social programs
-
కేరళ కుట్టి ఉద్యమానికి సోషల్ ప్రోగ్రెస్ ‘ఆస్కార్’
’ఇది ప్రతి స్త్రీ జీవితంలో అనుభవమయ్యే పునరుత్పత్తి పునాది ప్రక్రియ. కానీ ఏ దేశంలోనైనా చర్చించడానికి ససేమిరా ఇష్టపడని విషయం కూడా ఇదే. రక్తస్రావమనే అత్యంత సహజక్రియకి స్త్రీలంతా శిక్షింపబడుతున్నారు.’ అంటూ పట్టుమని పద్దెనిమిదేళ్ళు కూడా లేని కేరళ కుట్టి అమికా జార్జ్ బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ’’ఫ్రీ పీరియడ్స్’’ ఉద్యమం ఆమెకు గోల్‌కీపర్స్ గ్లోబల్ అవార్డు దక్కేలా చేసింది. సామాజిక అభివృద్ధి రంగంలో ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రగతిని పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా బిల్, మెలిండా ఫౌండేషన్ 2017లో గోల్‌కీపర్స్ అనే సామాజిక చైతన్య ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏళ్ళ అమికా జార్జ్ పేద బాలికలకు ఉచిత సానిటరీ ప్యాడ్స్ కోసం బ్రిటన్ వీధుల్లో పూరించిన శంఖారావం ఆమెకు ఈ అవార్డు దక్కేలా చేసింది. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం చివరకు బ్రిటన్ పురవీధుల్లో స్త్రీపురుష భేదాన్ని మరిపిస్తూ సాగింది. దాదాపు 2000 మంది యువతీయువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు బ్రిటన్ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమావసరాలను తీర్చే ఉచితి సానిటరీ ప్యాడ్స్ కోసం 1.5 మిలయన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అభివృద్ధిచెందిన బ్రిటన్‌లాంటి దేశాల్లోనే ప్రతి పదిమంది బాలికల్లో ఒకరు సానిటరీ ప్యాడ్స్‌ని కొనుగోలు చేయలేని పేదరింకలో మగ్గుతున్నారని ప్లాన్ ఇంటర్నేషల్ సర్వేలో చదివిన 18 ఏళ్ల భారతీయ యువతి అమికా జార్జ్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమ క్రమంలో బ్రిటన్ పేద బాలికలు సానిటరీ ప్యాడ్స్‌ని కొనుక్కోలేని స్థితిలో ఆ అవసరానికి కాగితాలనూ, పాత న్యూస్ పేపర్స్‌నీ, సాక్స్‌నూ వాడుతుండడం తన హృదయాన్ని కలిచివేసిందంటారు అమికా జార్జ్. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆమె దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఇదే ఆమె చేపట్టిన ’’ఫ్రీ పీరియడ్’’ ఉద్యమానికి పునాది అన్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చరిత్ర చదవడానికి వెళ్ళి చరిత్ర సృష్టించిన∙అమికా జార్జ్. 2017 డిసెంబర్లో జరిగిన ఈ ఉద్యమం ఫలితంగా అక్కడి పేద బాలికలకు దక్కిన ఫలితాన్ని గుర్తించిన గోల్‌కీపర్స్ సోషల్ ప్రోగ్రెస్ ఆస్కార్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా సమాజాన్ని చైతన్యయుతం చేసిన ముగ్గురు మహిళలను ఈ అవార్డుకి ఎంపిక చేస్తే అందులో అమికా జార్జ్ ఒకరు. ఫ్రెంచ్ అధ్యక్షలు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, మహిళల పిల్లల హక్కుల కార్యకర్త గ్రేస్ మైఖస్త్ల్, రచయిత, సామాజిక కార్యకర్త రిచర్డ్ కర్టిస్ తదితర ప్రముఖులు ఈ అవార్డుల కార్యక్రమంలో ఉపన్యసించారు. న్యూయార్క్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇరాక్ కి చెందిన 24 ఏళ్ళ నదియా మురద్, కెన్యాకి చెందిన 28 ఏళ్ళ డిస్మస్ కిసిలు లకి సైతం అమికా జార్జ్‌తో సహా ఈ అవార్డులు అందుకున్నారు. -
అదే క్రిస్మస్కు నిజమైన అర్థం!
‘నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు’... ప్రతి క్షణం నేను గుర్తుంచుకునే వాక్యమిది. ఎదుటి వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఈర్ష్యాద్వేషాలకు చోటుండదు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. నా దృష్టిలో క్రిస్మస్ అనేది అందరికీ సంబంధించిన పండగ. కానీ సెలబ్రేషన్స్‌తో పాటు షేరింగ్ కూడా ఉండాలని నా ఉద్దేశం. అందుకే యేటా ఈ రోజున కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూంటా. మనకున్న దానిలో కొంత పేదలకు ఇస్తే అందులో ఉండే తృప్తి, ఆనందం వేరు. అదే క్రిస్మస్కి నిజమైన అర్థం. మాది బ్రహ్మసమాజం కమ్యూనిటీకి చెందిన కుటుంబం. నేను 2001లో క్రైస్తవ మతాన్ని ఆచరించడం మొదలుపెట్టాక ఎవరూ అడ్డు చెప్పలేదు. యూకేజీ వయసులోనే నేను చర్చకు వెళ్లేదాన్ని. అప్పటి నుంచే జీసస్‌తో కొంత అనుబంధం ఏర్పడింది. అప్పట్లో అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ 1985లో జరిగిన ఓ ప్రమాదం నన్ను పూర్తిగా మార్చేసింది. మరణం అంచుల దాకా వె ళ్తున్న నన్ను జీసస్ రక్షించాడని నా నమ్మకం. అందుకే ఆయన మార్గంలో వెళ్లడం మొదలుపెట్టా. క్రైస్తవ మార్గంలో వెళ్లడమంటే జీసస్‌లా అందరితో ప్రేమగా ఉండటమే! - జయసుధ -
మాస్టర్ ...
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇద్దరి ఎంపిక 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం ఉత్తమ బోధన.. సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు జిల్లా నుంచి ఇద్దరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యూరు. ఒకరు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ ఎండీ రాజ్‌మహ్మద్ కాగా, మరొకరు తొర్రూరు మండలం మాటేడు పీఎస్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్న పరాంకుశం రఘునారాయణ. వీరిద్దరు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. - విద్యారణ్యపురి నల్గొండ జిల్లా వలిగొండకు చెందిన పరాంకుశం రఘునారాయణ 1984లో ఎస్జీటీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. నాటి నుంచి అంకితభావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు. విద్యబోధనతోపాటు సామాజిక సేవలోనూ ఈయన ముందుంటున్నారు. అంతర్జిల్లా బదిలీల్లో పాలకుర్తితోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేవలందించారు. 2013లో తొర్రూరు మండలం మాటేడు యూపీఎస్‌లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా నియమితులయ్యూరు. పాఠశాలల్లో వసతుల కోసం కృషి వివిధ స్వచ్ఛంద సంస్థల సహాకారంతో పాఠశాలలో ఫర్నీచర్ ఇతర పరికరాలను రఘునారాయణ సేకరించారు. నోటు పుస్తకాలు, టై బెల్టులు నగదు, వస్తు రూపేణ బహుమతులు ఇచ్చే వారిని ప్రోత్సహించేవారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఇంటింటి ప్రచారం చేసేవారు. ఉపాధ్యాయులతో ప్రభావవంతంగా విద్యాబోధన చే రుుంచేవారు. పాఠశాలల్లో మొక్కలను నాటించారు. బడితోటకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రచయితగానూ ముద్ర.. బాలరంజని గేయమాలిక రచించటంతోపాటు ఆకాశవాణి ద్వారా ప్రసంగాలు కూడా చేశారు. పలు దిన,వార,మాసపత్రికల్లో వ్యాసాలు, 50 కవితలు రాశారు. తెలుగు ప్రపంచ సభలకూ ప్రతినిధిగా వెళ్లారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుండేవారు. 2007లో జిల్లాస్థాయిలో, 2008లో రాష్ర్టస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందారు. ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో డైమండ బెస్టిజిన్ అవార్డు అందుకున్నారు. భద్రాచంలో సర్వేపెల్లి వాలంటరీ ఆర్గనైజేషన్‌ద్వారా సర్వేపెల్లి పురస్కారం, సాహిత్యసంస్కృతిక అకాడమీ ద్వారా గురజాడ అవార్డు అందుకున్నారు. అంకితభావం రఘునారాయణ ఆస్తి మరింతగా బాధ్యత పెరిగింది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావటంతో నా బాధ్యత మరింత పెరిగింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు మరింత గా శ్రమిస్తాను. విద్యార్థుల్లోనూ సామాజిక స్పృహ అలవర్చేలా ప్రయత్నిస్తాను. నేను అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం ఆనందంగా ఉంది. అవార్డు కింద వచ్చే రూ. 50 వేలను మాటేడు ప్రాధమిక పాఠశాల విద్యార్థుల అభివృద్ధి కోసం వినియోగిస్తా. - రఘునారాయణ -
ఎగ్జిబిషన్ సొసైటీ సేవలు ఆదర్శనీయం: కేసీఆర్
హైదరాబాద్: ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సామాజిక కార్యక్రమాలు సమాజానికే ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తార్నాక విజయపురి కాలనీలో ఇటీవల నూతన హంగులతో నిర్మించిన సరోజిని నాయుడు వనితా ఫార్మసీ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసిన సరోజిని నాయుడు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నిజాం పాలనలో ఈ ఎగ్జిబిషన్ సొసైటీని నాటి ‘బాగ్-ఈ-ఆమ్’ నేటి పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అనంతరం ఇప్పుడున్న స్థలంలో ఎగ్జిబిషన్ సొసైటీని మార్చారని పేర్కొన్నారు. ఈ సొసైటీ తెలంగాణ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు 19 విద్యాసంస్థలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదానికి దీటుగా ఎగ్జిబిషన్ మైదానం వర్థిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, మాజీ శాసన సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతె శోభన్‌రెడ్డి, కళాశాల చైర్మన్ పి. హరినాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వి. జ్యోతి, సెక్రటరీ సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సేవాపథంలో పాతికేళ్ల శ్రమశక్తి
జీతం చేతికి రాగానే...ఇంటి అద్దెకు ఇంత, పిల్లల బడి ఫీజులకు ఇంత... ఇలా లెక్కలు వేసుకుంటాం. ఫ్యామిలీ బడ్జెట్ తయారుచేసుకుంటాం. మిగిలిన ఖర్చుల విషయం ఎలా ఉన్నా... తనకు వచ్చే జీతంలో నాలుగో వంతు సేవాకార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు రాజమండ్రికి చెందిన రైల్వే ఉద్యోగి కేశవభట్ల శ్రీనివాసరావు. రైల్వే స్క్వాడ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్గా ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్న ఆయన పరిచయం... పెద్దఎత్తున సేవాకార్యక్రమాలు చేయాలంటే అందుకు నిధులు కూడా అధికంగానే ఉండాలి. ‘‘జీతం చేతికి రాగానే సేవాకార్యక్రమాల కోసం కొంత పక్కన పెట్టి, మిగిలిన దానితో కుటుంబాన్ని నడిపాను. ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూనే అట్టడుగు వర్గాల వారికి పాతిక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను’’ అని సేవాకార్యక్రమాలకు నాంది పలికిన విధానాన్ని వివరించారు ఐదు పదుల శ్రీనివాసరావు. సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి అనువుగా స్నేహితుల సహాయసహకారాలతో ‘కేశవభట్ల ఛారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభించారు. దీని ద్వారా అనేక విద్య, వైద్య, ఆరోగ్య, వికలాంగుల సేవాకార్యక్రమాలు చేపట్టారు. ‘‘రైల్వే స్టేషన్లో దారితప్పిన చిన్నారులను చేరదీసి వారి తల్లిదండ్రులకు అప్పగించడం నాకు ఎంతో తృప్తినిచ్చింది’’ అంటారు శ్రీనివాస్. అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవడం ద్వారా ట్రస్ట్ సేవలను మరింతగా విస్తరించాలనే ఆలోచనకు నాంది పలికారు ఆయన. వికలాంగులకు సేవ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగులకు వీల్‌ఛైర్స్ అందచేశారు. మెగా మెడికల్ క్యాంప్‌లు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యుద్ఘాతానికి గురైన ఎనిమిదేళ్ల చిన్నారికి కృత్రిమ కాలిని అమర్చడంలో సహకరించారు. ఉచిత బీమా రాష్ట్రంలోనే ఇప్పటివరకూ ఎవరూ చేపట్టని కార్యక్రమంగా కార్మికులకు ఉచిత జీవిత బీమా కార్యక్రమం ఏర్పాటుచేశారు. నాలుగు వేల మంది ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు, భవననిర్మాణ కార్మికులు, రైల్వే వెండర్సు, పోర్టర్స్కు రెండు లక్షల విలువైన ఉచిత జీవిత బీమా బాండ్లను అందచేశారు. విద్యావితరణ కార్పొరేట్ విద్యాసంస్థలతో మునిసిపల్ స్కూల్ విద్యార్థులు పోటీ పడేలా వారిని ప్రోత్సహించడానికి విద్యావితరణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతిభ కనపరిచిన మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు ప్రోత్సాహక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం చేసేందుకు అవసరమైన కంచాలు, గ్లాసులు అందించారు. నీలం తుఫాన్ బాదితులకు... ‘నీలం’ తుఫాన్ కారణంగా పలు రైళ్ళలో ప్రయాణిస్తున్న సుమారు 3000 మంది ప్రయాణికులు రాజమండ్రి రైల్వేస్టేషన్లో చిక్కుకుపోవడంతో వారి ఆకలి తీర్చేందుకు అప్పటికప్పుడు భోజన వసతులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఉత్తరాఖండ్ యాత్రికులకు రాజమండ్రిలో అల్పాహారం, మంచినీళ్ల బాటిల్స్ అందజేశారు. ‘‘మా వద్దకు వచ్చిన జాబితా నుండి ఏ విధమైన సిఫారసులు లేకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి ట్రస్ట్ సభ్యులు నిర్ణయించినవారికే సహాయం అందచేస్తాం. ఈ విషయంలో నేను ఏవిధమైన జోక్యం చేసుకోకపోవడం వల్లనే మమ్మల్ని ఎవరూ విమర్శించట్లేదు’’ అని వివరిస్తారు శ్రీనివాసరావు. అవార్డులు... 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ‘శ్రమశక్తి’ అవార్డు అందుకున్నారు. ‘‘ఈ అవార్డులు సమాజం పట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. మా అమ్మగారు వెంకట రమణమ్మ ‘సాధ్యమైనంతవరకు ఎదుటివారికి అపకారం తలపెట్టకుండా నిస్వార్థంగా సహాయపడు’ అని చెప్పిన మాట నా మనసులో బలంగా నాటుకుంది. రైల్వే ఉద్యోగంలో చేరిన మొదటిరోజు నుంచే కులమతాలకు అతీతంగా పేదలకు సహాయం చేస్తూ, నా లక్ష్యానికి శ్రీకారం చుట్టాను’’ అంటారు శ్రీనివాస్. - సూర్యనారాయణమూర్తి, సాక్షి ప్రతినిధి, రాజమండ్రి కాలేజ్‌లో చదివే రోజుల్లో మా నాన్నగారు నాకు పాకెట్ మనీ ఇచ్చేవారు. నేను ఆ డబ్బులు నా కోసం ఖర్చు చేయకుండా అవసరంలో ఉన్న తోటివిద్యార్థుల పుస్తకాలకు, ఫీజులకు ఖర్చుచేసేవాడిని. - కేశవభట్ల శ్రీనివాసరావు -
సీఎస్ఆర్ నిధులతో సామాజిక కార్యక్రమాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటివరకు జిల్లాలో రూ.3.87 కోట్లు సేకరించినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. జిల్లాలోని పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు తమ ఆదాయంలో 1 నుంచి 5 శాతం నిధులను సామాజిక సేవా కార్యక్రమాల కింద ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ పథకం గత కొన్నేళ్లుగా జిల్లాలో అమలు కావడంలేదు. ఏ ఒక్క పరిశ్రమ యాజమాన్యం, కార్పొరేట్ సంస్థ అధికార యంత్రాంగానికి పీఎస్ఆర్ నిధులను అందించలేదన్నారు. ఈ పథకంపై దృష్టి సారించి జిల్లాలోని పరిశ్రమలకు నోటీసులు జారీ చేయడంతో రూ.3.87 కోట్లు సమకూరినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం బహుళ జాతి సంస్థకు చెందిన అల్లానా పరిశ్రమ డెరైక్టర్ సీకే తోట రూ.20లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. ఈ నిధులతో విద్య,వైద్య రంగాలకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే రక్తహీనత, పోషకాహార లోపంతో ఉన్న గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన హైరిస్క్ కేంద్రాలకు ఈ నిధులు ఉపయోగిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. సంక్షేమ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు, అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం వేళ అల్పాహారం కోసం ఈ నిధులను వెచ్చిస్తున్నట్టు చెప్పారు. నిధుల వినియోగాన్ని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. జిల్లా నుంచి సీఎస్ఆర్ కింద రూ.41 కోట్లు రావాల్సి ఉందని, మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రాబట్టి జిల్లా సంక్షేమానికి వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జేసీ శరత్, సీపీఓ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.