క్యూ1లో రూ. 19,325 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 19,325 కోట్లను తాకింది. అధిక ప్రొవిజన్లు, వడ్డీ ఆదాయం మందగించడం లాభాలపై ప్రభావం చూపింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత నెమ్మదించి 1 శాతం వృద్ధితో రూ. 17,035 కోట్లకు చేరింది. తొలి త్రైమాసికంలో సాధారణంగా బలహీన ఫలితాలు వెలువడుతుంటాయని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఇకపై వృద్ధి పుంజుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వెరసి ఈ ఏడాదిలో రూ. లక్ష కోట్ల నికర లాభం అందుకోగలమని ధీమాగా చెప్పారు.
వడ్డీ ఆదాయం ఓకే
ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్‌బీఐ నికర వడ్డీ ఆదాయం 6 శాతం మెరుగుపడి రూ. 41,125 కోట్లకు చేరింది. ఇందుకు 15 శాతం రుణ విడుదల దోహదపడగా.. నికర వడ్డీ మార్జిన్లు 0.12 శాతం నీరసించి 3.35 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం రూ. 12,063 కోట్ల నుంచి రూ. 11,162 కోట్లకు తగ్గింది. ఇన్వెస్ట్‌మెంట్ బుక్‌ను నిబంధనలకు అనుగుణంగా సవరించడం ఇందుకు కారణమైనట్లు ఖారా తెలియజేశారు. డిపాజిట్లలో 8 శాతం వృద్ధి నమోదైంది. తాజా స్లిప్పేజీలు రూ. 7,900 కోట్లను తాకాయి. వీటిలో రూ. 3,000 కోట్లు గృహ, వ్యక్తిగత రుణాల నుంచి నమోదైంది. స్థూల మొండిబకాయిలు 2.24 శాతం నుంచి 2.21 శాతానికి స్వల్పంగా తగ్గాయి. రుణ నష్టాల ప్రొవిజన్లు 70 శాతం పెరిగి రూ. 4,580 కోట్లయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 13.86 శాతంగా నమోదైంది.
షేరు ప్రతిఫలించడంలేదు
గత నాలుగేళ్లలో ఎస్‌బీఐ ఆర్జించిన లాభాలు అంతక్రితం 64 ఏళ్లలో సాధించిన లాభాలకంటే అధికమైనప్పటికీ షేరు ధరలో ఇది ప్రతిఫలించడంలేదని దినేష్ ఖారా అభిప్రాయపడ్డారు. 22,000కుపైగా బ్రాంచీలు, భారీ రిజర్వులు, విభిన్న ప్రొడక్టులు కలిగిన బ్యాంక్‌కు సరైన విలువ లభించడంలేదని వ్యాఖ్యానించారు. గత 4ఏళ్లలో రూ. 1.63 లక్షల కోట్ల నికర లాభం ఆర్జించగా.. అంతక్రితం 64 ఏళ్లలో రూ. 1.45 లక్షల కోట్లు మాత్రమే ఆర్జించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నెలాఖరున ఖారా పదవీకాలం ముగియనుంది.
బాధ్యతలు స్వీకరించేటప్పటికి బ్యాంక్ వార్షిక లాభం రూ. 14,000 కోట్లుకాగా.. ప్రస్తుతం ఒక త్రైమాసికంలోనే రూ. 17,000 కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్య సైతం ఆరు రెట్లు ఎగసి 30 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఈ అంశాలేవీ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంలేదంటూ ఖారా విచారం వ్యక్తం చేశారు. ప్రొవిజన్ల విషయంగా కొత్త చైర్మన్‌కు కుదుపులు ఉండవని, ఎండీలంతా కలసి బ్యాలన్స్ïÙట్‌ను రూపొందించారని వివరించారు. కాగా.. గత ఐదేళ్లలో ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 0.84 లక్షల కోట్ల నుంచి రూ. 1.92 లక్షల కోట్లకు ఎగసింది. అయినప్పటికీ ఇది తగిన విలువకాదంటూ ఖారా పేర్కొన్నారు. ఎఫ్‌అండ్‌వోపై రిటైల్ ఇన్వెస్టర్లను నిరుత్సాహపరుస్తూ సెబీ తీసుకుంటున్న నియంత్రణలతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులు మళ్లే వీలున్నట్లు ఖారా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment