మాజీ సైనికులకు ఉద్యోగాలివ్వండి
న్యూఢిల్లీ: మాజీ సైనికోద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కార్పొరేట్ సంస్థలను కోరారు. ‘సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన సిబ్బంది కార్పొరేట్ సంస్థలకు అవసరం. అలాంటి వారు మాజీ సైనికుల్లో విరివిగా లభిస్తారు. విధి నిర్వహణలో వారి నిబద్ధత శిఖరసమానమైనది. అత్యంత క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహించిన ఘనత వారిది...’ అని తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన మాజీ సైనికోద్యోగుల పునరావాస సదస్సులో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల నిర్వహణలో మాజీ సైనికులను వినియోగించవచ్చని సూచించారు.
ప్రతి ఏటా సుమారు 60 వేల మంది సాయుధ బలగాల సిబ్బంది పదవీ విరమణ తీసుకుంటారనీ, వీరిలో 44 శాతం మంది 40-50 ఏళ్లు, 33 శాతం మంది 35-40 ఏళ్ల వారేననీ తెలిపారు. మరో 12 శాతం మంది 30-35 ఏళ్ల ప్రాయంలో రిటైర్ అవుతుంటారని చెప్పారు. కాగా, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఉద్యోగాలు కల్పించేందుకు భారతీయ పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ), సైన్యం ఈ సదస్సు సందర్భంగా సంయుక్తంగా కృషిచేస్తాయి.