కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద నిధులు చెల్లించాల్సిందేనని పరిశ్రమల యాజమాన్యాలను కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. సీఎస్‌ఆర్ కింద వివిధ పరిశ్రమల నుంచి రూ.46 కోట్లకు గాను కేవలం రూ.90 లక్షలు మాత్రమే రావడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు రాబట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ నిధుల అంశంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశ్రమలు చెల్లించాల్సిన వాటిలో 50 శాతం నిధులను ఈ నెలాఖరులోగా జమ చేయాలని సూచించారు. డివిజన్ స్థాయిలో అధికారులు పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి సీఎస్‌ఆర్ నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమలు తమ ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేయరాదన్నారు. జిల్లా కమిటీ ఆమోదం మేరకే పనులను చేపట్టాలన్నారు.
వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వండి..
సీఎస్‌ఆర్ నిధులు చెల్లించేందుకు ఉత్సాహం చూపని పరిశ్రమల బ్యాంకు నిర్వహణ ఖాతాల వివరాలను తెలియజేయాల్సిందిగా లీడ్ బ్యాంకు మేనేజర్‌ను కలెక్టర్ ఆదేశించారు. నిధులు చెల్లించని ఆయా పరిశ్రమల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఆయా నిధులను వివిధ అభివృ ద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు.
అందుకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో జేసీ శరత్, డీఐసీ జీఎం సురేశ్‌కుమార్, సీపీఓ గురుమూర్తి, లేబర్ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈలు పాల్గొన్నారు.
సీఎస్‌ఆర్ నిధులు చెల్లించాల్సిందే..
Published Wed, Jan 22 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement