న్యూఢిల్లీ: ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించిన మాదిరిగానే భారత కార్పొరేట్లు తమ సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విస్తరిస్తున్నారు. దీంతో సామాజిక సేవ, అభివృద్ధి కార్యక్రమాల కోసం వీరు వెచ్చిస్తున్న మొత్తం గణనీయంగా పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2017–18)లో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కార్యక్రమం కోసం చేసిన నిధుల వ్యయం 11% మేర పెరిగింది. రూ.10,030 కోట్లను ఇందుకు ఖర్చు చేయడం విశేషం. ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అయిన 1,795 కంపెనీల్లో 1,080 కంపెనీల నిధుల వ్యయం ఆధారంగా ప్రైమ్ డేటాబేస్ గ్రూపు ఈ వివరాలను వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈ లిస్డెడ్ కంపెనీల సీఎస్‌ఆర్ నిధుల వ్యయం వార్షికంగా 16 శాతం చొప్పున గత మూడు సంవత్సరాల్లో వృద్ధి చెందినట్టు ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా తెలిపారు.
పెరిగిన భాగస్వామ్యం
సీఎస్‌ఆర్ చట్టం 2014 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. రూ.500 కోట్లకు పైగా నికర విలువ కలిగిన కంపెనీలు లేదా రూ.1,000 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీలు లేదా రూ.5 కోట్ల నికర లాభం ఆర్జిస్తున్నవి తమ లాభాల్లో 2 శాతాన్ని (క్రితం మూడు సంవత్సరాల్లో సగటు లాభంపై) సీఎస్‌ఆర్ కోసం ఖర్చు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. 2017–18లో కంపెనీలు రూ.10,885 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయాలనుకున్నాయి. చట్టప్రకారం చూస్తే వాస్తవంగా ఖర్చు చేయాల్సిన దానికంటే ఇది రూ.200 కోట్లు ఎక్కువ. అయితే, ఇందులో రూ.1,717 కోట్లు ఖర్చు చేయకుండా ఉండిపోయాయి. అయితే, అంతిమంగా సీఎస్‌ఆర్ కింద చేసిన వ్యయం రూ.10,030 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2016–17లో ఈ కార్యక్రమం కింద కార్పొరేట్ల నిధుల వ్యయాల మొత్తం రూ.9,060 కోట్లు. సీఎస్‌ఆర్ కింద నిధులు ఖర్చు చేసిన కంపెనీల సంఖ్య 2016–17లో 931గా ఉంటే (మొత్తం కంపెనీల్లో 92%), 2017–18లో వీటి సంఖ్య 1016కు (94%) పెరిగింది.
అగ్రస్థాయి కంపెనీల వాటా
అగ్రస్థాయి పది కంపెనీలు పెట్టిన ఖర్చే మొత్తం సీఎస్‌ఆర్ నిధుల వ్యయాల్లో 36.06 శాతంగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐవోసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, విప్రో అగ్ర స్థాయి పది కంపెనీలుగా ఉన్నాయి. మొత్తం మీద 59 శాతం కంపెనీలు నిధుల వ్యయాలను పెంచాయి. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన స్వచ్ఛ భారత్, క్లీన్ గంగా కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు 10%, 47% చొప్పున తగ్గిపోయాయి. స్వచ్ఛభారత్‌కు 2016–17లో కార్పొరేట్ కంపెనీల వినియోగం రూ.581 కోట్లుగా ఉంటే, 2017–18లో రూ.521 కోట్లకు పరిమితమైంది. క్లీన్ గంగాకు కేటాయింపులు 2016–17లో ఉన్న రూ.151 కోట్ల నుంచి 2017–18లో రూ.80 కోట్లు తగ్గిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపించిన 2015–16లో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి నిధుల కేటాయింపులు రూ.1,009 కోట్ల మేర ఉన్నాయి.
ఇతర కార్యక్రమాలకూ చేయూత
కంపెనీల చట్టం 11 భిన్న షెడ్యూళ్లలో నిధుల వ్యయాలను తప్పనిసరి చేసింది. వీటికి అదనంగా కొన్ని కంపెనీలు అయితే సామాజికాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఖర్చు చేస్తుండటం అభినందించే విషయమే. 2017–18లో విద్యా సంబంధిత కార్యక్రమాలకు 38 శాతం నిధులు అందగా, హెల్త్‌కేర్‌కు 25 శాతం, అసమానతల నిరోధానికి 2 శాతం, జాతీయ వారసత్వ సంపదకు 4 శాతం, సాయుధ బలగాలకు 1 శాతం, క్రీడలు 2 శాతం నిధులు అందుకున్నాయి.
‘విస్తరిస్తున్న’ కార్పొరేట్ల సేవ
Published Wed, Nov 28 2018 1:44 AM | Last Updated on Wed, Nov 28 2018 8:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment