సీఎస్‌ఆర్ నిధులతో సామాజిక కార్యక్రమాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటివరకు జిల్లాలో రూ.3.87 కోట్లు సేకరించినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. జిల్లాలోని పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు తమ ఆదాయంలో 1 నుంచి 5 శాతం నిధులను సామాజిక సేవా కార్యక్రమాల కింద ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ పథకం గత కొన్నేళ్లుగా జిల్లాలో అమలు కావడంలేదు. ఏ ఒక్క పరిశ్రమ యాజమాన్యం, కార్పొరేట్ సంస్థ అధికార యంత్రాంగానికి పీఎస్‌ఆర్ నిధులను అందించలేదన్నారు. ఈ పథకంపై దృష్టి సారించి జిల్లాలోని పరిశ్రమలకు నోటీసులు జారీ చేయడంతో రూ.3.87 కోట్లు సమకూరినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా శనివారం బహుళ జాతి సంస్థకు చెందిన అల్లానా పరిశ్రమ డెరైక్టర్ సీకే తోట రూ.20లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. ఈ నిధులతో విద్య,వైద్య రంగాలకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే రక్తహీనత, పోషకాహార లోపంతో ఉన్న గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన హైరిస్క్ కేంద్రాలకు ఈ నిధులు ఉపయోగిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. సంక్షేమ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు, అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం వేళ అల్పాహారం కోసం ఈ నిధులను వెచ్చిస్తున్నట్టు చెప్పారు. నిధుల వినియోగాన్ని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. జిల్లా నుంచి సీఎస్‌ఆర్ కింద రూ.41 కోట్లు రావాల్సి ఉందని, మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రాబట్టి జిల్లా సంక్షేమానికి వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జేసీ శరత్, సీపీఓ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.