Manideep charitable trust : సామాజిక సేవలో మణిదీపం | Special story on Manideep charitable trust and services | Sakshi
Sakshi News home page

Manideep charitable trust : సామాజిక సేవలో మణిదీపం

Published Thu, Feb 6 2025 2:22 PM | Last Updated on Thu, Feb 6 2025 2:35 PM

Special story on Manideep charitable trust and services

నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూత

ల్యాప్‌టాప్‌లు అందజేస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ..

మణిదీప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ విస్తృతకార్యక్రమాలు 

చదువుతోనే సమాజ వికాసం జరుగుతుందన్న విశ్వాసం ఆయనది.. అందుకే ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలన్నదే అతడి ఆకాంక్ష.. విద్యకు డబ్బు సమస్య కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పుల పేరిట తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తూ వారు చదువు కొనసాగించేలా దోహదపడుతున్నారు. ఆయనే మణిదీప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు మణిదీప్‌. బేగంపేట కుందన్‌బాగ్‌కు చెందిన మణిదీప్‌ విభిన్న సేవా కార్యక్రమాలను చేపడుతూ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.      – సనత్‌నగర్‌

మణిదీప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను 2018లో ప్రారంభించిన మణిదీప్‌ సేవలను విస్తరించుకుంటూ వెళ్తున్నారు. చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతగా నిలవాలని తలంపుతో మహా యజ్ఞాన్ని ఆరంభించారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మణిదీప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఇప్పటి వరకు 180 మందికి వారి ఆర్థిక స్థోమతను బట్టి సహకారం అందించి అండగా నిలబడ్డారు. ఈ ఒక్క ఏడాదే 50 మందికి స్కాలర్‌షిప్పులను అందజేశారు. అలాగే చినజీయర్‌ స్వామి ఆశ్రమంలోని గురుకుల్‌ ట్రస్ట్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు వైశ్య వికాస వేదిక వారు 10వ తరగతి, ఇంటర్‌ చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో టాప్‌గా నిలిచిన వారికి ల్యాప్‌ట్యాప్‌లను అందజేశారు. 

చదవండి : బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!

పేద విద్యార్థులకు ఇప్పటి వరకు ఆయన 30 ల్యాప్‌ట్యాప్‌లను అందజేశారు. యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న 10 మంది విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు అందించేందుకు ముందుకువచ్చారు. నిరుపేదలకు మెడిసిన్‌తో పాటు న్యూట్రిషన్, విటమిన్‌ ఆహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యపరంగానూ సేవలుఅందిస్తున్నారు. కరోనా సమయంలో సంస్థ తరఫున ఎన్నో సేవలు అందించారు.  ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ హైదరాబాద్‌ జిల్లా యూత్‌ కన్వినర్‌గా కూడా మణిదీప్‌ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు సంస్థలతో కలిసి రక్తదాన శిబిరాల నిర్వహణ చేపట్టడంతో పాటు విపత్తుల సమయంలో తీవ్రంగా నష్టపోయిన వారికి అండగా నిలబడుతున్నారు. మణిదీప్‌ సేవలను గుర్తించిన హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఇటీవలే ప్రతిభా పురస్కారాన్ని కూడా అందించారు.  

ఇదీ చదవండి: ‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్‌ వీడియో

ల్యాప్‌ట్యాప్‌లు అందిస్తున్నాం  

సమాజం మనకు ఏమి ఇచ్చింది అనే కంటే.. సమాజానికి మనం ఏం చేశామన్నది ముఖ్యం. చదువే అన్నింటికీ సమాధానం. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదువును ఎవరూ ఆపకూడదు. అందుకోసం మణిదీప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం, అవసరమైన వారికి ల్యాప్‌ట్యాప్‌లు అందిస్తున్నాం. రాజ్‌భవన్‌ వేదికగా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టాం. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌సొసైటీ తరఫున సేవ చేసే  అవకాశం లభించడం అదృష్టం.  
– మణిదీప్, మణిదీప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement