అమికా జార్జ్ (ఫైల్ ఫోటో)
’ఇది ప్రతి స్త్రీ జీవితంలో అనుభవమయ్యే పునరుత్పత్తి పునాది ప్రక్రియ. కానీ ఏ దేశంలోనైనా చర్చించడానికి ససేమిరా ఇష్టపడని విషయం కూడా ఇదే. రక్తస్రావమనే అత్యంత సహజక్రియకి స్త్రీలంతా శిక్షింపబడుతున్నారు.’ అంటూ పట్టుమని పద్దెనిమిదేళ్ళు కూడా లేని కేరళ కుట్టి అమికా జార్జ్ బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ’’ఫ్రీ పీరియడ్స్’’ ఉద్యమం ఆమెకు గోల్‌కీపర్స్ గ్లోబల్ అవార్డు దక్కేలా చేసింది. సామాజిక అభివృద్ధి రంగంలో ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రగతిని పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా బిల్, మెలిండా ఫౌండేషన్ 2017లో గోల్‌కీపర్స్ అనే సామాజిక చైతన్య ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
18 ఏళ్ళ అమికా జార్జ్ పేద బాలికలకు ఉచిత సానిటరీ ప్యాడ్స్ కోసం బ్రిటన్ వీధుల్లో పూరించిన శంఖారావం ఆమెకు ఈ అవార్డు దక్కేలా చేసింది. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం చివరకు బ్రిటన్ పురవీధుల్లో స్త్రీపురుష భేదాన్ని మరిపిస్తూ సాగింది. దాదాపు 2000 మంది యువతీయువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు బ్రిటన్ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమావసరాలను తీర్చే ఉచితి సానిటరీ ప్యాడ్స్ కోసం 1.5 మిలయన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అభివృద్ధిచెందిన బ్రిటన్‌లాంటి దేశాల్లోనే ప్రతి పదిమంది బాలికల్లో ఒకరు సానిటరీ ప్యాడ్స్‌ని కొనుగోలు చేయలేని పేదరింకలో మగ్గుతున్నారని ప్లాన్ ఇంటర్నేషల్ సర్వేలో చదివిన 18 ఏళ్ల భారతీయ యువతి అమికా జార్జ్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమ క్రమంలో బ్రిటన్ పేద బాలికలు సానిటరీ ప్యాడ్స్‌ని కొనుక్కోలేని స్థితిలో ఆ అవసరానికి కాగితాలనూ, పాత న్యూస్ పేపర్స్‌నీ, సాక్స్‌నూ వాడుతుండడం తన హృదయాన్ని కలిచివేసిందంటారు అమికా జార్జ్.
దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆమె దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఇదే ఆమె చేపట్టిన ’’ఫ్రీ పీరియడ్’’ ఉద్యమానికి పునాది అన్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చరిత్ర చదవడానికి వెళ్ళి చరిత్ర సృష్టించిన∙అమికా జార్జ్. 2017 డిసెంబర్‌లో జరిగిన ఈ ఉద్యమం ఫలితంగా అక్కడి పేద బాలికలకు దక్కిన ఫలితాన్ని గుర్తించిన గోల్‌కీపర్స్ సోషల్ ప్రోగ్రెస్ ఆస్కార్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా సమాజాన్ని చైతన్యయుతం చేసిన ముగ్గురు మహిళలను ఈ అవార్డుకి ఎంపిక చేస్తే అందులో అమికా జార్జ్ ఒకరు. ఫ్రెంచ్ అధ్యక్షలు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, మహిళల పిల్లల హక్కుల కార్యకర్త గ్రేస్ మైఖస్త్ల్, రచయిత, సామాజిక కార్యకర్త రిచర్డ్ కర్టిస్ తదితర ప్రముఖులు ఈ అవార్డుల కార్యక్రమంలో ఉపన్యసించారు. న్యూయార్క్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇరాక్ కి చెందిన 24 ఏళ్ళ నదియా మురద్, కెన్యాకి చెందిన 28 ఏళ్ళ డిస్‌మస్ కిసిలు లకి సైతం అమికా జార్జ్‌తో సహా ఈ అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment