జీతం చేతికి రాగానే...ఇంటి అద్దెకు ఇంత, పిల్లల బడి ఫీజులకు ఇంత...
ఇలా లెక్కలు వేసుకుంటాం. ఫ్యామిలీ బడ్జెట్ తయారుచేసుకుంటాం.
మిగిలిన ఖర్చుల విషయం ఎలా ఉన్నా... తనకు వచ్చే జీతంలో నాలుగో వంతు సేవాకార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు రాజమండ్రికి చెందిన రైల్వే ఉద్యోగి కేశవభట్ల శ్రీనివాసరావు. రైల్వే స్క్వాడ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్న ఆయన పరిచయం...
పెద్దఎత్తున సేవాకార్యక్రమాలు చేయాలంటే అందుకు నిధులు కూడా అధికంగానే ఉండాలి. ‘‘జీతం చేతికి రాగానే సేవాకార్యక్రమాల కోసం కొంత పక్కన పెట్టి, మిగిలిన దానితో కుటుంబాన్ని నడిపాను. ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూనే అట్టడుగు వర్గాల వారికి పాతిక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను’’ అని సేవాకార్యక్రమాలకు నాంది పలికిన విధానాన్ని వివరించారు ఐదు పదుల శ్రీనివాసరావు.
సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి అనువుగా స్నేహితుల సహాయసహకారాలతో ‘కేశవభట్ల ఛారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభించారు. దీని ద్వారా అనేక విద్య, వైద్య, ఆరోగ్య, వికలాంగుల సేవాకార్యక్రమాలు చేపట్టారు. ‘‘రైల్వే స్టేషన్‌లో దారితప్పిన చిన్నారులను చేరదీసి వారి తల్లిదండ్రులకు అప్పగించడం నాకు ఎంతో తృప్తినిచ్చింది’’ అంటారు శ్రీనివాస్. అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవడం ద్వారా ట్రస్ట్ సేవలను మరింతగా విస్తరించాలనే ఆలోచనకు నాంది పలికారు ఆయన.
వికలాంగులకు సేవ
ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగులకు వీల్‌ఛైర్స్ అందచేశారు. మెగా మెడికల్ క్యాంప్‌లు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యుద్ఘాతానికి గురైన ఎనిమిదేళ్ల చిన్నారికి కృత్రిమ కాలిని అమర్చడంలో సహకరించారు.
ఉచిత బీమా
రాష్ట్రంలోనే ఇప్పటివరకూ ఎవరూ చేపట్టని కార్యక్రమంగా కార్మికులకు ఉచిత జీవిత బీమా కార్యక్రమం ఏర్పాటుచేశారు. నాలుగు వేల మంది ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు, భవననిర్మాణ కార్మికులు, రైల్వే వెండర్సు, పోర్టర్స్‌కు రెండు లక్షల విలువైన ఉచిత జీవిత బీమా బాండ్లను అందచేశారు.
విద్యావితరణ
కార్పొరేట్ విద్యాసంస్థలతో మునిసిపల్ స్కూల్ విద్యార్థులు పోటీ పడేలా వారిని ప్రోత్సహించడానికి విద్యావితరణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతిభ కనపరిచిన మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు ప్రోత్సాహక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం చేసేందుకు అవసరమైన కంచాలు, గ్లాసులు అందించారు.
నీలం తుఫాన్ బాదితులకు...
‘నీలం’ తుఫాన్ కారణంగా పలు రైళ్ళలో ప్రయాణిస్తున్న సుమారు 3000 మంది ప్రయాణికులు రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో చిక్కుకుపోవడంతో వారి ఆకలి తీర్చేందుకు అప్పటికప్పుడు భోజన వసతులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఉత్తరాఖండ్ యాత్రికులకు రాజమండ్రిలో అల్పాహారం, మంచినీళ్ల బాటిల్స్ అందజేశారు. ‘‘మా వద్దకు వచ్చిన జాబితా నుండి ఏ విధమైన సిఫారసులు లేకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి ట్రస్ట్ సభ్యులు నిర్ణయించినవారికే సహాయం అందచేస్తాం. ఈ విషయంలో నేను ఏవిధమైన జోక్యం చేసుకోకపోవడం వల్లనే మమ్మల్ని ఎవరూ విమర్శించట్లేదు’’ అని వివరిస్తారు శ్రీనివాసరావు.
అవార్డులు...
2013లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ‘శ్రమశక్తి’ అవార్డు అందుకున్నారు. ‘‘ఈ అవార్డులు సమాజం పట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. మా అమ్మగారు వెంకట రమణమ్మ ‘సాధ్యమైనంతవరకు ఎదుటివారికి అపకారం తలపెట్టకుండా నిస్వార్థంగా సహాయపడు’ అని చెప్పిన మాట నా మనసులో బలంగా నాటుకుంది. రైల్వే ఉద్యోగంలో చేరిన మొదటిరోజు నుంచే కులమతాలకు అతీతంగా పేదలకు సహాయం చేస్తూ, నా లక్ష్యానికి శ్రీకారం చుట్టాను’’ అంటారు శ్రీనివాస్.
- సూర్యనారాయణమూర్తి, సాక్షి ప్రతినిధి, రాజమండ్రి
కాలేజ్‌లో చదివే రోజుల్లో మా నాన్నగారు నాకు పాకెట్ మనీ ఇచ్చేవారు. నేను ఆ డబ్బులు నా కోసం ఖర్చు చేయకుండా అవసరంలో ఉన్న తోటివిద్యార్థుల పుస్తకాలకు, ఫీజులకు ఖర్చుచేసేవాడిని.
- కేశవభట్ల శ్రీనివాసరావు
సేవాపథంలో పాతికేళ్ల శ్రమశక్తి
Published Mon, Jun 30 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM
Advertisement