్‌ రెడ్డి
సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement